మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని “చెత్త సర్కార్” అని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో మున్సిపల్ మరియు ఆరోగ్య శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా హైదరాబాద్ సహా ఇతర పట్టణాలలో పారిశుధ్యం క్షీణించి, చెత్తకుప్పలు, మురుగునీటితో నిండిపోయాయని ఆయన ఆరోపించారు.
ఈ కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలి, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. తమ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, వర్షాకాలానికి ముందే ముందుజాగ్రత్త చర్యలు తీసుకునేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని గుర్తుచేశారు.
ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, పాలకులు “ఆర్ఆర్ ట్యాక్స్” వసూళ్లలో బిజీగా ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోయారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి పుంజుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


