ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ పక్రియ తెలంగాణలో కొనసాగుతోంది. వీటిల్లో జనసేన పార్టీ, తమ మిత్రపక్షం బీజేపీకి కాకుండా, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి సురభి వాణికి మద్దతు ప్రకటించిన విషయం విదితమే. పీవీ కుటుంబం నుంచి వచ్చారన్న కారణంగా సురభి వాణికి జనసేన మద్దతిచ్చింది.
నిజానికి, ఇలా సురభి వాణికి జనసేన మద్దతివ్వడం వెనుక, బీజేపీపై ఆ పార్టీకి వున్న అసహనమే కారణం. ‘తెలంగాణలో బీజేపీ కారణంగా అవమాన భారం ఎదుర్కొంటున్నాం. అందుకే, కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా సురభి వాణికి మద్దతిస్తున్నాం. మేం మిత్రపక్షం కానే కాదని తెలంగాణ బీజేపీనే చెప్పేసింది కదా..’ అంటూ జనసేన తెలంగాణ నేతలే కాదు, సాక్షాత్తూ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేశారు. ఇక, ఈ ఎఫెక్ట్ స్పష్టంగానే కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి – బీజేపీ మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా తక్కువగా కనిపిస్తోందంటే, ఖచ్చితంగా అది జనసేన ప్రభావమేనని ఆఫ్ ది రికార్డుగా తెలంగాణ బీజేపీ నేతలూ అంగీకరిస్తున్న పరిస్థితి. ‘కీలకమైన సమయంలో జనసేనను దూరం చేసుకున్నాం..’ అనే భావనలో తెలంగాణ బీజేపీకి చెందిన కొందరు నేతలున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తర్వాత బీజేపీ ఆలోచనల్లో స్పష్టమైన మార్పు వచ్చింది.
ఆ కారణంగానే గ్రేటర్ ఎన్నికల సమయంలో జనసేన మీద అవమానకరమైన రీతిలో మాట్లాడారు కొందరు కమలం పార్టీ నేతలు. అయితే, ఈ సమయంలో జనసేన అధినేతతో బీజేపీ పెద్దలు మంతనాలు జరిపి, గ్రేటర్ ఎన్నికల్లో జనసేన మద్దతును కూడగట్టగలిగారు. మళ్ళీ మిత్రధర్మానికి తూట్లు పొడుస్తూ, ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కొందరు తెలంగాణ కమలనాథులు జనసేన మీద అవాకులు చెవాకులు పేలిన ఫలితం.. ఆ పార్టీని నిండా ముంచేసిందన్నమాట.