తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే బ్లేడ్ తో మెడ కోసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు సినీ రంగ ప్రముఖుడు బండ్ల గణేష్. ఆయన ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపున రాజేంద్ర నగర్ సీటు కోసం ప్రయత్నం చేశారు. కానీ వర్కవుట్ కాలేదు. అయితే ఆయన స్వయంగా పవన్ కళ్యాణ్ వీర ఫ్యాన్. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆశ్చర్యం కలిగించింది.
ఇక మీడియాలో పలుమార్లు బండ్ల గణేష్ ఇంటర్య్యూలు ఇచ్చారు. ఆ సమయంలో పాపులారిటీ కోసం తాను కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే బ్లేడ్ తో మెడ కోసుకుంటానని కామెంట్ చేశారు. కావాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున నన్ను అడగండి అని సవాల్ చేశారు. కానీ ఆయన అన్నది జరగలేదు. సీన్ రివర్స్ అయింది.
ఈ నేపథ్యంలో తన కామెంట్స్ పై బండ్ల గణేష్ వివరణ ఇచ్చారు. మంగళవారం ఆయన ముక్కోటి ఏకాదశి కావడంతో తిరుమల దర్శించుకున్నారు. తిరుమల కొండ మీద మీడియాతో మాట్లాడిన బండ్ల గణేష్ ‘‘కోపంలో చాలా మంది చాలా అంటారు. అవన్నీ నిజం అవుతాయా? మా పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపడం, కాన్ఫిడెన్స్ పెంచడం కోసమే నేను అలా అన్నాను… కానీ కాన్ఫిడెన్స్ కాస్తా ఓవర్ కాన్ఫిడెన్స్ అయిందని ఇప్పుడు అర్థమైంది’’ అని సెలవిచ్చారు.
డిసెంబరు 11న తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాయి. కానీ అప్పటి నుంచి బండ్ల గణేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటూ వార్తలొచ్చాయి. కొందరైతే బ్లేడ్ లు పట్టుకుని బండ్ల గణేష్ ఇంటి ముందుకు వెళ్లారు. ఆయన ఒకవేళ మెడ కోసుకుంటానంటే తాము బ్లేడ్ ఇస్తామంటూ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో తిరుమలలో ఈ విమర్శలపైనా బండ్ల స్పందించారు. ‘‘నేను అజ్ఞాతంలో ఉన్నాని అంటున్నారు. కానీ నేనేమీ అజ్ఞాతంలో లేను. మేము ఊహించని రీతిలో మా పార్టీ ఓడిపోయింది. కాబట్టి మానసిక బాధతో ఉన్నాను. ఇలాంటి సమయంలో ఏం మాట్లాడలేం కదా? ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు. కాబట్టి మౌనంగా ఉన్నాను. మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదని ఊరుకున్నాను’’ అని వివరణ ఇచ్చారు. అంతేకాదు నేటి ఓటమే రేపటి విజయానికి పునాది అని తాము ముందుకు సాగుతామని చమత్కరించారు.