ప్రజల కోసం 24 గంటల పాటు సేవలు చేసే పోలీసులు తమ కుటుంబంతో సమయం గడపటానికి కూడా తీరిక లేకుండా వారి విధులు నిర్వహిస్తున్నారు. అయితే అత్యవసర సమయాలలో కూడా వారికి సెలవులు లభించక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో ఒక అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారులకు సెలవు కోసం అభ్యర్థించిన కానిస్టేబుల్ వారు సెలవు మంజూరు చేయకపోవడంతో తన రెండేళ్ల కుమారుడు ఉదయాన్నే భుజాన వేసుకొని ఏఎస్పీ కార్యాలయం ముందు బైఠాయించిన ఘటన సంచలనంగా మారింది.
వివరాలలోకి వెళితే… ఉత్తర ప్రదేశ్ లోని మథుర ప్రాంతానికి చెందిన సోనూ చౌదరి అనే వ్యక్తి బైద్పుర్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తన భార్య కవిత, రెండేళ్ల కుమారుడు హర్షిత్‌తో కలిసి ఏక్తా కాలనీలో నివసిస్తున్నాడు. సోను చౌదరి భార్యకు అనారోగ్యంగా ఉండటంతో ఇటీవల ఆమెకు ఆపరేషన్ నిర్వహించారు. ఆమెకు పూర్తి విశ్రాంతి కావాలని డాక్టర్లు సూచించడంతో సోను చౌదరి సెలవు కోసం ఉన్నతాధికారులను అభ్యర్థించారు. అయితే వారు తనకి సెలవు మంజూరు చేయకపోవడంతో ఎప్పటిలాగే బుధవారం కూడా విధులకు హాజరయ్యాడు. సోను చౌదరి భార్య అనారోగ్యంగా ఉండటం వల్ల తన రెండేళ్ల కుమారుడు ఇంటి నుండి బయటకు వెళ్లి ఇంటి సమీపంలో ఉన్న నీటి గుంటలో పడి మరణించాడు.
ఎక్కువ సమయం గడిచినా కూడా కుమారుడు ఇంటికి రాకపోవటంతో సోను చౌదరి భార్య కవిత కొడుకు కోసం బయటకు వెళ్లి చూడగా నీటిగుంటలో శవమై కనిపించాడు. వెంటనే ఈ విషయం గురించి తన భర్తకు తెలియజేయడంతో హుటాహుటిన ఇంటికి చేరుకున్న సోను చౌదరి కన్నీరు మున్నీరుగా వినిపించాడు. ఈ క్రమంలో తన రెండేళ్ల కుమారుడు మృతదేహాన్ని భుజాల మీద మోసుకొని ఏఎస్పీ కార్యాలయానికి వెళ్లి తనకు సెలవు ఎంత అవసరమో తెలియజేస్తూ కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో ఎస్ఎస్పీ కార్యాలయంలోని అధికారులు కానిస్టేబుల్‌ను ఓదార్చి తిరిగి ఇంటికి పంపించారు. దీనిపై స్పందించిన ఎస్పీ కపిల్‌దేవ్ సింగ్ విచారణకు ఆదేశించారు.