బ్రేకింగ్ న్యూస్ : మెత్తబడ్డ కాంగ్రెస్ కోమటిరెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి రామచంద్ర కుంతియాను బండబూతులు తిట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 24 గంటలు గడవకముందే మెత్తబడ్డారు. తెలంగాణకు కుంతియా శనిలా దాపురించిండని తీవ్ర విమర్శలు చేసిన ఆయన స్వరం తగ్గించారు. గాంధీభవన్ లో బ్రోకర్ నా కొడుకులకు కమిటీల్లో పదవులు కట్టబెడుతున్నారని ఆగ్రహావేశాలు ప్రదర్శించిన రాజగోపాల్ స్వరం సప్పబడ్డది.

ఒకవైపు షోకాజ్ నోటీసు జారీ చేయడం, మరోవైపు తన మాటల్లో కాఠిన్యం ఉందన్న ఆలోచనతో మొత్తానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మెత్తబడ్డారు. కుంతియాతో తనకు వ్యక్తిగత వైరం లేదని చెప్పుకొచ్చారు. కుంతియా విషయంలో కొంత తగ్గినట్లు కనబడ్డా.. మిగతా విషయాలో అదే దూకుడు కొనసాగించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. హైదరాబాద్ లోని తన నివాసంలో కోమటి రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారో కింద చదవండి.

నాకు వ్యతిరేకంగా గ్రూపుల్ని, వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నారు. పార్టీకోసం కష్టపడి పనిచేసే వ్యక్తిని నాకే నోటీసులు ఇస్తారా? నోటీసులకు రెండు రోజులు సమయం అవసరం లేదు. రెండు గంటల్లోనే చెబుతా రాసుకోండి. కేసిఆర్ ను తిట్టిన వారికే పదవులు ఇస్తారా?  పార్టీ పరిస్థితి చూస్తే బాధనిపిస్తున్నది. గాంధీభవన్ లో పదవులు అమ్ముకుంటున్నారు. పార్టీ పదవులు అమ్ముకునే వారేనా నాకు షోకాజ్ నోటీసులు జారీ చేసేది? నన్ను చూసి ఓర్వలేని వ్యక్తులే నాకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అవసరమా? కాదా మీరే నిర్ణయించుకోండి. రేవంత్ ను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని ఆహ్వానించి ఒకటికి నాలుగు సార్లు మాట్లాడిన వ్యక్తిని నేను. రేవంత్ కు వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు. పిసిసి పెద్దలు చేసే తప్పుల వల్ల కాంగ్రెస్ కార్యకర్తలు మరో ఐదేళ్లు అధికారానికి దూరమై బాధపడే పరిస్థితి వస్తది. తెలంగాణ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత లేదు. తెలంగాణ కోసం కష్టపడిన వారిని ముందు పెట్టాలని కోరిన. 

కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలంతా కోరుతున్నా.. నాయకత్వ లోపం ఉందని ప్రజలు భావిస్తున్నారు.  గాంధీభవన్ లో కూసోని ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. 70 ఏండ్లు నిండిన వారే మళ్లీ మళ్లీ పోటీ చేస్తామంటే ఎలా? గెలిచే వారికే టికెట్లు ఇవ్వాలని నేను చెబుతున్నాను. ఇదేమైనా తప్పా? మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని వీక్ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వబోతున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తాను. నాలాంటి వ్యక్తి కాంగ్రెస్ కోల్పోతే పార్టీకి, కార్యకర్తలకు నష్టమే తప్ప లాభం లేదు.

పార్టీ కోసమే ఇవన్నీ భరిస్తున్నాను. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారు. టిఆర్ఎస్ లోకి వెళ్లిన వారికి పదవులు ఎలా ఇస్తారు. పార్టీలో ఏమైనా సీరియస్ నెస్ ఉందా? రానున్న ఎన్నికల్లో ముందు అధికారంలోకి తీసుకొద్దాం. తర్వాత కావాలంటే మీరే సిఎం కావొచ్చు. అధిష్టానానికి ఎన్నోసార్లు చెప్పాను. మా సేవలు సద్వినియోగం చేసుకోవడం మరచిపోయింది కాంగ్రెస్ పార్టీ.

కమిటీని చూసి బాధనిపించి మాట్లాడిన. మళ్లీ తప్పు చేశిర్రేందని బాధపడ్డాను. తెలంగాణలో అందరూ ముఖ్యమంత్రి క్యాండెట్లే. ఎవరు చెప్తే ఎవరు వినాలె. 119 సీట్లకు 41 మందితో కమిటీ అవసరమా? కుంతియా, ఉత్తమ్ మా మాటలు వినలేదు. కుంతియా అనే వ్యక్తి స్ట్రాంగ్ లీడర్ ను ముందు పెట్టి  ఎన్నికలకు పోవాలని ఆలోచించాలి. కుంతియా ఇంత చిన్న రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉండి ఎందుకు సమన్వయం చేయలేకపోతున్నారు. వ్యక్తిగతంగా నేను కుంతియాకు వ్యతిరేకం కాదు. అతడిని ధూషించాలన్న ఆలోచన నాకు లేదు.

కోమటిరెడ్డి బ్రదర్స్ టిఆర్ఎస్ లోకి పోతామన్నారు. మేము పోలేదు. తర్వాత బిజెపి అన్నారు. మేము పోలేదు. ఇప్పుడు ఇంకో పార్టీ అంటున్నారు. ఎవరైనా పండ్లున్న చెట్టుకే రాళ్లు వేస్తారు. పండ్లు లేని చెట్టుకు రాళ్లు వేస్తరా? కోమటిరెడ్డి బ్రదర్స్ కు మైలేజీ ఉంది కాబట్టి అన్ని పార్టీల వారు రావాలి అనుకుంటారు.  మాది కాంగ్రెస్ పార్టీ కుటుంబం. కాంగ్రెస్ కోసం ప్రాణాలిస్తం. ఏ పదవి లేకపోయినా సరే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాం. తెలంగాణ ఇచ్చింది కాబట్టి సోనియా నాయకత్వంలో పనిచేస్తాం. 

ప్రచార కమిటీ ఛైర్మన్ బట్టి విక్రమార్క మధిరలో గెలిస్తే చాలు. ఆయన వచ్చి మునుగోడులో స్పీచ్ ఇస్తేనే నేను గెలుస్తనా? అధిష్టానం మునుగోడు నుంచి పోటీ చేయమని అడిగి, టికెట్ ఇస్తేనే నేను పోటీ చేస్తా. గెలవాలి పార్టీ కాబట్టి పోటీ చేయాలని కోరితేనే నేను పోటీ చేస్తా. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేస్తా. లేకపోతే పోటీ చేయను. మహా కూటమి మంచిదనుకుంటే పొత్తు పెట్టుకోవాలి. సీట్లు ఎక్కువ ఇస్తే వాళ్లు గెలవరు. టిఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని బంగారు పల్లెంలో పెట్టి ఇచ్చినట్లే. 

మా సేవలు సద్వినియోగం చేసుకోవాల్సిందిపోయి కార్యకర్తలను పట్టించుకోని వ్యక్తులకు కమిటీలో చోటు కల్పించి మాలాంటి వాళ్లను పక్కనపెడితే కార్యకర్తలు బాధపడతారు. పనిచేసేవాళ్లను ముందు పెట్టాలి. పార్టీ మారి వచ్చిన వాళ్లను కమిటీల్లో పెట్టడం బాధాకరం. బలమైన అభ్యర్థులు, గెలిచేవాళ్లకే టికెట్లు ఇవ్వాలని కోరుతున్నాను. పార్టీలో వందకు వంద శాతం టిఆర్ఎస్ కోవర్టులు ఉన్నారు. 

కుంతియా నా సలహాలు తీసుకోలేదు. ఉత్తమ్ మాటే వింటున్నారు. అసలు ఆయన ఆ పదవికి అర్హుడో కాదో అధిష్టానం నిర్ణయించుకోవాలి.  నాకు ఇచ్చిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇస్తా. తర్వాత పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సమ్మతమే. ప్రకటించిన కమిటీల్లో 25 శాతమే మంచివాళ్లు ఉన్నారు. మిగావాళ్లంతా అనర్హులే. నేను ఆవేదనతోనే మాట్లాడిన. అర్థం చేసుకోగలరు.