హైదరాబాదులో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న టీజేఏస్ అధినేత కోదండరాం పలు ఆసక్తికరమైన అంశాలను లేవనెత్తారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఆయన మీట్ ద ప్రెస్ లో మాట్లాడిన అంశాలివి.
ప్రస్తుత అవినీతి, అసమర్థ రాజకీయాలను సమూలంగా మారుస్తాము. ఇది మా టీజేఏస్ పార్టీకే సాధ్యం. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయాలను సృష్టిస్తాము. ఇప్పటికే పార్టీ అనేక విభాగాల కార్యక్రమాలు ప్రారంభమైనవి. ప్రస్తుతం తెలంగాణలో కుటుంబ పాలన, కాంట్రాక్టర్ల పాలన నడుస్తుంది. అన్ని శాఖాలపై ముఖ్యమంత్రి అజమాయిషీ వల్ల వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్నాయి. జాతీయ నాయకులను కలిసి మా పోరాటనికి మద్దతు కూడగట్టే ప్రయత్నం కొనసాగుతుంది. నిరుద్యోగ అంశంపై పార్టీ కార్యాక్రమాలు నిరంతరంగా కొనసాగిస్తాం. భూ రికార్డుల ప్రక్షాళన కొరకు సెప్టెంబరులో మహా రాస్తా రోకో చేస్తాం.
టీఆర్ఎస్ ని ఎదుర్కొనే దమ్ము టీజేఏస్ పార్టీకి ఉంది. భవిష్యత్తులో ఉధృతమైన కార్యాచరణతో ముందుకు వెళ్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు అడ్డగోలు రీ డిజైన్ వల్ల నిధుల దుర్వినియోగం అవుతున్నాయి. కాంట్రాక్టర్లు, నాయకులకు ప్రయోజనం చేకూర్చడానికి ఇదంతా చేసారు. మూడు నెలల నుంచి పింఛన్లు వస్తలేవంటేనే ప్రభుత్వ వైఫల్యం అర్థమవుతుంది. తుమ్ముడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కడితే రూ. 40 వేల కోట్లు మిగిలేవి. మియాపూర్ భూముల మాఫియాలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది. అందుకే ఈ కేసు అటకెక్కింది. అధికారంలోకి వస్తే రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించి అమలు చేస్తాం.
టీజేఏస్ అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు నిధుల దుర్వినియోగంపై సమగ్ర న్యాయ విచారణ జరుపుతాం. అధికారంలోకి వస్తే ముస్లిం మైనారిటీల గురించి వచ్చిన సుధీర్ కమీషన్ రిపోర్టులోని సూచనలను అమలు చేస్తాం. రానున్న ఎన్నికల్లో అన్నీ స్థానాల్లో పోటీచేస్తాం. ఎవరితోనూ పొత్తులు పెట్టుకోము. టీజేఏస్ పార్టీ ఏ పార్టీకి కూడా తల.. తోక కాదు.
టీజేఏస్ అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరంలోనే లక్ష ఉద్యోగాలను కల్పిస్తాం. జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తాం. అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు రూ. 2500 నిరుద్యోగ భృతి ఇస్తాం. ఆసరా పెన్షన్లను 1500 రూపాయలకు పెంచుతాం.
ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకుంటామనే వాదన సరికాదు. దీనిని టీజేఏస్ ఖండిస్తుంది. టీఆర్ఏస్ వాళ్లు కూడా ఓయూకి రావచ్చు. ఎవరికైనా మీటింగ్ పెట్టుకునే స్వేచ్చ ఉండాలనేది మా విధానం. కోదండరాం అంటే ప్రభుత్వానికి భయం. అందుకే నన్ను ఇన్నిసార్లు అరెస్టు చేశారు. టీఆర్ఏస్ ప్రభుత్వం పోలీసులను అధికార పార్టీ కార్యక్రమాలకు వాడుకుంటుంది. హైకోర్టు విభజన జరగలేదు. ఉద్యోగుల విభజన పూర్తి కాలేదు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం జరగలేదు.