తెలంగాణ సిఎం కేసిఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత శనివారం ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడారు. గతంలో మాదిరిగానే కేసిఆర్ విపక్షాలపై తీవ్రమైన పరుష భాషలో బూతులు తిట్టారు. బిజెపి లక్ష్మణ్ ను ఉద్దేశించి సిగ్గు లేకుండా ఇక్కడ మొరుగుతా అని అంటే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ పైన కూడాఅదే రీతిలో తిట్ల దండకం అందుకున్నారు. మీడియా సమావేశంలో కేసిఆర్ ఏమన్నారో కింద చదవండి.
ఈమధ్య కాలంలో శాసనసభకు ఎన్నికలు జరిగినయ్. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పస లేని ఆరోపణలు చేసి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే ప్రజల తీర్పు ఎట్లుంటదని అర్థమైంది. అంత దారుణంగా జనాలు తీర్పు ఇచ్చిర్రు. పబ్లిక్ లైఫ్ లో రాజకీయాల్లో ఎట్ల పడితే అట్ల మాట్లాడితే ప్రజలు రిసీవ్ చేసుకోరు. మొన్ననే ప్రజలు కర్రు కాల్చి వాతలు పెట్టిర్రు.
భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడిందో లెక్కనే లేదు. ఐదుగురు ముఖ్యమంత్రులు, 11 మంది కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ అధ్యక్షులు, ప్రధానమంత్రి వచ్చి తిరిగిర్రు. 118 చోట్ల పోటీ చేస్తే 103 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. ప్రజలు ఎంత దుర్మార్గంగా తిరస్కరించిర్రో చూశారు.
అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నది. బిసిల మీద వీళ్లంతా ప్రేమ ఒలకబోస్తున్నరు. అఖిలపక్షం, తోకపక్షం అని ప్రేమ ఒల్కబోస్తున్నారు. బిసిల మీద ప్రేమ అనే పార్టీలన్నీ టిఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు తెలంగాణలో బిసి రెసిడెన్సియల్ పాఠశాలలు 19 మాత్రమే. నేడు 261 ఉన్నాయి. ఎవరికి ఉన్నది బిసిల మీద ప్రేమ. మండలానికి ఒకటి రెసిడెన్సియల్ పెట్టుకున్నా తక్కువే అని నేను ప్రకటించిన. మీ ప్రేమ ఏందో మా ప్రేమ ఏందో ఈ సంఖ్యతోనే తెలుస్తది.
భారత దేశంలో ఏ ప్రభుత్వం కానీ, ఏ పార్టీ కానీ చేయలేదు. మార్కెట్ కమిటీల్లో బిసిలకు రిజర్వేషన్లు చేసిన ప్రభుత్వం టిఆర్ఎస్ దే తెలంగాణలోనే మొదటిది. ఎంబిసిలకు కార్పొరేషన్ పెట్టింది కూడా తెలంగాణ ఒక్క రాష్ట్రంలోనే. దేశంలో ఎక్కడా పెట్టలేదు. నేత కార్మికులను ఆదుకుంటున్నది మేమే. చెట్ల పన్నులు రద్దు చేసి గీత కార్మికులను ఆదుకుంటున్నము. అన్ని వృత్తి పనులు బిసిలే నిర్వహిస్తున్నారు. చెప్పులు కుట్టే వృత్తి తప్ప. 74 లక్షల గొర్రెలు పంపిణీ చేసినం యాదవులకు. రజకులకు, ఇతర వర్గాలకు చేసినం. హెయిర్ సెలూన్లకు డొమెస్టిక్ వపర్ ఛార్జీలు అమలు చేస్తున్నం.
పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల ముందే పంచాయతీ ఎన్నికలు పెట్టే ప్రయత్నం చేసినం. యాక్ట్ తెచ్చినం. యాక్స్ ను అసెంబ్లీలో పాస్ చేసినం. 34 శాతం రిజర్వేషన్లు పెట్టి నోటిఫికేషన్ తెచ్చినం. దీని మీద కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ స్వప్నారెడ్డి , కాంగ్రెస్ నాయకుడు గోపాల్ రెడ్డి వీరే 50 శాతానికి రిజర్వేషన్లు పెంచొద్దని కోర్టుకు పోయిర్రు. అప్పుడు వారు కూటమిలో ఉన్నరు. దాన్ని హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు కొట్టేస్తే మేము ఊరుకోలేదు. ఇమిడియెట్లీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసినం. 61.19 రిజర్వేషన్లు ఇవ్వండి అని సుప్రీంకోర్టుకు పోెయినం. వాళ్లు దాన్ని కొట్టేసిర్రు.
వంద రోజుల్లో ఎన్నికలు అంటే జనవరి 10లోపు పెట్టండి అని హైకోర్టు ఆదేశం మరోవైపు, రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని ఇంకోవైపు కోర్టుల ఆదేశాలున్నాయి. అందుకే మేము నోటిఫికేషన్ ఇచ్చాము. దాని ప్రకారం ఎన్నికలకు పోతున్నం. 50శాతం మించొద్దని కోర్టుకు పోయినోళ్లే నేడు మొసలి కన్నీళ్లు కారుస్తుంటే నమ్మాల్నా? ఇంత దారుణంగా అబద్ధాలు చెబుతున్నారు.
లక్ష్మణ్ పెద్దగ నోరు పెట్టుకుని మాట్లాడుతున్నడు. మా పార్లమెంటు సభ్యులు నిలదీసి అడిగిర్రు. రాజ్యాంగాన్ని మార్చండి. రిజర్వేషన్ల హక్కు రాష్ట్రాలకు ఇవ్వండి అని కొట్లాడినరు. ఆ తెలివి లేదు బిజెపికి. కానీ ఇక్కడ మాత్రం ఇష్టం వచ్చినట్లు మొరుగుతం అని అంటే ఇదేమైనా పద్ధతా? అసలు బిసి వర్గాల ప్రజలను ఆదుకున్నదెవరు? మేము ప్రయత్నం చేసినం. రెండు కోర్టులు ఒప్పుకోలేదు. మేము ఉద్దేశపూర్వకంగా బిసిలకు కోటా తగ్గించినట్లు కట్టుకథలు అల్లుతున్నారు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా బిసిలకు చేసిందేమీ లేదు. నాశనం చేసిర్రు బిసిలను. వాస్తవాలు ప్రజలు గమనించాలని కోరుతున్నాను. నిన్నకాక మొన్ననే ప్రజలు బుద్ధి చెప్పిర్రు.
సిఎం తర్వాత రెండు పోర్ట్ పోలియోలు కీలకమైనవి ఉంటే ఆ రెండింటిలో మేము బిసిలనే పెట్టినం. మండలి ఛైర్మన్, శాసనసభ స్పీకర్ ను బిసినే పెట్టినం. కార్పొరేషన్లకు బిసిలనే పెట్టినం. విప్ పదవులు ఇచ్చినం. చట్టసభల్లో బిసిలకు రిజర్వేషన్లు పెట్టాలని సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినం. అది కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నది. మీరు దగ్గర పెట్టుకున్నరు. అయినా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నరు. విదేశాల్లో చదివే పిల్లలకు 20లక్షల స్కీమ్ పెట్టినం. వాస్తవాలు ప్రజలు గమనించాలని కోరుతున్నాను.
మేము ఆత్మగౌరవ భవనాలు అని అన్ని వర్గాలకు ఇచ్చినం. రెండు, మూడు వర్గాలు మిగిలిపోయినయి. వారికి కూడా భవనాలు కట్టిస్తాము. అన్ని వర్గాలకు భవనాలు కట్టిస్తాము. వారి గౌరవం కాపాడేలా ఆత్మగౌరవ భవనాలు కడతాము. వాళ్లు అక్కడ కూసుంటరు. మంచి చెడ్డలు మాట్లాడుకుంటరు. సోషల్ జస్టిస్ అని పెడతారు. కానీ నిధులు ఉండవు. బిసి సంక్షేమ శాఖ పెట్టాలని నేను స్వయంగా పోయి లెటర్ ఇచ్చిన. కానీ బిసి సంక్షేమ శాఖ పెట్టలేదు. కేంద్రంలో బిసి ప్రధానమంత్రిగా ఉండి బిసి మంత్రిత్వ శాఖ పెట్టలేదు. అటువంటి సిగ్గులేని బిజెపి నేతలు ఇక్కడ సిగ్గులేకుండా మాట్లాడుతున్నరు.
జనవరి నెలలో పంచాయతీ ఎన్నికలు జరిగిపోతాయి. అందరూ సహకరించాలి. ఎక్కడి కక్కడ ఎన్నికల్లో పాల్గొనాలని కోరుతున్నాను.