మోడీ చెప్పింది నిజమా.? కేసీయార్ ఎన్డీయేలో చేరతానన్నారా.?

ఒకవేళ కేటీయార్‌ని తెలంగాణ ముఖ్యమంత్రిగా చేయాలని కేసీయార్ అనుకుంటే, దానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ‘పర్మిషన్’ తీసుకోవాల్సిన అవసరమేముంటుంది.? ఈ చిన్న లాజిక్కుని ప్రధాని నరేంద్ర మోడీ ఎలా మిస్సయ్యారబ్బా.?

తెలంగాణ పర్యటనలో భాగంగా నిన్న నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ సమాజంలో భారత్ రాష్ట్ర సమితికి అడ్వాంటేజ్ అయ్యాయి. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ తనను కలిసి, ఎన్డీయేలో చేరతానని అడిగారంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

‘మేం ఎన్డీయేలో చేరతాం.. నా కుమారుడు కేటీయార్‌ని తెలంగాణ ముఖ్యమంత్రిని చేస్తాను.. మీరు సహకరించండి..’ అని కేసీయార్ తనను అడిగినట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. కేసీయార్ స్వయంగా వచ్చి ఎన్డీయేలో చేరతానని చెప్పినా, తాను ఒప్పుకోలేదన్నది ప్రధాని నరేంద్ర మోడీ ఉవాచ.

ఇదొక కట్టుకథలా వుంది తప్ప, ఏమాత్రం ఇందులో వాస్తవం లేదన్న విషయం సామాన్యుడికి సైతం అర్థమవుతోంది. అసలు, ఇలా మాట్లాడాలని ప్రధాని నరేంద్ర మోడీకి సలహా ఇచ్చిందెవరబ్బా.? ఈ మాటతో, ప్రధాని నరేంద్ర మోడీ తన స్థాయిని తగ్గించుకున్నట్లయ్యింది. అదే సమయంలో, బీఆర్ఎస్‌కి ఆయన వ్యాఖ్యలు అడ్వాంటేజ్‌గా మారాయి కూడా.

‘కేసీయార్ ఫైటర్.. బీజేపీ అనేది ఛీటర్.. ఓ ఫైటర్ ఎలా ఛీటర్‌తో చేతులు కలుపుతారు..’ అంటూ తెలంగాణ మంత్రి కేటీయార్ ఘాటుగానే స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వని ప్రధాని నరేంద్ర మోడీతో మేమెలా కలుస్తాం.? అని కేటీయార్ ప్రశ్నించారు.

మరోపక్క, ‘కేటీయార్‌ని ముఖ్యమంత్రిని చేయాలని కేసీయార్ అనుకుంటే, దానికి ప్రధాని నరేంద్ర మోడీ అనుమతి ఎందుకు..’ అని నిలదీశారు మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. విభజన చట్టం ప్రకారం, తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రాజెక్టుల్ని ఇవ్వకుండా చేస్తోన్న ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణ ప్రజలు విశ్వసించబోరన్నది తలసాని ఉవాచ.