మోడీ మళ్ళీ నవ్వారు.! బీజేపీకి తిరుగే లేదిక.!

దేశంలో చాలా రాజకీయ పార్టీలు డీలాపడిపోయాయి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బంపర్ విక్టరీ కొట్టాక. ఈ ఎన్నికలో బీజేపీకి సార్వత్రిక ఎన్నికల ముందర ‘టెస్టింగ్ శాంపిల్’ అని అంతా అనుకున్నారు. అందులో నిజం లేకపోలేదు కూడా.

‘సొంత రాష్ట్రంలోనే బీజేపీని గెలిపించుకోలేకపోయిన బీజేపీ.. బీజేపీ పతనానికి గుజరాత్ ప్రజలు నాంది పలికారు..’ అనే హెడ్‌లైన్స్ వచ్చి వుండేవి ఒకవేళ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గనుక బీజేపీ ఓడిపోయి వుంటే. కానీ, ఇప్పుడు సీన్ మారింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ ఇలాంటి విక్టరీనే కొట్టబోతోందన్న సంకేతాలు వెళుతున్నాయి.

అసెంబ్లీ ఎన్నికలకీ, లోక్ సభ ఎన్నికలకీ చాలా తేడా వుంటుంది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు తీసుకుంటే, అధికార టీఆర్ఎస్ బంపర్ విక్టరీ కొట్టింది. కానీ, లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ బోల్తా కొట్టేసింది. అయితే, అది ప్రాంతీయ పార్టీ మాత్రమే. ప్రాంతీయ పార్టీలకీ.. జాతీయ పార్టీలకూ లెక్కల్లో చాలా తేడాలుంటాయ్.

వరుసగా రెండు సార్లు దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ముచ్చటగా మూడోసారి కూడా అధికారంలోకి రావాలనే పట్టుదలతో వుంది బీజేపీ. అందుకు తగ్గట్టుగానే ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసుకుంటూ వెళుతోంది బీజేపీ. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణపై ప్రస్తుతం ఫోకస్ పెట్టింది కమలదండు.!

ఎలా చూసుకున్నా, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి తిరుగుండకపోవచ్చు. బీజేపీని ప్రసన్నం చేసుకుంటేనే, ఏ రాష్ట్రంలో అయినా ప్రాంతీయ పార్టీలు మనుగడ సాధించేది.. అన్న అభిప్రాయం బలపడుతోందిప్పుడు.