తెలంగాణ ఎన్నికలపై లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వే ఫలితాలను శుక్రవారం సాయంత్రం 7 గంటలకు విడుదల చేశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్వే వివరాలు ప్రకటించారు.
లగడపాటి ప్రకటించిన సర్వే ఫలితాలు చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావొచ్చని వెల్లడించారు. లగడపాటి చెప్పిన అంకెలివే.
కాంగ్రెస్ కూటమికి 65 సీట్లు వస్తాయి. ( ప్లెస్ ఆర్ మైనస్ 10)
టిఆర్ఎస్ పార్టీకి 35 సీట్లు వస్తాయి. (ప్లెస్ ఆర్ మైనస్ 10)
బిజెపికి 7 సీట్లు వస్తాయి. (ప్లెస్ ఆర్ మైనస్ 2)
ఇండిపెండెంట్లు 7 మంది గెలుస్తారు. (ప్లెస్ ఆర్ మైనస్ 2)
లగడపాటి సర్వే లెక్కల ప్రకారం చూస్తే కాంగ్రెస్ కూటమికి 65 ప్లెస్ ఆర్ మైనస్ 10 అంటే కాంగ్రెస్ కు 55 నుంచి 75 మధ్య సీట్లు వచ్చే చాన్స్ ఉంది.
ఇక టిఆర్ఎస్ పార్టీకి 25 సీట్ల నుంచి 45 సీట్ల మధ్య వచ్చే అవకాశం ఉంది.
ఇక కూటమిలో భాగంగా టిడిపి పోటీ చేసిన 13 సీట్లలో ఆ పార్టీకి 7 సీట్లు రావొచ్చని లగడపాటి చెప్పారు. టిడిపి పోటీ చేసిన 13 సీట్లలో ఒక సీటులో ప్రత్యర్థి పార్టీ ఎంఐఎం ఉండగా మరో రెండు సీట్లలో ఇండిపెండెంట్లు ఉన్నారు. మిగతా 10 సీట్లలోనే టిఆర్ఎస్ తో ఆ పార్టీ తలపడింది. అందులో 7 సీట్లు ఖాయంగా రావొచ్చని తేల్చారు.
ఇక తెలంగాణలో గతం కంటే ఎక్కువగా ఈసారి ఎన్నికల్లో డబ్బు ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ, కర్ణాటకలో ఎక్కువ డబ్బు ప్రభావం ఉంటుందని అనుకుంటారు. కానీ ఈసారి తెలంగాణలో డబ్బు ప్రభావం తీవ్రంగా ఉందన్నారు.
ఈ ఎన్నికల్లో డు పక్కల అనేక వాగ్దానాలు చేశారు. వాగ్దానాలు, డబ్బు బాగా ప్రజల్లో ప్రభావం చూపాయన్నారు. తాను ముందుగా ఇండిపెండెంట్లు 8 నుంచి 10 మంది గెలుస్తారని చెప్పానని కానీ 7 మంది ఇండిపెండెంట్లు గెలుస్తారని అంచనా వచ్చిందన్నారు. దానికి ప్లెస్ ఆర్ మైనస్ 2 ఉంటుందన్నారు. అంటే ఇండిపెండెంట్ లు 5 నుంచి 9 వరకు గెలవొచ్చని అన్నారు.
ఇక బిజెపి కూడా 7 గెలిచే చాన్స్ ఉందని చెప్పారు. అంటే అందులో ప్లెస్ ఆర్ మైనస్ 2 అన్నారు. దీన్నిబట్టి బిజెపి 5నుంచి 9 వరకు గెలిచే చాన్స్ ఉందన్నారు.
సిపిఐ, జన సమితి ఒకటో రెండు స్థానాలు గెలవొచ్చు. సిపిఎం కూడా ఒక సీటులో గెలవొచ్చని లగడపాటి చెప్పారు.
జాతీయ సర్వేలు చాలా వరకు ఫెయిల్ అయ్యాయి
సర్వేల విషయమై లగడపాట ిమాట్లాడుతూ జాతీయ సర్వేలకు తన సర్వేలకు మధ్య ఉన్న తేడాను వివరించారు. ఈ మధ్య నేషనల్ సర్వేలు చాలా మటుకు ఫెయిలయ్యాయి అన్నారు. కర్నాటక, తమిళనాడు ఎన్నికలలో అవి ఘోరంగా విఫలమయ్యాయి అన్నారు. ఒక్క లగడపాటి సర్వే మాత్రమే కర్నాటక, తమిళనాడులో నిజమయిందని గుర్తు చేశారు. నేషనల్ చానెల్స్ అన్నీ కూడా నార్త్ ఇండియన్ల వి. అవి దక్షిణాది ప్రజల నాడినిపట్ట లేకపోయాయని తేల్చిపారేశారు. నా సర్వే దక్షిణ భారత దేశానికి యూనిక్ సర్వేగా నిలబడిందన్నారు.
తెలంగాణ ఎన్నికల్లో తనకు ఎవరూ బంధువులు లేరని, అందరూ సమానమేనని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్, ఇతర రాజకీయ నేతలతో ఎలా ఉంటానో కేటిఆర్, కేసిఆర్ హరీష్ అందరితో అలాగే ఉంటానని చెప్పారు. రేవంత్ రెడ్డి ఎంతో హరీష్ రావు కూడా అంతే అన్నారు.
ఒకరిద్దరు పెద్ద నాయకులు ఓడిపోతారు
ఈ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు చూడబోతున్నారని లగడపాటి తేల్చి చెప్పారు. ఒకరిద్దరు పెద్ద నాయకులే ఓడిపోక తప్పదని చెప్పారు. పెద్ద నాయకుల జాబితాలో కేసిఆర్ ఉన్నారా అన్నదానికి ఆయన నేరుగా సమాధానం చెప్పలేదు. అయితే గతంలో మాట్లాడిన సమయంలో గజ్వేల్ లో కేసిఆర్ ఓడిపోతాడని తన నోటీసుకు వచ్చిందన్నారు. తాను గజ్వేల్ లో పర్యటించిన సమయంలో ఏడుగురు పోలీసులు సార్ (కేసిఆర్) ఓడిపోతాడు అని చెప్పినట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ లో నివాసం ఉండే ప్రజలు సెలవులు రావడంతో స్వస్థలాలకు వెళ్లారని చెప్పారు. అందుకే హైదరాబాద్ లో ఓటింగ్ తగ్గిందని చెప్పారు.
మొత్తానికి లగడపాటి సర్వే ఒకవైపు నిలిస్తే జాతీయ సంస్థల సర్వేలు ఒకవైపు నిలిచాయి. ఎవరి సర్వే నిజం? ఎవరి సర్వే ఫెయిల్ అన్నది డిసెంబరు 11వ తేదీన తేలనుంది. జాతీయ సర్వేలన్నీ టిఆర్ఎస్ వైపు మొగ్గు చూపిన వేళ లగడపాటి ఆ సర్వేలకు సవాల్ విసరారు. జాతీయ సర్వేలన్నీ ఫెయిల్ అయ్యాయని చెప్పారు. జాతీయ సర్వేలు చూసిన తెలంగాణ ప్రజలు కారు జోరు అనుకుంటున్నవేళ లగడపాటి మరింత ఉత్కంఠ రేపారు. మరి ఏం జగరబోతున్నదో మరో మూడు రోజులు ఉత్కంఠగా ఎదురుచూడక తప్పదు.