హరికృష్ణ పరామర్శ సరే, కొండగట్టు భక్తుల మాటేమిటి ?

 

తెలంగాణ ఆపద్ధర్మ సిఎం కేసిఆర్ వ్యవహారశైలి మరోసారి వివాదాస్పదమైంది. డబ్బు, పేరు, పలుకుబడి ఉన్నోళ్లకు ఒక తీరుగా, పేద వాళ్ల పట్ల మరోతీరుగా కేసిఆర్ వ్యవహరించారు. తాజాగా జరిగిన రెండు ఘటనలు దీనికి అద్దం పడుతున్నాయి. కేసిఆర్ తీరుపై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తున్నది. ఓట్లు, సీట్లు, కుల సమీకరణాలే పట్టించుకుంటే ఎలా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తాజాగా జరిగిన రెండు ఘటనల్లో కేసిఆర్ ఎలా వ్యవహరించారో ఒకసారి చూద్దాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు కూడా చూడొచ్చు.

160 కిలోమీటర్ల మెరుపు వేగంతో ప్రయాణం, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా నిర్లక్ష్యం.. ఫలితంగా సినీ నటుడు, కరుడుగట్టిన సమైక్యవాది, రాజకీయ నేత నందమూరి హరికృష్ణ మరణించారు. నల్లగొండ జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదం తెలుగు ప్రజలను ఆవేదనకు గురిచేసింది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. తెలంగాణ ప్రకటన వెనక్కు వెళ్లేలా చేయడం కోసం అప్పట్లో హరికృష్ణ తన రాజ్యసభ సీటును త్యాగం చేసి ఆంధ్రా నేతల్లో సమైక్య స్పూర్తి నింపే ప్రయత్నం చేశారు. తెలంగాణ వచ్చి నాలుగేళ్లయినా సమైక్యవాదం వినిపించిన హరికృష్ణను తెలంగాణవాదులు, తెలంగాణ ప్రజలు ఇంకా మరచిపోలేదు.

హరికృష్ణ ప్రాణంకు ఉన్న విలువ అంజన్న భక్తులకు లేకపాయే

హరికృష్ణ కోసం ఆగమాగంగా ఉరికిన అప్పటి ముఖ్యమంత్రి, నేటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ , 58 మంది చనిపోతే పరమార్శించడానికి రాకపాయే కదా.

మల్లోసారి ఉన్నోళ్ల మనిషివి అని నిరూపించుకున్నావు సారూ..

ఈ పరిస్థితుల్లో హరికృష్ణ మరణవార్త విన్న కేసిఆర్ తల్లడిల్లిపోయారు. వెనువెంటనే హరికృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరపాలని ఆదేశాలు జారీ చేశారు. హరికృష్ణ కుటుంబసభ్యులు ఎక్కడ కోరితే అక్కడ అంత్యక్రియలకు ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు. అంతేకాదు హరికృష్ణ ఇంటికి పోయి ఆయన శవానికి నివాళులు అర్పించారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ ను గుండెలకు హత్తుకుని ఓదార్చారు. ఎంతైనా తనకు రాజకీయ జీవితం ప్రసాదించిన వ్యక్తి ఎన్టీఆర్ కొడుకు కాబట్టి ఆమాత్రం చేసి ఉండొచ్చని అంటున్నారు.

ఇక తాజగా కొండగట్టు లోయలో బస్సు బోల్తా పడి 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆర్టీసి చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదం ఇది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా విషాదం నింపింది. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రాంనాద్ కోవింద్ కూడా సంతాపం తెలిపారు. అంత పెద్ద బస్సు ప్రమాదం జరిగి 60 ప్రాణాలు పోయిన సందర్భంలో తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ప్రమాద ఘటనవైపు కన్నెత్తి చూడలేదు. చిన్న రైలు ప్రమాదం జరిగి పది మంది చనిపోతేనే రైల్వే శాఖ మంత్రి వచ్చి సహాయకచర్యలు పర్యవేక్షిస్తారు. మరి బస్సు ప్రమాదం జరిగి 60 మంది చనిపోయినా తెలంగాణ సిఎం కేసిఆర్ ఎందుకు ఘటనా స్థలానికి చేరలేదు. ఎందుకు సహాయచ చర్యల్లో పాల్గొనలేదు అని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కేవలం పత్రికా ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్నారని బాధపడుతున్నారు. బాధిత ప్రజలను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు కేసిఆర్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో 2004 లో వాటర్ టాంక్ కూలి సుమారుగా 20 మందికి పైగా చనిపోయారు అప్పుడు సీఎం వై యస్ రాజ శేఖర్ రెడ్డి వెంటనే అక్కడకు వచ్చారు.రామడుగు మండలంలోని వేదిర లోని మాతా స్కూల్ బస్ బావిలో పడి 15 మంది పైన పిల్లలు చనిపోయిన సంఘటన లో సీఎం చంద్రబాబు నాయుడు గారు వెంటనే వచ్చారు. మరి 50 మందికి పైగా చనిపోయిన కూడా మన ఆపద్ధర్మ సీఎం ఎక్కడ ఉన్నారు దొరా!!!!.సీట్ల కోసం కాదు ప్రజల సంక్షేమం కోసం మాత్రమే పనిచెయ్యండి!!!

అయినదానికి కానిదానికి హెలిక్యాప్టర్ వినియోగిస్తున్న కేసిఆర్ కొండగట్టు వెళ్లే సాహసం ఎందుకు చేయలేదన్న విమర్శలు వస్తున్నాయి. నందమూరి హరికృష్ణ మరణిస్తే ఓదార్చిన ఉద్యమ నేత జనాల ప్రాణాలు పోతే రాకపోవడమేంటని నిలదీస్తున్నారు. పలుకుబడి ఉన్నవారికి ఒకతీరుగా ఏ పలుకుబడి లేని కడుపేదల పట్ల మరో తీరుగా వ్యవహరించడం సరికాదంటున్నారు. కేసిఆర్ కుమారుడు కేటిఆర్, కుమార్తె ఎంపి కవిత, రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఖమ్మం ఎంపి పొంగులేటి అంతా హెలిక్యాప్టర్ లో వెళ్లి సహాయకచర్యలు పర్యవేక్షించారు. అదే హెలిక్యాప్టర్ లో కేసిఆర్ వెళ్లి ఉండొచ్చు కదా? రోధిస్తున్న బాధితులకు ధైర్యం చెప్పవచ్చు కదా అంటున్నారు. కొంగర కలాన్ సభకు కూడా హెలిక్యాప్టర్ లో వెళ్లిన కేసిఆర్ కు కొండగట్టు వెళ్లే ప్రయత్నం ఎందుకు చేయలేదంటున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో ఇది

బాధితుల దుఖంతో జిగిత్యాల జిల్లాలోని గ్రామాలు తల్లడిల్లిపోతున్నాయి. కనీసం శవాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఐస్ గడ్డల మధ్య మృతదేహాలను ఉంచి మీదంగ వరిపొట్టు పోసి భద్రపరిచిన ఘటన తెలిసి జనాలు తట్టుకోలేకపోతున్నారు. బాధిత కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం ప్రకటించారు తప్ప వారి అంత్యక్రియలకు కనీస ఏర్పాట్లు కూడా చేయకపోవడాన్ని జనాలు విమర్శిస్తున్నారు. బంగారు తెలంగాణలో ఇదేమి దౌర్భాగ్యం అని రాజకీయ పక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కేసిఆర్ సిఎం అయిన తొలినాళ్లలో తన సొంత నియోజకవర్గంలో మాచాయిపల్లి రైలు పరమాదం జరిగింది. ఆ ఘటనలో 40 మంది పసిబిడ్డలు నేల రాలినా కేసిఆర్ ప్రమాద స్థలానికి వెళ్లలేదు. ఆసుపత్రిలో పరామర్శించారు. ఇప్పుడు 60 మంది చనిపోయినా అక్కడికి వెళ్లలేదు. ప్రగతి భవన్ నుంచే ప్రకటనలు ఇచ్చారు.

ఓ పెద్ద సారూ అదేమన్న ఉస్మానియా యూనివర్శిటీ అనుకుంటున్నవా? జగిత్యాల. నిన్ను ఎవరూ ఏమనరు జర పోయి బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిరా. అయితే ప్రగతి భవన్ లేదంటే ఫామ్ హౌస్ లోనే ఉండకు. నువ్వు పాలన ఎక్కంగనే మాచాయిపల్లి లో రైలు ప్రమాదంలో 40 మంది పసిబిడ్డలు నేలరాలిర్రు. నువ్వు పాలన నుంచి దిగిపోతున్న వేళ జగిత్యాలలో 40 మందికి పైగా భక్తుల ప్రాణాలు గాలిలో కలిసినయ్. అప్పుడు ప్రమాద స్థలానికి పోలేకపోతివి. దొంగసాటు0గ హాస్పటల్ పోయి పరామర్శించినట్లు యాక్షన్ చేస్తివి. ఇప్పుడు కూడా జగిత్యాల పోకుండా ప్రగతి భవన్ నుంచి మాటలు చెప్పబడ్తివి. జర పో. బాధితులను ధైర్యం చెప్పు. ఉష్మానియా పోరగాళ్లు ఆడికేం రారు లే.

ఈ విషయంలో తెలంగాణ ప్రజలకు కేసిఆర్ జవాబు చెప్పాల్సిన అవసరమైతే ఉందని అన్ని వర్గాల నుంచి వస్తున్నమాట.