KTR: కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. తాను ప్రస్తుతం ఎమ్మెల్యేగా రాజీనామా చేసి తిరిగి ఎన్నికలలో పోటీ చేస్తూ గెలుస్తాను ఆ దమ్ము మీకుందా అంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి మీరు సిరిసిల్ల నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికలకు వెళ్దాము.
ఇలా ఉప ఎన్నికలలో పోటీ చేసి గెలిచే దమ్ము నీకుందా అలాగే కాంగ్రెస్లో చేరిన 10 మంది బి ఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు పంపించు అంటూ సవాల్ విసిరారు. ఇలా ఇద్దరం రాజీనామా చేద్దాం ప్రజలలో ఎవరికి వ్యతిరేకత ఉందో తేల్చుకుందాం అంటూ కేటీఆర్ తెలిపారు.ఏడాదిలోనే ఇంత తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదని ఎద్దేవా చేశారు. అడ్డగోలు హామీలిచ్చి ప్రజలతో తిట్లు పడుతున్నారని వివరించారు. అదానీ, అల్లుడు, సోదరులు, బావమరిది బాగు కోసమే రేవంత్‌రెడ్డి తపన పడుతున్నారని విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తి కావడంతో ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రేవంత్ రెడ్డి పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. ఇక తెలంగాణ తల్లిని మార్చడం గురించి కూడా ఈయన మాట్లాడారు. ఆలిని మార్చిన వాడిని చూసాము కానీ తల్లిని మార్చిన వాడిని ఎవరిని చూడలేదు.ఇప్పుడే చూస్తున్నాం. తల్లిని పేదరాలిగా చూడాలని కోరుకునే దిక్కుమాలిన సంస్కృతి కాంగ్రెస్ నేతలది. భరతమాత, తెలుగుతల్లి, కన్నడమాత.. రాచరిక పోకడలకు నిదర్శనమా? వాళ్లు పెడుతున్నది కాంగ్రెస్ తల్లిని. ఢిల్లీ తల్లిని అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు.
ఇక కెసిఆర్ అసెంబ్లీకి రాకపోవడం గురించి కూడా ఈయన మాట్లాడారు కెసిఆర్ అసెంబ్లీకి ఎందుకు రావాలని, రేవంత్ రెడ్డి బూతులు వినడానికి అసెంబ్లీకి రావాలా అంటూ ప్రశ్నించారు .ఆయన అసెంబ్లీకి రాకపోయినా ఆయన మార్గంలోని మేమంతా నడుస్తున్నామని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలకు సమాధానాలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు వెతుక్కుంటున్నారు ఇక కెసిఆర్ కు ఏం సమాధానం చెబుతారు అంటూ ఈయన ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రశ్నించారు.