హైదరాబాద్: కూకట్‌పల్లిలో తీవ్ర కలకలం రేపిన మైనర్ బాలిక హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు, అతని ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు.
వివరాల్లోకి వెళితే కూకట్‌పల్లి పరిధిలోని సంగీత్‌నగర్‌లో సోమవారం ఓ మైనర్ బాలిక దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. తల్లిదండ్రులు పనులకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను లక్ష్యంగా చేసుకుని దుండగుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు, విచారణను వేగవంతం చేశారు.
కేసు విచారణలో భాగంగా, స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. బాలికను హత్య చేసిన అనంతరం, నిందితుడు ఘటనా స్థలం నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాలు ఒక సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు.
బాలికపై అత్యాచారానికి యత్నించగా, ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆధారాలు సేకరించాయి.
ప్రస్తుతం సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


