టిఆర్ఎస్ లో ఎమ్మెల్సీ రాములు నాయక్ మీద వేటు (వీడియో)

టిఆర్ఎస్ ఫౌండర్ మెంబర్, సీనియర్ నేత, ఎమ్మెల్సీ రాములు నాయక్ పై వేటు పడింది. ఆయన నారాయణఖేడ్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాాలని టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ను కోరారు. అయితే సిట్టింగ్ గా ఉన్న భూపాల్ రెడ్డికే కేసిఆర్ మళ్లీ అవకాశం ఇచ్చారు.

ఈ నేపథ్యంలో తాను అక్కడ రెబెల్ గా పోటీ చేసే ప్రయత్నాలు చేశారు రాములు నాయక్. తాను రెబెల్ గా చేస్తానని ప్రకటించడం ద్వారా అధిష్టానానంపై వత్తిడి తెచ్చి టికెట్ సాధించే ప్రయత్నం చేశారు. అయితే ప్రకటించిన 105 మంది సభ్యుల జాబితాలో ఒక్క పేరు కూడా మార్చే ప్రసక్తే లేదని కేసిఆర్ తేల్చి చెప్పారు.

దీంతో రాములు నాయక్ తన దారి తాను చూసుకుంటున్నారు. ఆయన కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపారు. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు రాములు నాయక్ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆయన కాంగ్రెస్ గూటకిి చేరడం ఖాయమని తేలిపోవడంతో టిఆర్ఎస్ నాయకత్వం అప్రమత్తమైంది. ఆయన పార్టీకి గుడ్ బై చెప్పే ముందే వేటు నిర్ణయం తీసుకుంది.

రాములు నాయక్ మీద సస్పెన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని పార్టీ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఇక రాములు నాయక్ కాంగ్రెస్ లో చేరడం లాంఛనప్రాయమే అయింది. ఆయన ఖమ్మం జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గంలో పోటీచేసేందుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలను అడిగినట్లు తెలుస్తోంది.

తనమీద వేటు వేయడంతో రాములు నాయక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన మీడియాతో అన్ని విషయాలు మాట్లాడే అవకాశం ఉంది. అయితే రాములు నాయక్ టిఆర్ఎస్ పార్టీలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా పార్టీని వీడకుండా పార్టీలోనే కొనసాగారు. టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన ఆవేదన చెందారు. గిరిజన వర్గానికి చెందిన ఫౌండర్ మెంబర్ అయిన తనను కనీసం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాములు నాయక్ కు టిఆర్ఎస్ లో మంచి అవకాశాలే వచ్చాయని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. గతంలో కేసిఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నేషనల్ కమిషన్ మెంబర్ గా అవకాశం కల్పించారని, మొన్న ఎమ్మెల్సీగా ఇచ్చారని అంటున్నారు. అయినా రాములు నాయక్ తొందరపడి ఇబ్బందులు పడే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. 

రాములు నాయక్ కాంగ్రెస్ పెద్దల టచ్ లోకి వెళ్లడంతో ఇక ఉపేక్షించేది లేదని టిఆర్ఎస్ డిసైడ్ అయింది. పార్టీ ఫౌండర్ మెంబర్ గా ఉన్నందున ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేసిన ఫలించలేదని టిఆర్ఎస్ నేతలు అంటున్నారు. మరోవైపు ఎఐసిసి జనరల్ సెక్రటరీ సలీమ్ అహ్మద్ తో రాములు నాయక్ భేటీ అయ్యారు. ఈ పక్కా సమాచారం రాగానే రాములు నాయక్ మీద వేటు వేసింది పార్టీ నాయకత్వం. రాములు నాయక్ గోల్కొండ హోటల్ లో ఆదివారం ఎఐసిసి పెద్దలను కలిసిన వీడియో కింద ఉంది చూడండి.

మరి మధ్యాహ్నం 3గంటల ప్రెస్ మీట్ లో రాములు నాయక్ ఏం మాట్లాడతారో అని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.