ఓటమిపై జనసేనాని పవన్ కళ్యాణ్ విశ్లేషించుకుంటారా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే, అప్పటికప్పుడు లక్ష మంది ఒకే చోట పోగైపోతారు. అందులో, పవన్ కళ్యాణ్ అభిమానులే 99 శాతం వుంటారన్నది నిర్వివాదాంశం. సినీ నటుడిగా పవన్ కళ్యాణ్‌ని చూసేందుకు ఎగబడే సామాన్యులు మిగతా 1 శాతం వుంటారనేది చాలామంది చెప్పేమాట.!

మరి, తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి మినహా ఎక్కడా జనసేన పార్టీ ఎందుకు చెప్పుకోదగ్గ ఓట్లు సాధించలేకపోయింది. మరీ దారుణంగా వెయ్యి ఓట్లకు కొన్ని చోట్ల పరిమితమైపోవడమేంటి.? ఐదు వేల కోట్లు దక్కడం మిగతా నియోజకవర్గాల్లో ఎందుకు గగనమైపోయింది.?

వాస్తవానికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలోనూ ఇలాంటి అనుభవాల్ని చవిచూశారు. కానీ, రాజకీయంగా ఆత్మవిమర్శ చేసుకోలేదు. తన అభిమానుల్లో ఎంతమంది ఓటర్లు వున్నారు.? వారిలో ఎంతమంది పోలింగ్ బూత్‌కి వచ్చి తనకు ఓట్లేస్తారు.? అన్నదానిపై ఆయన స్క్రూటినీ చేసుకోవాల్సి వుంది.

‘ముందు నన్ను గెలిపించండి.. ఆ తర్వాత నన్ను సీఎం పవన్ కళ్యాణ్ అని పిలవొచ్చు..’ అని పవన్ కళ్యాణ్ తన అభిమానుల మీదే చాలా సార్లు సెటైర్లు వేశారు. ‘మన దగ్గర పవర్ లేదు. నన్ను పవర్ స్టార్ అనొద్దు..’ అని కూడా పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ, అభిమానులు వినరు కదా.!

నో డౌట్.. పవన్ కళ్యాణ్ గనుక సీరియస్ పాలిటిక్స్ చేయాలనుకుంటే, విషయం వేరేలా వుంటుంది. దానికి చిత్తశుద్ధి అవసరం. అదే పవన్ కళ్యాణ్‌లో లోపిస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు, సోషల్ మీడియాలో చిల్లర వేషాలకే పరిమితమవుతున్నారు. అది మానేసి, రాజకీయంగా పవన్ కళ్యాణ్‌కి మద్దతిస్తే, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వేరేలా వుంటుంది.