ప్చ్… పరిస్థితి బాలేదు : కోదండరాం నిర్వేదం

మహా కూటమిలో కాంగ్రెస్ తీరుపై తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం తీవ్ర నిర్వేదం వ్యక్త పరిచారు. శుక్రవారం కొద్దిసేపటిక్రితం ఆయన మీడియాతో  చేసిన చిట్  చాట్ లో అనేక విషయాలను వెల్లడించారు. మీడియా చిట్ చాట్ లో కోదండరాం మాట్లాడుతున్న తీరును చూస్తే తెలంగాణలో మహా కూటమి ఫిక్స్ కాలేదని ఆయన మాటల్లో తేలిపోయింది. సీట్ల సర్దుబాటు దగ్గరే కూటమి కుదరుకోలేకపోయిందని నిర్వేదం ప్రదర్శించారు కోదండరాం. 

కాంగ్రెస్ తీరు పట్ల ఆయన అసంతృప్తి వెల్లగక్కారు. పరిస్థితులు ఏమాత్రం బాగా లేవని బాధపడ్డారు. కాంగ్రెస్ వాళ్లు తమ ఆఫీసుకు వస్తామని అన్నారని చెప్పారు. నామినేషన్ల గడువు ముగిసిపోతున్నప్పటికీ జనగామ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎటూ తేల్చలేదని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు.  జనగామలో ఏం చేద్దామన్నదానిపై ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ తనతో మాట్లాడలేదని కోదండరాం తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి ప్రచారం చేసుకోవడానికి ఏమాత్రం సమయం సరిపోతదని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి పోటీ చేయబోతున్న హుస్నాబాద్ లో ప్రచారానికి తాను వెళ్తానని కోదండరాం వెల్లడించారు. 

కోదండరాం కు ఎందుకీ నిర్వేదం

మహా కూటమిలో ఏ ముహూర్తాన కోదండరాం చేరిపోయారో కానీ ఏనాడూ ఆయన సంతృప్తిగా కనిపించలేదు. కూటమిలో కాంగ్రెస్ వ్యవహరించే తీరుతో ఆయన విసిగి వేసారిపోయారు. కాంగ్రెస్ పార్టీ మార్కు రాజకీయాలు దగ్గరనుంచి చూసిన కోదండరాం కూటమిలో చేరి పొరపాటు చేశామా అన్న అయోమయంలో పడిపోయారు. సీట్లు తేల్చకుండా కొద్దిరోజులు, క్యాండెట్లు తేల్చకుండా కొద్దిరోజులు కూటమి పార్టీలకు కాంగ్రెస్ చుక్కలు చూపిస్తున్న తీరును కోదండరాం జీర్ణించుకోలేకపోతున్నారు.

వందేళ్లకు పైబడిన సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ సర్వ అవలక్షణాలు కలిగి ఉన్నది. దేశంలో పేరుమోసిన కుంభకోణాలు కాంగ్రెస్ హయాంలోనూ జరిగాయి. అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారికి టికెట్లు వస్తాయో రావో తెలియని పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఆర్థిక పలుకుబడి ఉన్నవారికి రాత్రికి రాత్రే టికెట్లు వస్తున్నాయన్న ప్రచారం కోదండరాం ను కలవరపెడుతున్నది. ఈ కారణంగానే ఆయన ఇవాళ పరిస్థితులు బాగాలేవు అని నైరాశ్యంలోకి నెట్టబడ్డారు.

డబ్బు ప్రభావం లేకుండా రాజకీయం చేయాలన్న ఆశ కోదండరాం కు ఉంది. ఢిల్లీ రాజకీయాల్లో సివిల్ సర్వెంట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ ఏ డబ్బు లేకున్నా, ఏ రాజకీయ పలుకుబడి లేకున్నా ఢిల్లీలో రెండుదఫాలుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం నమోదు చేశారు. కేజ్రీవాల్ ఏకంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మీదనే పోటీ చేసి ఆమెను మట్టి కరిపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరహాలోనే తెలంగాణలో కోదండరాం నూతన రాజకీయాలను ప్రవేశపెడతారని విద్యాధికులు ఆశపడ్డారు. 

కానీ కోదండరాం ఆ దిశగానే పార్టీ స్థాపించినప్పటికీ కార్యాచరణ మాత్రం ఆ దిశగా లేదు. ఢిల్లీ ఓటర్లకు, తెలంగాణ ఓటర్లకు మధ్య వ్యత్యాసం ఉందని ఆయనకు కూడా అర్థమైంది. ఒక దశలో డబ్బున్న బడాబాబులు కొందరు జన సమితి పార్టీలోకి వస్తామని, కీలక పదవులు ఇవ్వాలని కోరిన సందర్భం ఉంది. కానీ కోదండరాం వారి పట్ల అంటీముట్టనట్లుగానే వ్యవహరించారు. కోదండరాం పార్టీ అనౌన్స్ అయిన కొద్దిరోజుల్లోనే సర్కారును కేసిఆర్ రద్దు చేశారు. దీంతో సొంతంగా పోటీ చేసే వెసులుబాటు కోదండరాం కు లేకుండాపోయింది. 

తెలంగాణ రాజకీయాల్లో పైకి కనబడకపోయినప్పటికీ ఏ పార్టీ ఏ కుల ప్రయోజనాల కోసం పనిచేస్తుందో అందరికీ తెలిసిన ముచ్చటే. టిఆర్ఎస్ కు ఒక కులం ఉంది. తెలంగాణ కాంగ్రెస్ కు ఒక కులం ఉంది. ఇప్పుడు కోదండరాం పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడంతో ఆయన నేతృత్వంలోని పార్టీకి సైతం కుల ముద్ర పడిపోయింది. మహా కూటమిలో చేరడంతో టిడిపి సైతం తన పూర్వపు వాసన కోల్పోయి కాంగ్రెస్ కులంలో ఇమిడిపోయిన పరిస్థితి ఉంది. కోదండరాం కు పొత్తు లేకుండా ఒంటరిగా పోలేని పరిస్థితి ఒకవైపు ఉంటే, పొత్తు ఉన్నా కాంగ్రెస్ శెంకెం చేయకపోవడంతో జన సమితి పార్టీ డైలమాలో పడిపోయింది.

కేసిఆర్ కుటుంబ పాలన, నిరంకుశ రాచరిక పాలనను అంతమొందించే లక్ష్యంతో కూటమి ఏర్పాటైనా ఆ దిశగా కూటమిలోని ప్రధాన కాంగ్రెస్ పార్టీ అడుగులు పడడంలేదు. దీంతో కూటమి తీరుపై ఓటింగ్ కు వెళ్లకముందే కోదండరాం అంచనాలు మారిపోయాయని మీడియాతో ముచ్చటించిన మాటలను బట్టి అర్థమవుతున్నది.