కేటిఆర్… రాజకీయ సన్యాసానికి రెడీగా ఉండు : కొండా సురేఖ

టిఆర్ఎస్ పార్టీలో మరో పెద్ద కుదుపు. ఆ పార్టీకి వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి కొండా సురేఖ గుడ్ బై చెప్పారు. ఆమెతో పాటు ఆమె భర్, ఎమ్మెల్సీ కొండా మురళి కూడా గుడ్ బై చెప్పారు. వారిద్దరూ హైదరాబాద్ లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసిఆర్ కు రాసిన సుదీర్ఘ బహిరంగ లేఖను విడుదల చేసి టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. 

మీడియా సమావేశంలో కొండా సురేఖ తాను కేసిఆర్ కు రాసిన బహిరంగ లేఖను మీడియా సమావేశంలో చదివి వినిపించారు. ఈ సందర్భంగా కేసిఆర్ మీద, కేసిఆర్ ఫ్యామిలీ మీద కొండా సురేఖ నిప్పులు చెరిగారు. కేటిఆర్,  కవిత అందరినీ కడిగి పారేశారు. లష్కర్ బోనాల పండుగనాడు బంగారు బోనం ఎత్తుకోవడానికి కవిత కు ఉన్న అర్హత ఏమిటని నిలదీశారు.  మందు గోలీలు, మంచినీళ్లు ఇచ్చే సంతోష్ రావును రాజ్యసభకు పంపిన కేసిఆర్ అమర వీరులను మాత్రం నాలుగేళ్ల కాలంలో పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. 

ఇక కేటిఆర్ మీద కూడా కొండా సురేఖ నిప్పులు చెరిగారు. రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని గత కొంతకాలంగా కేటిఆర్ పలు సభల్లో పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండు కేటిఆర్ అంటూ సవాల్ చేశారు. రానున్న రోజుల్లో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చే చాన్స్ లేనే లేదని ఆమె తేల్చి చెప్పారు.

ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించలేని అసమర్థ సర్కారు కేసిఆర్ దే అని మండిపడ్డారు.  చెన్నూరులో ఆత్మహత్య చేసుకున్న గట్టయ్య ఆత్మ శాంతించాలంటే టిఆర్ఎస్ ను ఓడించాల్సిందే అని తేల్చి చెప్పారు. మహా కూటమిని విమర్శిస్తున్న కేసిఆర్ బిజెపితో లోపాయికారి ఒప్పందం చేసుకోలేదా అని నిలదీశారు. బిజెపితో ఒప్పందంతోనే కేసిఆర్ ముందస్తు ఎన్నికలకు పోతున్నాడని ఎద్దేవా చేశారు.

రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను విమర్శిస్తున్నారని తెలంగాణ వచ్చిందే సోనియా పుణ్యమన్నారు. కోదండరాంని బంగారం లాంటి మనిషని పొగిడి నేడు దద్దమ్మ, సన్నాసి సర్పంచ్ గానైనా గెలిచిండా అని ప్రశ్నించడమేంటని విమర్శించింది. దద్దమ్మలు, సన్నాసులు టిఆర్ ఎస్ లోఉన్నారని దుయ్యబట్టింది. తెలంగాణ మొత్తం అవినీతి మయమైందన్నారు. ఫాం హౌజ్, క్యాంపు ఆఫీసు సక్కగా ఉంటే బంగారు తెలంగాణ సాధ్యం అయినట్టు కాదని ప్రజలు బాగున్నప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. కేటిఆర్ కాంట్రాక్టర్ల వద్ద నుంచి డబ్బులు దండుకుంటున్నాడని ఆయన కమీషన్ల రాజుగా మారాడని విమర్శించింది. తెలంగాణ కేసీఆర్ కుటుంబ సొత్తు కాదని విమర్శించారు. 

టిఆర్ఎస్ లో ఉన్నంత కాలం మేము హరీషన్న వర్గమే అని తేల్చి చెప్పారు కొండా సురేఖ. ఆయనకు ఎంత భాద ఉంటే అలా మాట్లాడుతాడు అని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లోంచి తప్పుకోవాలన్న ఆలోచన కలిగిందని నైరాశ్యంతో హరీష్ రావు మాట్లాడితే బాధనిపించిందన్నారు.

ఇక పార్టీలోని నాయకుల తీరుపైనా మండిపడ్డారు. తమ చిరకాల ప్రత్యర్థి ఎర్రెబెల్లి దయాకర్ రావుపై మండిపడ్డారు. ఎర్రబెల్లి దయాకర్ రావు అల్లుడు కాంగ్రెస్ పార్టీలో చేరితే తప్పు కానప్పుడు డి శ్రీనివాస్ కొడుకు బిజెపిలో చేరితే తప్పా అని ప్రశ్నించారు. కేబినెట్ లో మహిళకు మంత్రి పదవి ఇవ్వకుండా టర్మ్ మొత్తం గడిపిన కేసిఆర్ చరిత్రలో నిలిచిపోతాడని ఎద్దేవా చేశారు. 

నాలుగైదు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని కొండా సురేఖ తెలిపారు. 

ఇది కూడా చదవండి

అమెరికాలో ఎక్కడ చూసినా తెలుగు వాళ్లే…