బ్రేకింగ్ న్యూస్ : తెలంగాణలో గ్రూప్ 2 కి లైన్ క్లియర్

తెలంగాణ ఏర్పాటైన నాటినుంచి నేటి వరకు ఏ ఒక్క నోటిఫికేషన్ ను కూడా సక్రమంగా నిర్వహించలేకపోయింది టిఎస్పిఎస్సీ. ఈ సంస్థ వెలువరించిన ఏ ఉద్యోగ నోటిఫికేషన్ అయినా కోర్టు మెట్లెక్కకుండా లేని పరిస్థితి. కొర్రీలతో నోటిఫికేషన్లు జారీ చేయడంతోనే నిరుద్యోగ అభ్యర్థులు కోర్టులకు వెళ్లిన దాఖలాలున్నాయి.

కోర్టుల్లో పదే పదే టిఎస్పీఎస్సీకి వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి. అందులో భాగమే టిఎస్పిఎస్సీకి వ్యతిరేకంగా మరో తీర్పు హైకోర్టులో వచ్చింది. టిఎస్పిఎస్సీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. ఆ వివరాలేంటో చదవండి.

టిఎస్పిఎస్సీ ఏర్పాటైన తర్వాత వెలువరించిన ఒకే ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్ కోర్టులో నానుతున్నది. ఆ నోటిఫికేషన్ వెలువరించి పరీక్ష జరిపిన తర్వాత వివాదం మొదలైంది. కొందరు అభ్యర్థులు వైట్నర్ వాడినట్లు, మరికొందరు డబుల్ బబ్లింగ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. 

ఆడవాళ్ల పుస్తెమెట్టెలు కూడా ఉడబీకేయించి పరీక్ష కేంద్రానికి అనుమతించిన చరిత్ర టిఎస్పిఎస్సీకి ఉంది. అంతటి మహా స్ట్రిక్ట్ సంస్థ అయిన టిఎస్పిఎస్సీ గ్రూప్ 2 విషయంలో మాత్రం ఊదాసీనంగా వ్యవహరించిందన్న విమర్శలు మూటగట్టుకుంది. వైట్నర్ వాడినా ఒకే అన్నది. డబుల్ బబ్లింగ్ చేసినా ఆల్ రైట్ అన్నది.

దీంతో ఆగ్రహానికి లోనైన అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. హైకోర్టు తీర్పు శుక్రవారం వెలువరించింది. వైట్నర్ వాడి జవాబులు మార్చి రాసిన అభ్యర్థులను జాబితా నుంచి తొలగించింది హైకోర్టు. అలాగే డబుల్ బబ్లింగ్ చేసిన వారిని కూడా లిస్ట్ లోంచి తీసేయాలంటూ హైకోర్టు ఆదేశాలు వెలువరించింది.

టిఎస్పిఎస్సీ అర్హులైన అభ్యర్థుల జాబితాలో ఈ రెండు కేటగిరీల వారిని చూపించింది. మొత్తం సెలెక్ట్ అయిన వారు 3147 మంది ఉన్నారు. అందులో 267 మంది డబుల్ బబ్లింగ్, వైట్నర్ వాడిన వారు ఉన్నారు. అందుకే హైకోర్టు ఆ 267 మందిని తొలగించింది. వారు పోగా మిగిలిన 2880 మంది మాత్రమే అర్హత సాధించినట్లు హైకోర్టు తేల్చింది.

ఈ 2880 మందిని 1 :2 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు సెలక్ట్ చేసింది హైకోర్టు. త్వరలోనే వీరందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వనున్నది టిఎస్పిఎస్సీ. 1032 పోస్టులకు గాను వీరందరినీ ఇంటర్వ్యూలు చేయనున్నారు.

మొత్తానికి చట్ట విరుద్ధంగా అర్హుల జాబితాలోకి 267 మందిని ఎక్కించి టిఎస్పిఎస్సీ ఘోరంగా అభాసుపాలైందని నిరుద్యోగ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి మీద టిఎస్పిఎస్సీ ఎందుకు అంత ప్రేమ ప్రదర్శించిందో ఎవరికీ అంతు చిక్కడంలేదని ఓయు కు చెందిన నిరుద్యోగ గ్రూప్ 2 అభ్యర్థి తెలిపారు. కోర్టులో నిలబడదని నెత్తి నోరు మొత్తుకున్నా టిఎస్పిఎస్సీ అర్హుల జాబితాలో వారి పేర్లు చేర్చిందన్నారు.