నందమూరి తారక రామారావు కుమారుడు, ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి హరికృష్ణ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సోషల్ మీడియా వేదికగా తమ జ్ఞాపకాలను పంచుకున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా స్పందిస్తూ, “నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. మా మధ్య కేవలం బంధుత్వం మాత్రమే కాదు… అంతకంటే ఎక్కువ ఆత్మీయత, స్నేహాన్ని మేమిద్దరం పంచుకున్నాం” అని పేర్కొన్నారు. హరికృష్ణ కేవలం కుటుంబ సభ్యులకే కాకుండా, పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు, నందమూరి అభిమానులకు కూడా ఆత్మీయతను పంచిన మంచి మనిషి అని చంద్రబాబు కొనియాడారు.
మంత్రి నారా లోకేశ్ సైతం తన ‘ఎక్స్’ ఖాతాలో, “హరి మామయ్య వర్థంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘననివాళులు అర్పిస్తున్నాను” అని పోస్ట్ చేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యులుగా హరికృష్ణ ప్రజలకు విశేష సేవలందించారని లోకేశ్ గుర్తు చేశారు. సినీ రంగంలోనూ తనదైన నటనతో తెలుగువారిని అలరించారని ప్రశంసించారు. “హరి మామయ్య లేనిలోటు తీర్చలేనిది. సినీ, రాజకీయ రంగానికి వారు చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందాం” అని లోకేశ్ పేర్కొన్నారు.
నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు.


