ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు తెలంగాణ సిఎం కేసిఆర్. 45 నిమిషాల పాటు మోడీతో కేసిఆర్ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో తెలంగాణకు చేయాల్సిన సాయంపై చర్చించారు. ఈ సందర్భంగా ఒక నివేదికను కేసిఆర్ సమర్పించారు. ఈ నివేదికలో పది అంశాలను ప్రస్తావించారు. మోడీతో కేసిఆర్ భేటీ ఏకాంతంగా సాగింది. ఉద్యోగాల నోటిఫికేషన్ కు ఆటంకాలు ఉన్నందున తక్షణమే కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలపాలని నివేదికలో కోరారు కేసిఆర్. జోనల్ వ్యవస్థకు ఆమోదం లభిస్తే వెంటనే టిఎస్పిఎస్పీ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని వివరించినట్లు తెలిసింది.
మరోవైపు హైకోర్టు విభజన విషయంలో కేంద్రం త్వరితగతిన యాక్షన్ తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కేసిఆర్ విన్నవించారని చెబుతున్నారు. తెలంగాణలో రైల్వే లైన్లు త్వరగా పూర్తయ్యేలా రైల్వే శాఖకు ఆదేశాలు జారీ చేయాలని కూడ కేసిఆర్ కోరినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. దాంతోపాటు తెలంగాణలో రైతు బంధు, రైతు బీమా పథకాల గురించి కూడా కేసిఆర్ ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశంలో రాజకీయ అంశాల పైనా చర్చలు జరిగినట్లు చెబుతున్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ముందస్థు ఎన్నికలు వస్తాయా రావా అన్నదానిపైనా చర్చ జరిగినట్లు టిఆర్ఎస్ వర్గాల్లో టాక్ వినబడుతున్నది. సమావేశంలో ఎక్కువ సమయం కేసిఆర్ అన్ని అంశాలపై సమగ్రమైన వివరణ ఇచ్చారని అంటున్నారు.