సోషల్ మీడియా వేదికగా ట్వీటాస్త్రాలు సంధించడంలో దిట్ట తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. తాజాగా కేటీయార్ వేసిన ట్వీట్ మాత్రం విమర్శల పాలవుతోంది. ”ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వాఖ్యానాలు చేయవద్దని విజ్జప్తి.. అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే వుంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు..” ఇదీ కేటీయార్ ట్వీట్.!
ఇందులో కేటీయార్ స్వయంగా ‘కేసు విచారణ ప్రాథమిక దశలో వుంది..’ అని చెప్పుకొచ్చారు. కానీ, ఆయనే ‘దొంగలు నోటికొచ్చినట్లు మొరుగుతూనే వుంటారు..’ అని పేర్కొన్నారు.
తెలంగాణలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ యత్నించిందన్నది ఓ ఆరోపణ మాత్రమే. టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి చెందిన ఫామ్ హౌస్‌లో బేరసారాలు నడిచాయట. ఎమ్మెల్యేలే పోలీసులకు సమాచారం ఇచ్చారు.. వాళ్ళొచ్చి, బేరసారాలకోసం వచ్చిన బీజేపీ దూతల్ని అదుపులోకి తీసుకున్నారట.
అత్యంత నాటకీయంగా కనిపిస్తోంది ఈ వ్యవహారం. కేసులు నమోదయ్యాయ్.. నిందితుల్ని కోర్టులో హాజరు పరుస్తారు. మరోపక్క, ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం.
మరి, ఎవరు మొరుగుతున్నట్లు ఇక్కడ.? అధికార పార్టీకి చెందిన నేతలే, బీజేపీ మీద తీవ్రాతి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.. అదీ పోలీసుల ప్రాథమిక దర్యాప్తు పూర్తవకుండానే. సో, ‘మొరుగుతున్నారు’ అని కేటీయార్ చేసిన ట్వీటాస్త్రం అధికార పార్టీకే వర్తిస్తుందా.? అన్న చర్చ జరుగుతోంది. సాధారణంగా ఇలాంటి విషయాల్లో కేటీయార్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఈసారి మాత్రం తప్పులో కాలేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వాఖ్యానాలు చేయవద్దని విజ్జప్తి
అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే వుంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం
లేదు— KTR (@KTRTRS) October 27, 2022