రేపు ఖమ్మంలో జరుగుతున్న ప్రజాకూటమి బహిరంగ సభలకు చాలా ప్రాముఖ్యం ఉంది. రాహుల్ గాంధీ రాకసందర్భంగా ఏర్పాటుచేస్తున్న ఈ సభకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడాహాజరవుతున్నారు. అంతేకాదు, కెసియార్ ను ఓడించండి పిలుపు ఇస్తున్నారు.గతంలో ఎపుడూ కెసియార్ ను ఓడించండి పిలుపు నిచ్చేందుకు ఆయనకు అవకాశం రాలేదు. 2014 లో విభజన నేపథ్యంలో న్యాయం జరగాలనే మాట్లాడారు. మాట్లాడి ఉంటే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇపుడు ఆయన తెలంగాణ నడిబొడ్డున నిలబడి కెసియార్ ను ఓడించండని , కాంగ్రెస్ నేత సమక్షంలోనుంచి పిలుపు ఇస్తున్నారు.
రాహుల్ గాంధీ చంద్రబాబునాయుడు, మొన్న మొన్నటి దాకా రెండు ప్రత్యర్థి పార్టీలకు నాయకత్వం వహించారు. ఇపుడు కరచాలనం చేస్తున్నారు. ఇది కాదు విశేషం. చంద్రబాబు నాముడు ఖమ్మంలో కాలుమోపడమే విశేషం. తెలంగాణ ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ బయట తిరగడం ఇదే ప్రథమం. ముఖ్యమంత్రి కెసియార్ వోటుకు నోటు, టెలిఫోన్ ట్యాపింగ్ లు గొడవలొచ్చాక ఆయన అమరావతి వెళ్లిపోయారు. ఆయన పర్మనెంట్ అడ్రసు హైదరాబాదే అయినా, హైదరాబాద్ వచ్చినపుడల్లా ఇల్లు,ఎన్టీయార్ ట్రస్టు భవన్ తప్ప మరొక కార్యక్రమానికి వెళ్లలేదు. హైదరాబాద్ బయట జరిగే పార్టీ కార్యక్రమాలుకు హాజరుకావడం మానేశారు. తెలంగాణ పార్టీని ఆయన లోకల్ నాయకులకు వదిలేశారు. అందుకే రేవంత్ రెడ్డి, తెలుగుదేశం మీద ఆశలు చచ్చి కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇక ఆయన తెలంగాణకు రాడని, ఈ గడ్డమీద కాలుమోపడని అనుకున్నారు. అట్లాంటిది కెసియార్ ముందస్తు ఎన్నికల పుణ్యాన ఆయనఇపుడు తెలంగాణ అంతటా పర్యటించే అవకాశమొచ్చింది.
ముందస్తు లేకపోతే, 2019 ఎన్నికలయితే, ఆయన ఆంధ్రకే పరిమితమయిఉండేవారు. ఇపుడు ఆయన తీరుబడిగా ముందస్తు పేరుతో తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఆయన తొలిసమావేశం నవంబర్ 28న అంటే రేపే. ఇది విశేషం.ఇది బాబుకు కెసియార్ అందించిన సువర్ణావకాశం. దీన్ని ఆసరా చేసుకుని అల్లుకుపోతారా లేక చతికిల బడతారా… చూడాలి.
రేపటి ఖమ్మం సభకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ కోదండరాంతోపాటు, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హాజరవుతున్నారు. ఖమ్మం లోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో ఈ సభ జరుగుతున్నది. మధ్యాహ్నం 2.30 గం టల సమయంలో రాహుల్‌గాంధీ, రాహుల్, చంద్రబాబు నాయుడు కలిసి ఒక బహిరంగసభలో మాట్లాడుతూ ఉండటం కూడా మొదటిసారే.
2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు తెలంగాణ పార్టీ కోసం ప్రత్యేకంగా ఎక్కడా బహిరంగసభలు నిర్వహించలేదు. ఒక టిడిపి సమావేశం కూడా జరగలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పరాభవం, కెసియార్ తో విబేధాలు రావడంతో ఇక తెలంగాణకు చంద్రబాబు చెల్లు అని అంతా అనుకున్నారు. కాని ముందస్తు ఎన్నికలు చంద్రబాబుకు సువర్ణావకాశాన్నిచ్చాయి.