మహా కూటమి లో సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి రాకముందే కూటమిలో లుకలుకలు బయటకొస్తున్నాయి. నాలుగు పార్టీలు కావడంతో టికెట్ ఆశావహులు తమకు రాదని తేలిన మరుక్షణమే పక్క పార్టీలకు జంపింగ్ జపాంగ్ చేస్తున్నారు. నిన్న మొన్ని వరకు కూటమిలో సీటు కోసం ఆశతో ఉన్న తెలంగాణ జన సమితి నేత తాజాగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎవరా నాయకుడు, ఎక్కడి లీడర్ తెలుసుకుందాం ఈ స్టోరీ చదివి.
మహా కూటమిలో తెలంగాణ జన సమితి కోరిన స్థానాల్లో పాలమూరు హెడ్ క్వార్టర్ కూడా ఉంది. మహబూబ్ నగర్ సీటు కోసం తెలంగాణ జన సమితి చివరి వరకు ప్రయత్నం చేసింది. కానీ కూటమిలో జన సమితికి ఆ చాన్స్ రాలేదు. ఆ సీటును టిడిపి తీసుకుంది. టిడిపి తరుపున బిసి నేతగా ఉన్న ఎర్ర శేఖర్ మహబూబ్ నగర్ లో పోటీ చేయబోతున్నారు. ఎర్ర శేఖర్ గతంలో జడ్చర్ల నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ కూటమిలో ఆయన సీటును కాంగ్రెస్ తీసుకుంది. మాజీ ఎంపి డాక్టర్ మల్లు రవి ఆ సీటులో పోటీకి దిగబోతున్నారు. దీంతో ఎర్ర శేఖర్ కు సీటు లేకుండాపోయింది. అందుకే ఎర్ర శేఖర్ ను మహబూబ్ నగర్ లో చోటు కల్పించారు.
ఈ పరిస్థితుల్లో మహబూబ్ నగర్ సీటు కోసం సీరియస్ గా ప్రయత్నం చేశారు తెలంగాణ జన సమితి నాయకులు జి.రాజేందర్ రెడ్డి. ఆయన కోదండరాం కు అత్యంత సన్నిహితుడుగా పేరు తెచ్చుకున్నారు. జి. రాజేందర్ రెడ్డి ఉద్యోగ సంఘం నాయకుడిగా పాలమూరు జిల్లాలో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. తనకు సీటు గ్యారెంటీ, గెలుసుడు పక్కా అనుకున్న రాజేందర్ రెడ్డికి కూటమి షాక్ ఇచ్చింది. దీంతో ఆయన కూటమికి రివర్స్ షాక్ ఇచ్చారు. కూటమికి, తెలంగాణ జన సమితికి గుడ్ బై చెప్పి బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయనకు మహబూబ్ నగర్ సీటును ఇచ్చేందుకు బిజెపి అంగీకరించినట్లు సమాచారం అందుతోంది.
సీట్ల సర్దుబాటు మహా కూటమిలో పెద్ద తలనొప్పిగా మారిందని పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు. సీటు వస్తుందంటే ఉండడు, లేదంటే జంపింగ్ జపాంగ్ అనుడే లక్ష్యంగా కూటమిలోని నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. సిద్ధాంత రాద్ధాంతాలేమీ లేకుండా ఏ పార్టీలో సీటొస్తుందనుకుంటే రాత్రికి రాత్రే ఆ పార్టీ కండువా కప్పుకునుడు అలవాటు చేసుకున్నారు రాజకీయ నాయకులు.
బిజెపి టచ్ లో మరింత మంది కూటమి లీడర్లు
మహబూబ్ నగర్ రాజేందర్ రెడ్డి ఒక్కడే కాకుండా మరింత మంది కూటమి నేతలు బిజెపి వైపు లుక్ వేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. కూటమి లో సీటు రాని బలమైన నేతలను గుంజుకుని టికెట్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసమే బిజెపి చాలా నియోజకవర్గాల్లో సీట్లను కేటాయించలేదు. అంతేకాకుండా మహాకూటమిలో చేరాలని చివరి వరకు ప్రయత్నం చేసిన యువ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ ఖాతరు చేయలేదు. దీంతో ఆ పార్టీ బిజెపితో చేతులు కలిపింది. వారే కాకుండా చాలా మంది కూటమి పార్టీలైన కాంగ్రెస్, టిడిపి, తెలంగాణ జన సమితి నేతలు బిజెపితో టచ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయా నేతలంతా నేరుగా బిజపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా తోనే టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు.
మరికొన్ని సీట్లలో కూటమి అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది. వారు ఖరారు కాగానే బలమైన అభ్యర్థులుగా ఉన్న వారంతా ముఖ్యంగా బిజెపి వైపు అడుగులు వేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో మహా కూటమి పుణ్యమా అని బిజెపికి కూడా బలమైన నాయకత్వం లభించబోతున్నదని పలువురు కూటమి నేతలు జోక్ చేసుకుంటున్నారు.