తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. వరుసగా ఎన్నికలు రాబోతున్నాయి. దుబ్బాక ఉపఎన్నికతో పాటుగా.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక, గ్రేటర్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పార్టీలన్నీ ఎన్నికల కోసం సంసిద్ధం అవుతున్నాయి.
ఇప్పటికే కొన్ని పార్టీలు ప్రచారం కూడా ప్రారంభించాయి. మరికొన్ని పార్టీలు తమ పార్టీల అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డాయి. మొత్తానికి తెలంగాణలో ఎక్కడ చూసినా.. టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకే అన్ని పార్టీలు పథకాన్ని రచిస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరోవైపు వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి తెలంగాణ జనసమితి పార్టీ తరుపున ఆ పార్టీ ఆధ్యక్షుడు కోదండరాం బరిలోకి దిగనున్నారు. ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఆయన పోటీకి సంబంధించిన పోస్టర్, పాంప్లెట్స్ ను ఈసందర్భంగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కోదండరాం.. ఎన్నికలు వచ్చినా రాకపోయినా.. మేం ఎప్పుడూ ప్రజల తరుపున పోరాడుతాం. పోరాడుతూనే ఉంటాం. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నేటి ప్రభుత్వం దెబ్బతీస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం నిరంకుశ పాలన జరుగుతోంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలే లేవు.. అంటూ కోదండరాం ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.