కేసీయార్ మ్యానిఫెస్టో.! అందరూ క్లీన్ బౌల్డ్ అయిపోవాల్సిందేనా.?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, భారత్ రాష్ట్ర సమితి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పార్టీ మేనిఫెస్టోని ప్రకటించేశారు. ఆసరా పెన్షన్లను ఐదు వేలకు పెంచడం దగ్గర్నుంచి, వంట గ్యాస్ సిలెండర్ ధరని 400 రూపాయలకు తగ్గించేస్తామని చెప్పడం.. ఇలా చాలానే వున్నాయ్.

ఈ తరహా మేనిఫెస్టోలని చూసి జనం మురిసిపోతారా.? మేనిఫెస్టోలే రాజకీయ పార్టీలని గెలిపించేస్తాయా.? అంటే, ఎందుకు గెలిపించవు.? నిక్షేపంగా గెలిపించేస్తాయని చెప్పొచ్చు. అదే సమయంలో, మేనిఫెస్టోలని జనం నమ్మే పరిస్థితి లేదనీ చెప్పొచ్చు.

‘వైఎస్ జగన్ బాటలోనే కేసీయార్..’ అంటూ అప్పుడే, వైసీపీ శ్రేణులు క్రెడిట్‌ని తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయనుకోండి.. అది వేరే సంగతి. పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ చొరవని, కేసీయార్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణలోనూ ఆ తరహా పద్ధతి అమలు చేస్తామని ప్రకటించేశారు.

ఇంతకీ, కేసీయార్ మేనిఫెస్టోతో రాజకీయ ప్రత్యర్థులంతా తెలంగాణలో క్లీన్ బౌల్డ్ అయిపోవాల్సిందేనా.? కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన అభయ హస్తం మేనిఫెస్టో సంగతేంటి.? ఎవరి గోల వారిదే.! తెలంగాణ ధనిక రాష్ట్రమే అయినా, అప్పుల్లో కూరుకుపోతోంది. సో, ఈ మేనిఫెస్టోలు అమల్లోకి వస్తే, అప్పులు మరింతగా పెరుగుతాయి.

అభివృద్ధి అంటారా.? తెలంగాణ అభివృద్ధికి డోకా ఏమీ లేదు. ఎందుకంటే, తెలంగాణకి ప్రధాన ఆదాయ వనరుగా వుంది రాజధాని హైద్రాబాద్. అయినాగానీ, ఆ హైద్రాబాద్ మాత్రం, ఈ అప్పుల భారాన్ని ఎంతకాలం ఇలాగే మోయగలదు.?

ఈ తరహా మేనిఫెస్టోల వల్లనే కదా, వంట గ్యాస్ ధర నాలుగైదు వందల నుంచి, వెయ్యికి పైగా పెరిగింది. దాన్ని మళ్ళీ తగ్గించేస్తామంటే, ఈసారి పెరిగేది రెండు వేలో, మూడు వేలకో..! బియ్యం ధరలెలా వున్నాయ్.? పెట్రో ధరలు ఎలా వున్నాయ్.? ఇవన్నీ ఈ మేనిఫెస్టోల వల్లనే కదా.? సంక్షేమం తప్పు కాదు, సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయం.. ప్రజల్ని నిలువునా నాశనం చేసేస్తోంది.