తెలంగాణ కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల నేతలకు టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో మాదిరిగా విమర్శలు, ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. కుక్క లెక్క మాట్లాడితే భరతం పడతామని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసిఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. అందులో ప్రతిపక్షాలకు సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతోపాటు మరిన్ని అంశాలపై మాట్లాడారు.
‘‘అతి త్వరలో తెలంగాణ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తాం. నేనే చొరవ తీసుకుంటాను. ఇవాళ తెలంగాణ భవన్ లో మాట్లాడుతున్నాను. రేపు ప్రమాణ స్వీకారం తర్వాత సిఎం హోదాలో ప్రగతి భవన్ లో మళ్లీ మీడియాతో మాట్లాడతాను. గత నాలుగేళ్లలోనే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇద్దామనుకున్నాం. కానీ కుదరలేదు. ఈసారి తప్పకుండా షార్ట్ పీరియడ్ లోనే ఇస్తాము. చాలామంది ఎదురుచూస్తున్నారు. రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ గురించి కూడా పరిశీలించి, అక్కడి విషయాలు స్టడీ చేసి నిర్ణయం తీసుకుందాం. ’’ అని కేసిఆర్ తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో అన్నారు.
రాహుల్ గాంధీ అబద్ధాలు చెప్తున్నడు. అసలు సిపిఎస్ తెచ్చింది ఎవరు నాకు తెల్వక అడుగుతా? ఆ స్కీమ్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ స్కీమును తెచ్చింది రాజశేఖర్ రెడ్డి. మల్లా ఆ స్కీమ్ తెచ్చి ఇప్పుడు రద్దు చేస్తామని అంటున్నారు. తెచ్చింది మీరే మల్లా ఇట్లా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికో భాష ఉండి పాడైతది. పచ్చి అవకాశవాద రాజకీయాలు చేస్తది. కాంగ్రెస్ పార్టీ అయినా అంతే. బిజెపి అయినా అంతే. తెలంగాణ బిజెపి ఒక మాట మాట్లాడతది. కేంద్ర బిజెపి ఒక మాట మాట్లాడతది.
కాంగ్రెస్ వాళ్లవి ఎన్ని స్కాములు ఉన్నాయో నాకు తెలుసు. ఎన్ని కుంభకోణాలు ఉన్నాయో నాకు తెలుసు. అయినా అవి పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే వెంట పడితే కక్ష సాధింపు అని అంటారు కాంగ్రస్ వాళ్లు. మాకు వాళ్ల వెంట పడడం ముఖ్యం కాదు. రాష్ట్రం సెటిల్ కావాలని ఆగినం. ఈ టర్మ్ లో కచ్చితంగా రెండు పనులు చేస్తాము. రాష్ట్రం ఫేస్ పాజిటీవ్ ఫేస్ అని తేలిపోయింది. ఇప్పుడు ఎవలు పడితే వాళ్లు కుక్కలు ఒర్లినట్లు ఒర్లితే వదిలిపెట్టం. ఈ టైమ్ లో మాత్రం ఊకోము. దానికి ట్రీట్ మెంట్ గ్యారెంటీగా ఉంటది. ఎవరెవరు ఎంత తిన్నరో అంత కక్కిస్తం. ఏది పడితే అది మాట్లాడితే ఒప్పుకోం. దొంగల భరతం పడతాము. హైకోర్టు విభజన కానీయలేదు. సుప్రీంకోర్టుకు పోయి హైకోర్టు విభజన చేయాలని కోరాల్సి వచ్చింది.
నా అనుభవంలో వందకు వంద శాతం మ్యానిఫెస్టోలో చెప్పిన విషయాలు అమలు చేసిన పార్టీ టిఆర్ఎస్. ఇంటికో ఉద్యోగం ఇస్తామని అన్నామా? మేము ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినం. ఆంధ్రావాళ్లు పోతే ఆ ఉద్యోగాలన్నీ ఇస్తామన్నాము. కొన్ని పార్టీలు ఇష్టమొచ్చినట్లు పోరగాళ్లను ఆగం చేసే ప్రయత్నం చేసినయ్. మేము అనుకున్నట్లు రాష్ట్ర సంపద పెరిగింది కాబట్టి అదనపు కార్యక్రమాలు తీసుకున్నాము. రైతుబంధు స్కీమ్ మేనిఫెస్టోలో చెప్పలేదు. కానీ సందర్భం వచ్చింది తీసుకున్నం. రైతుల ఓటు కోసమో, తమాషా కోసమో తీసుకోలేదు. రైతు బీమా స్కీమ్ కూడా అలాంటిదే. ఇప్పటికి నాలుగువేల మంది రైతు మిత్రులకు బీమా స్కీమ్ వచ్చింది. ఏ పైరవీ లేకుండా వారి ఖాతాలో జమ అయినవి.
రేపు రైతుబంధు పథకం దేశమంతా అమలు చేస్తాము. ఇంత పెద్ద దేశంలో రైతులకు ఎంత బడ్జెట్ కావాలో మాకు లెక్కలన్నీ తెలుసు. మైనార్టీలకు నాలుగు వేల కోట్ల బడ్జెటా పెట్టేది?
29.90 పర్సెంట్ మన రాష్ట్రంలో గ్రోత్ రేట్ ఉంది. ఇంతటి ఆర్థిక పెరుగుదలలో ఇండియాలో ఏ రాష్ట్రం కూడా లేదు. మనలో సగం కూడా లేదు ఇండియా. ఇంతటి గ్రోత్ రేట్ ఉండడానికి కారణం లంచాలు లేవు. సింగరేణి ద్వారా పెరిగింది.
మరో 70వేల కోట్లతో ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అవుతాయి. 30వేల కోట్లు పాలమూరు ఎత్తిపోతలకు కావాల్సి వస్తది. సీతారామ ప్రాజెక్టుకు 17వేల లోన్ వచ్చి ఉంది. జూలై తర్వాత దుమ్ముగూడ నుంచి సాగర్ నిండకపోయినా ఖమ్మం కు నీళ్లు ఇస్తాము. 70వేల కోట్లతో ప్రాజెక్టులు కంప్లీట్ అవుతాయి. కొంతమంది అప్పులు చేసిర్రు అని మాట్లాడుతున్నారు. ఆ అప్పులు ఎలా తీర్చాలో మాకు అవగాహన ఉంది.
2లక్షల 40వేల కోట్లు మేము అప్పు కట్టాలి. లక్షా 30వేల కోట్లు ఎలిజిబులిటీ వస్తది. మైనార్టీ స్కూళ్లు పెట్టినం. రెసిడెన్సియల్స్ పెట్టినం. వాటికి ఇప్పుడే బిల్డింగులు కడ్తలేము. తర్వాత మెల్లగ కడతాము. ఏడాదిన్నరలో సీతారామ, కాళేశ్వరం వందకు వంద శాతం కంప్లీట్ అయిపోతది.
అన్ డెమెక్రసీ కాదు. భారత దేశ సర్కారు సెటప్ లో అక్కడ ప్రధాని, ఇక్కడ సిఎం ఉంటారు. టీమ్ ప్లేయర్ ఎట్లా ఉండాలో అట్లా ఉంటాడు. టీమ్ ప్లేయర్ పద్ధతి ప్రకారం ఆడిస్తాడు. లేదంటే సర్కస్ అయిపోతది. నేను కొద్దిగా కఠినంగా ఉంటాను. లేకపోతే కోటి చౌరస్తాలో రూపాయ పావులాకు అమ్మి పోతరు. దాన్ని అన్ డెమోక్రసీ అనుకుంటే ఏం చేయలేము.
మిషన్ భగీరథపై కేసిఆర్ కొత్తరాగం
మిషన్ భగీరథ కింద ఇంటి ఇంటికీ నీళ్లు ఇయ్యకపోతే ఒట్లు అడగ అని అసెంబ్లీలో తాము చెప్పిన మాటకు ఇంకా కట్టుబడి ఉన్నామని కేసిఆర్ అన్నారు. అయితే దసరా నాటికే నీళ్లు ఇస్తామని, దసరా వరకు కంప్లీట్ చేయాలని అధికారులను, మిషన్ భగీరథ కాంట్రాక్టర్లను కేసిఆర్ పరుగులు పెట్టించారు. కానీ అసెంబ్లీ రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత ఇంటి ఇంటికీ నీళ్ల గురించి వంద బహిరంగసభల్లో ఎక్కడా చెప్పలేదు. తాజాగా మీడియా సమావేశంలో మాత్రం వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికి తాము ఇంటి ఇంటికీ నీళ్లు ఇస్తామని, ఏప్రిల్ చివరి నాటికి నీళ్లు ఇచ్చి పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని కొత్త పల్లవి అందుకున్నారు. విపక్షాలు ఏదేదో మాట్లాడబట్టి తాము ముందస్తుకు పోయినట్లు తనదైన శైలిలో వివరణ ఇచ్చారు కేసిఆర్.