బ్రేకింగ్ : సీఐడీ కేసులో చంద్రబాబుకు ఊరట…!

The Top Secret Behind Chandrababu's Amaravathi project

సీఐడీ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబుపై సీఐడీ విచారణపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఆయనకు అమరావతి అసైన్డ్ భూముల అంశంలో సీఐడీ కొన్నిరోజుల కిందట నోటీసులు ఇవ్వడం తెలిసిందే. అయితే చంద్రబాబు తనకు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు పిటిషన్ పై నేడు విచారణ జరిపిన ఏపీ హైకోర్టు సీఐడీ విచారణను నిలుపుదల చేసింది.

AP High Court gives stay on CID case against Chandrababu

వాదనల సందర్భంగా… ఆరేళ్ల క్రితం ఇచ్చిన జీవోపై సీఐడీ విచారణ సహేతుకం కాదని చంద్రబాబు తరఫు న్యాయవాది పేర్కొన్నారు. చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. ఈ కేసులో బాధితులు ఎవరు? ఫిర్యాదు చేయాల్సింది ఎవరు? అని సీఐడీ అధికారులను ప్రశ్నించింది. ప్రాథమిక విచారణలో ఏ అంశాలు గుర్తించారో చెప్పాలని సీఐడీ అధికారులను కోరింది. చంద్రబాబు, నారాయణల పాత్రపై స్పష్టమైన ఆధారాలు ఉంటే చూపించాలని పేర్కొంది. దాంతో సీఐడీ తరఫు న్యాయవాది స్పందిస్తూ విచారణ తొలిదశలోనే ఉందని, పూర్తిస్థాయి విచారణకు అనుమతి ఇస్తే అన్ని ఆధారాలను గుర్తిస్తామని చెప్పారు. కాగా, ఈ కేసులో చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ కూడా నోటీసులు అందుకున్నారు. హైకోర్టు తాజా స్టేతో ఆయనకు కూడా ఊరట లభించినట్టయింది.

విచారణ సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రైతులెవరూ నష్టపోలేదు కదా, సీఆర్డీఏ వాళ్లు కూడా ఫిర్యాదు చేయలేదు కదా! అని ప్రస్తావించింది. అసైన్డ్ భూముల రైతులకు కూడా నష్ట పరిహారం అందింది కదా… మరి నష్టపోయామంటూ ఎవరు ఫిర్యాదు చేశారో చెప్పాలని ప్రశ్నించింది. మరలాంటప్పుడు కేసు ఏ విధంగా నమోదు చేశారని నిలదీసింది. అప్పటి కలెక్టర్ కాంతిలాల్ స్టేట్ మెంట్ ను సీఐడీ తరఫు న్యాయవాది ప్రస్తావించగా… సీఆర్డీయేలోని సెక్షన్ 146 ప్రకారం అధికారులను ఎలా విచారిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. డీవియేషన్ ఫైలు తేవాలని కాంతిలాల్ చెప్పారని సీఐడీ న్యాయవాది పేర్కొనగా, ఇది కేవలం నిర్లక్ష్యమేని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.