బీజేపీపై ఫ్లెక్సీలతో సమరం మొదలుపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కవిత ఈడీ విచారణకు హాజరువుతుండగా ఆమెకు మద్దతుగా హైదరాబాద్ లో పోస్టర్లు ఫ్లెక్సీలు వెలిశాయి. బీజేపీలో చేరకముందు చేరిన తర్వాత అంటూ పలువురు బీజేపీ నేతల ఫొటోలతో ఢిల్లీలో పలు చోట్ల ఫ్లెక్సీలు కనపడుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు నేతలు సీబీఐ ఈడీ రెయిడ్స్ జరగగానే కాషాయరంగు పూసుకొని బీజేపీలో చేరిపోయారంటూ ఫ్లెక్సీలతో విమర్శలు కురిపించారు.
ఒకపక్క హస్తినలో కవిత విచారణ సందర్భంగా 144 సెక్షన్ విదిస్తే… మరోపక్క హైదరాబాద్ లోనూ వాతావరణం వేడెక్కుతుంది. కవిత విచారణ సందర్భంగా… ఇంతసేపూ బీజేపీ – బీఆరెస్స్ నేతల మధ్య మాటల యుద్దాలు జరగగా… ఇప్పుడు అదికాస్తా ఫ్లెక్సీల వరకూ చేరింది. ఈ నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా నగరంలో వెలిసిన పోస్టర్లు, ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. “సీబీఐ – ఈడీ – బీజేపీ బెదిరింపు రాజకీయాలు”, “నిజమైన రంగులు వెలసిపోవు… బైబై మోడీ” అంటూ పోస్టర్లు. “బీజేపీలో చేరకముందు.. చేరిన తర్వాత” అంటూ ఫొటోలతో ఫ్లెక్సీలు భాగ్యనగరంలో దర్శనమిస్తున్నాయి!
అవన్నీ ఒకెత్తు అయితే… “డెస్ట్రాయర్ ఆఫ్ డెమోక్రసీ.. అండ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ హిపోక్రసీ” అంటూ హైదరాబాద్ లో వెలిసిన ఒక ఫ్లెక్సీ మరొకెత్తు. ఈ ఫ్లెక్స్ లో మోడీ ముఖంతోపాటు మరో తొమ్మిడి తలలు పెట్టి… ఒక్కో తలపై ఈడీ, సీబీఐ, ఐటీ, ఈసీ, ఐబీ, ఎంచీబీ, ఎనైయే అంటూ ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో పాటు ఎన్నికల కమిష పేరును కూడా పరోక్షంగా రాసిపెట్టారు! అవును… కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన జరుగుతుండగా… నగరం నడిబొడ్డున రావణ అవతారంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రంతో కూడిన భారీ హోర్డింగ్ ఏర్పాటైంది!
ఇదే క్రమంలో… ప్రస్తుత కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా.. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.. పశ్చిమ బెంగాల్ బీజేపీ ముఖ్యనేత సువేందు అధికారి.. ఏపీకి చెందిన బీజేపీ నేత సుజనా చౌదరి.. కేంద్రమంత్రి నారాయణ రాణెతో ఫోటోలతో… రైడ్స్ కి ముందు – రైడ్స్ కి తర్వాత అంటూ ఒక పోస్టర్ వేసిన బీఆరెస్స్ శ్రేణులు… కవితకు మాత్రం రైడ్స్ కి ముందు – రైడ్స్ తర్వాత కూడా ఎలాంటి మరకలు అంటలేని అర్థం ఫ్లెక్సీలు – పోస్టర్లు ఏర్పాటుచేశారు! ప్రస్తుతం నగరంలో ఇవే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారగా… ఈ పోస్టర్లను చింపేసే పనికి బీజేపీ కార్యకర్తలు పూనుకుంటే… ఘర్షణ వాతావరణం తలెత్తే ప్రమాదం ఉందని గ్రహించిన పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారట!