KTR: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిత్యం రాజకీయాల పరంగా ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ రెడ్డి పై ఈయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పడంలో ఆరి తేరిపోయారు. అప్పుల లెక్కలు కాదు.. హామీల లెక్కలు చెప్పాలన్నారు. వడ్డీల ముచ్చట కాదు.. వాగ్ధానా ముచ్చట్లు చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విషయాలలోనూ ఈ ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. ఈ ప్రభుత్వంలో ఎవరికైనా మేలు జరిగిందా అంటే అది కేవలం ఎనుముల బ్రదర్స్ కి మాత్రమే మంచి జరిగిందని కేటీఆర్ తెలిపారు.సీఎం అనేవారు రాష్ట్ర ప్రతిష్ఠను పెంచాలి కానీ.. దివాళా దిగా తీసుకెళ్తున్నాడని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ విమర్శలు కురిపించారు.
ఇకపోతే రేవంత్ రెడ్డి తెలంగాణ రూపాన్ని మార్చి కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ విషయంపై కేటీఆర్ రేవంత్ రెడ్డిని ఒక చిన్న రిక్వెస్ట్ చేశారు. మీరు కెసిఆర్ పై కోపంతో దయచేసి తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చవద్దు.
మూర్తీభవించిన స్త్రీగా తెలంగాణ తల్లిని కేసీఆర్ రూపొందించారని, ఆయన మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మారిస్తే చరిత్ర క్షమించదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. నాడు ఇందిరాగాంధీ ప్రతిష్టించిన భారతమాత రూపాన్ని వాజ్‌పేయీ అధికారంలోకి రాగానే మార్చలేదని కేటీఆర్ గుర్తు చేశారు.
దేశంలో ఎన్నో చోట్ల అధికారం మార్పిడి జరిగినప్పటికీ కొన్ని విగ్రహాలు రూపురేఖలు మారలేదని తెలిపారు. కన్నడమాత రూపు మారలేదని చెప్పిన కేటీఆర్.. అలాంటప్పుడు ఈ ముఖ్యమంత్రి.. కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ విషయంలో రేవంత్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కేటీఆర్ సూచించారు.