అమ్మకానికి ఎమ్మెల్యేలు.! తెలంగాణ రాజకీయం ఏమవబోతోంది.?

నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందన్నది ఓ ఆరోపణ.. అది అభియోగంగా మారింది కూడా.! రెడ్ హ్యాండెడ్‌గా బీజేపీ బ్రోకర్లను పట్టించామని, ఈ కేసులో సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయిన ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది ఈ వ్యవహారంలో. అయితే, ఆ డీల్ సందర్భంగా ఎలాంటి సొమ్మూ లభ్యం కాకపోవడంతో, ఈ కేసు ఎంత గట్టిగా నిలబడుతుందనేదానిపై భిన్న వాదనలున్నాయి. ‘ప్రజా ప్రతినిథుల్ని ఎలా కొనేస్తున్నారో చూస్తున్నాం.. రాజకీయ అవినీతి దేశానికి చీడలా మారింది..’ అని ఇటీవల ఓ కేసు విచారణ సందర్భంగా ఓ న్యాయమూర్తి అభిప్రాయపడటం చూశాం.

ఇంతకీ, తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసు ఏం అవబోతోంది. తెలంగాణలో కొన్నేళ్ళ క్రితం నామినేటెడ్ ఎమ్మెల్యేగా వున్న స్టీఫెన్‌సన్ ఓటుని కొనుగోలు చేసేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అప్పటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి ప్రయత్నించి, ఏసీబీకి చిక్కిన విషయం విదితమే.. అదీ రెడ్ హ్యాండెడ్‌గా. ఆ కేసులో రిమాండ్ ఖైదీగా కొన్నాళ్ళు రేవంత్ రెడ్డి జైల్లో వున్నారు తప్ప. ఇప్పటికీ ఆ కేసులో రేవంత్ రెడ్డి దోషిగా తేలలేదు.. దోషిగా శిక్ష అనుభవించిందీ లేదు. అలాంటప్పుడు, తాజాగా నడిచిన ఎమ్మెల్యేల కొనుగోళ్ళ నాటకంలో నిందితులు దోషులుగా మారేదెప్పుడు.? తెలంగాణ ప్రభుత్వం మాత్రం, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. కేసు విచారణ శరవేగంగా జరుగుతుందని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. నమ్మొచ్చా.?