కేసిఆర్ ప్లాన్ ఎ 105, మరి ప్లాన్ బి ఏంటో తెలుసా ?

 

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ రాజకీయాల్లో కలవరం రేపారు. 9 నెలల ముందే అసెంబ్లీ రద్దు చేసి అధికార పీఠం నుంచి దిగిపోయారు. అంతేకాదు అసెంబ్లీ రద్దైన రోజే ఏకబిగిన 105 సీట్లు ప్రకటించి దేశ రాజకీయాల్లో సంచలనం రేపారు. అంతేకాదు ఎన్నికల సమరభేరి మోగించారు. హుస్నాబాద్ లో ప్రచారపర్వానికి తెర లేపారు.

సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్యం, వాస్తు పట్ల విపరీతమైన మక్కువ ఉండే కేసిఆర్ ఈ ముందస్తు సమరానికి కూడా వాటి ఆధారంగానే ఆయన రెడీ అయ్యారు. ప్రజలకు బలమైన కారణాలేవీ చూపకుండానే కేసిఆర్ ముందస్తు రణరంగంలోకి దూకారు. 105 సీట్లు ప్రకటించినప్పటికీ టిఆర్ఎస్ పార్టీ వ్యవహారశైలి తెలిసిన కొందరు అభ్యర్థులు పైకి గంభీరంగా ఉన్నా లోలోపల మథనపడుతున్నారు. కొంపదీసి తర్వాత రోజుల్లో బి ఫామ్ వస్తుందా? చివరి నిమిషంలో సీన్ మారిపోతుందా అన్న అనుమానాల్లో కొందరు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అయినా ఎవరి ఏర్పాట్లలో వారు ఉన్నారు.

కేసిఆర్ వ్యూహాలను అంచనా వేయడంలో తెలంగాణలోని అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు బోల్తా కొట్టాయని చెప్పుకోవచ్చు. అసలు కేసిఆర్ ముందస్తుకు పోకపోవచ్చు అని చాలా మంది వాదన చేశారు. రాజకీయ జిమ్మిక్కు అని కొందరు మాట్లాడారు. ప్రజా సమస్యల నుంచి పక్కదోవపట్టించేందుకు కేసిఆర్ నాటకాలు అని కూడా అన్నారు. కొందరు మాత్రం సరైన అంచనాతోనే ఉన్నప్పటికీ ఇంత జరుగుతుందని ఎక్స్ పెక్ట్ చేయలేదు. కానీ వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, ముహూర్త బలం ఆధారంగా కేసిఆర్ స్టెప్ వేశారు. దీంతో రాజకీయాల్లో పెను సంచలనం కలిగింది.

105 సీట్లను ప్రకటించడం కూడా మరో సంచలనంగా చెబుతున్నారు. ఈ సీట్ల సంఖ్య వెల్లడిలోనూ కేసిఆర్ తన అదృష్ట సంఖ్య 6 వచ్చేలా ప్లాన్ చేశారు. అంతేకాదు అభ్యర్థుల లిస్ట్ ప్రకటించే సమయంలో కూడా సరిగ్గా టైం చూసుకుని కేసిఆర్ జాబితా వెల్లడించారు. నిజానికి ఈ 105 మందిలో అనేకమందిపై తీవ్రాతి తీవ్రమైన విమర్శలున్నాయి. ఇందులో కొందరు డిపాజిట్ గల్లంతవడం కూడా ఖాయమని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయినప్పటికీ ఎవరినీ నొప్పించకుండా సీట్లు ప్రకటించారు కేసిఆర్. ఇద్దరిని మాత్రం పక్కనపెట్టారు. ఇదంతా కేసిఆర్ ‘‘ప్లాన్ ఎ’’ చెప్పుకోవచ్చు. 105 సీట్లు కేటాయించడం ప్లాన్ ఎ అయితే మరి ప్లాన్ బి ఎలా ఉందో చూద్దాం.

టిఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేత, ప్రగతి భవన్ కు రెగ్యులర్ టచ్ లో ఉన్న ఒక నాయకుడు చెప్పిన సమాచారాన్ని బట్టి చూస్తే ప్లాన్ బి అమలు జరగవచ్చని తెలుస్తోంది. ఇంతకూ ప్లాన్ బి ఏమంటే.. అన్ని రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చేలా కేసిఆర్ సీట్ల ప్రకటన చేశారు. కానీ అందులో పార్టీని బద్నాం చేసినవారు, పార్టీలో ఉంటూనే తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నవారు సుమారు పాతిక మందికి పైగానే అభ్యర్థులు ఉన్నారని టిఆర్ఎస్ వర్గాల్లో నడుస్తున్న టాక్. ఈ నేపథ్యంలో సీట్ల కేటాయింపులో ఇప్పుడే వారందరినీ పక్కనపెడితే వారంతా ఇతర పార్టీలకు క్యూ కట్టే ప్రమాదం ఉంది. కాబట్టి వారి నుంచి ఎలాంటి త్రెట్ రాకుండా ఉండేందుకు ముందుగా వారి పేర్లు అనౌన్స్ చేశారు. ఎన్నికలు దగ్గరకు వచ్చి బిఫామ్స్ ఇచ్చే సమయంలో వారిలో కొందరి పేర్లు ఎగిరిపోవచ్చన్న ప్రచారం జరుగుతున్నది. ఓడిపోతారు అని డౌటనుమానం ఉన్న వారిని చివరి నిమిషంలో మార్చేసినా ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. అలా మార్చినా ఓవరాల్ గా చూసుకుంటే జనాల నుంచి పెద్దగా వ్యతిరేకత రాకపోగా కేసిఆర్ నిర్ణయానికి జనామోదం లభించవచ్చన్న అంచనాల్లో ఉన్నారు.

ఉదారణకు చూసుకుంటే జనగామ ఎమ్మెల్యే భూకబ్జా రాయుడుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన అవినీతిని ఏకంగా జిల్లా కలెక్టరే బట్టబయలు చేశారు. అయినా ఆయనకు టికెట్ దక్కింది. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలెక్టర్ చేయి పట్టుకున్నాడు. ఆయన మీద కేసు ఫైల్ అయింది. పుట్టా మధు, చెన్నమనేని రమేష్ రావు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, జీవన్ రెడ్డి లాంటి వాళ్లు సైతం వివాదాల్లో ఉన్నారు. కానీ వీరంతా అభ్యర్థులైపోయారు. రేపు బి ఫామ్స్ ఇచ్చే సమయంలో ఇలాంటి వారి అభ్యర్థిత్వాన్ని క్యాన్సల్ చేసి కొత్తవారిని తెర మీదకు తేవడం వల్ల ఆమేరకు పార్టీకి ప్లెస్ అవుతుంది తప్ప మైనస్ కాదని వారు అంచనా వేస్తున్నారు. ఇలా బి ఫామ్స్ ఇచ్చే సమయంలో అభ్యర్థులను మార్చడం అనే ఎపిసోడ్ కు ప్లాన్ బి గా పార్టీ నేతలు పెట్టిన పేరు.

టిఆర్ఎస్ లో చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒక్క టిఆర్ఎస్ లోనే కాదు అనేక పార్టీల్లో రాత్రికి రాత్రే బి ఫామ్స్ ఇచ్చే సమయంలో అభ్యర్థులు మారిపోయిన సందర్భాలున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్లాన్ బి అమలైతే ఎవరి మెడమీద కత్తి వేలాడే ప్రమాదం ఉందోనన్న చర్చ ఊపందుకున్నది. ఒకవేళ బి ఫామ్ రానివారు వేరే పార్టీలకు వెళ్లే పరిస్థితి, అంత సమయం ఉండదు. అంతేకాకుండా వారు ఇండిపెండెంట్ గా వేసినా జనాల్లో ఇప్పటికే వ్యతిరేకత తెచ్చుకున్నారు కాబట్టి వారికి పెద్దగా లాభించదు. అంతిమంగా ఇలాంటి వాళ్లకు బి ఫామ్ ఇవ్వకపోవడం మంచిదే అని రాష్ట్రవ్యాప్తంగా జనాల్లో టిఆర్ఎస్ పట్ల సానుకూల వైఖరి వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.

మొత్తానికి ఏం చేసైనా మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కేసిఆర్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు.