నమస్కారం.. మాది యాదాద్రి జిల్లా.. వలిగొండ మండలం.. ఊరు అరూర్. మీకు కనిపించేదంతా చెరువు కాదు.. మా 6 ఎకరాల పొలం. భారీ వర్షాల వల్ల వారం రోజుల నుంచి ఈ పొలం నీటిలోనే ఉంది. మోటర్లు, స్టార్టర్లు అన్నీ నీళ్లలోనే మునిగిపోయాయి. వర్షపు నీళ్లు పోవడానికి తూము కూడా ఉంది. తూము ఉన్నా కానీ.. నీళ్లు పోయేంత అనుకూలంగా లేదు. ఇంకో పదిహేను ఇరవై రోజుల్లో చేతికొచ్చే పంట వరద నీటిలో మునిగిపోయింది. దయచేసి జిల్లా కలెక్టర్ గారు స్పందించి.. మాకు ఆర్థిక సహాయాలు అవసరం లేదు. మళ్లీ ఈ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోండి. రైతంటే టీవీషోలలో, సినిమాల్లో చూసినట్టు కాదు.. రైతు సమస్యలు వేరే ఉంటాయి. రైతు పండించిన పంటను తింటూ.. రైతుకు సమస్య వచ్చినప్పుడు ఎవ్వరూ పట్టించుకోరు.. వేలకోట్ల అప్పులు చేసే కంపెనీల్లో అప్పులు తీర్చే ప్రభుత్వాలు.. మా సమస్యను ఎందుకు పట్టించుకోవు. దయచేసి ఈ సమస్యలు మాకు రాకుండా చూసుకోండి.. అంటూ నిండా పదేళ్లు కూడా లేని బాలుడు మెడలోతు నీళ్లలోకి దిగి చేసిన మొర ప్రస్తుతం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలంగాణలో ఈ మధ్య భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యాదాద్రి జిల్లాలోనూ భారీ వర్షాలకు పంటపొలాలన్నీ మునిగిపోయాయి. దీంతో చేతికొచ్చిన పంట కాస్త నాశనం అయిపోయింది.
నెటిజన్లు మాత్రం ఈ వీడియోను చూసి అధికారులకు చేరే వారకు షేర్ చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా.. రైతుల బతుకులు మాత్రం మారవు.. అంటూ ప్రభుత్వంపై, అధికారులపై ఫైర్ అవుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి.. ఇలాంటి విపత్తుల సమయంలో రైతులను ఆదుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు.
I request the collector of Yadadri to follow up and this and solve to the best.See the maturity of child..Let’s all make a hand to help him.. @Collector_YDR @KVishReddy @KomatireddyKVR @kumbam_anil pic.twitter.com/Om3CDEF6Js
— Paka Vijay (@PakaVijay) September 20, 2020