ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది టిఆర్ఎస్ లో రాజీనామాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఓ వైపు హరీష్ రావు, కేటిఆర్ లు ఎత్తుగడలు వేస్తుంటే వారి ఎత్తుగడలను తలదన్నేలా స్వంత పార్టీ నేతలే పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళుతున్నారు. టిఆర్ఎస్ పార్టీలో తగిన గుర్తింపు లేదని పైసలున్నోళ్లకే టిఆర్ఎస్ లో గుర్తింపు ఉందంటూ పలు విషయాలను వారు వెల్లడించారు. తాజాగా పలువురు కీలక నేతల రాజీనామా నుంచి తేరుకోక ముందే రంగారెడ్డి జిల్లాలో కీలక మహిళా నేత రాజీనామా చేసి టిఆర్ఎస్ కు షాకిచ్చారు.
రంగారెడ్డి జిల్లా మంచాల ఎంపీపీ జయమ్మ తో సహా నాలుగు మండలాల టిఆర్ ఎస్ అధ్యక్షులు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మల్ రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. మల్ రెడ్డి రంగారెడ్డి బిఎస్పీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటి చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించినా టికెట్ రాకపోవడంతో రంగారెడ్డి కాంగ్రెస్ జెండాతోనే ప్రచారం చేస్తున్నారు.
కీలక మహిళా నేతతో సహా నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు రాజీనామా చేయడంతో ఇబ్రహీం పట్నం టిఆర్ఎస్ అభ్యర్ధి మంచిరెడ్డి కిషన్ రెడ్డికి పెద్ద షాక్ తగిలింది. అతని గెలుపు పై అందరికి అనుమానాలు ఏర్పడ్డాయి. జయమ్మ తన రాజీనామా పై ఏమన్నారంటే…
“టిఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఎంపిటిసిగా మరియు మంచాల ఎంపీపీగా ఎన్నికయ్యాను. ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అభివృద్ది పథకాల విషయంలో, నిధుల మంజూరులో ఏ రోజు కూడా సహకరించలేదు. ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు. మంత్రి కేటిఆర్, మహేందర్ రెడ్డిలను కలిసే ప్రయత్నం చేసిన ముందుగా కిషన్ రెడ్డిని కలిసి రండి లేకపోతే అతనిని తీసుకొని రండి అని సమాధానం చెప్పేవారు. పార్టీలో గౌరవం ఉండేది కాదు. ఎమ్మెల్యే సహకారం లేకపోవడంతో అభివృద్ది చేయలేకపోయాం. మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ప్రచారం చేయలేకనే పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతున్నాను” అని జయమ్మ తెలిపారు.
బుధవారమే రంగారెడ్డి జిల్లా టిఆర్ఎస్ ఉపాధ్యక్షుడు, ఉద్యమకారుడు చిరుమామిళ్ల మధు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పటికే చేవేళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి టిఆర్ఎస్ కు రాజీనామా చేశారు. పార్టీలో తనకు ప్రాదాన్యత లేదన్న కారణంగానే ఆయన పార్టీని వీడారు. రంగారెడ్డి జిల్లాలో మంత్రి మహేందర్ రెడ్డికి అధిక ప్రాధాన్యత ఇస్తూ తనను చిన్నచూపు చూస్తున్నారని ఆయన గత కొంతకాలంగా ఆవేదనతో ఉన్నారు.
తన తాత రాజకీయాల్లో చేసిన సేవలకు గుర్తుగా తన తాత కొండా వెంకట రంగారెడ్డి పేరు మీదుగానే రంగారెడ్డి జిల్లా ఏర్పాటైన విషయాన్ని ఆయన తన సహచరుల వద్ద గుర్తు చేసుకున్నారు. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన తమకు టిఆర్ఎస్ లో ఏమాత్రం గౌరవం దక్కలేదని మదనపడ్డారు. తన కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం దక్కలేదు కాబట్టే టిఆర్ఎస్ కు రాజీనామా చేశానన్నారు.
విశ్వేశ్వర్ రెడ్డి తర్వాత వికారాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవ్ రావు టిఆర్ఎస్ కు రాజీనామా చేశారు. పార్టీలో చాలా కాలం నుంచి వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
టిఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఐడిసి చైర్మన్ బుడాన్ బేగ్ టిఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆయన నిర్ణయంతో ఖమ్మం జిల్లా కార్యకర్తల్లో కలకలం రేగింది. బుడాన్ బేగ్ గత కొంత కాలంగా పార్టీ తీరు పై అసంతృప్తితో ఉన్నారు. ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని ఆయన ఆశించినట్టుగా కార్యకర్తల ద్వారా తెలుస్తోంది. దీని పై చర్చించేందుకు కేటిఆర్ అపాయిట్ మెంట్ కోరినా ఇవ్వలేదని తెలిసింది. రెండేళ్లుగా కేసీఆర్ అపాయిట్ మెంట్ ఇవ్వలేదని, కేటిఆర్ ను సంవత్సరం నుంచి అపాయిట్ మెంట్ కోరినా కూడా పట్టించుకోలేదని తెలుస్తోంది. అందుకే ఆయన పార్టీకి రాజీనామా చేశారు.
కూకట్ పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ , కేటిఆర్ అత్యంత సన్నిహితుడు గొట్టిముక్కల పద్మారావు కూడా టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. గత కొంత కాలంగా పద్మారావు అసంతృప్తిగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనడం లేదు. ఆయన కూకట్ పల్లి అసెంబ్లీ నుంచి సీటును ఆశించినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సీటు విషయమై కేటిఆర్ ను కలిసి విషయాన్ని చెప్పారని అయినా కూడా ఆయన నుంచి స్పందన లేదని పద్మారావు అనుచరులు తెలిపారు.
ఇలా వరుసగా కీలక నేతలు పార్టీని వీడడంతో కింది స్థాయిలో కార్యకర్తలతో కీలకంగా వ్యవహరించే నేతలు లేకపోవడంతో క్యాడర్ లో కలవరం మొదలైంది. టిఆర్ఎస్ నేతలు ఆపరేషన్ ఆకర్ష్ చేద్దామంటే ఆపరేషన్ వికర్ష్ అవుతుందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. త్వరలోనే మరికొంత మంది టిఆర్ఎస్ కీలక నేతలు పార్టీని వీడడం ఖాయమన్నారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లోకి తీసుకొని కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరించారని వారు గుర్తు చేశారు. కేసీఆర్ కు స్వంత పార్టీ నేతలే ఝలక్ ఇస్తుండడంతో ఏం చేయాలో తోయక తలపట్టుకుంటున్నారని వారు ఎద్దేవా చేశారు.