చంద్రబాబు నాయుడుకు కొరకరాని కొయ్యలుగా తయారైన వైసీపీ నేతల్లో కొడాలి నాని ఒకరు. ఈయన్ను నిలువరించడం చంద్రబాబు తరం కావట్లేదు. నాని చంద్రబాబు గురించి మాట్లాడారు అంటే టీడీపీ నేతలు చెవులు మూసుకోవాల్సిందే. అలా ఉంటాయి నాని వాడుక పదాలు. చంద్రబాబును నాని ద్వేషిస్తున్న స్థాయిలో వైఎస్ జగన్ కూడ ద్వేషించరేమో. నిజానికి గుడివాడలో నాని రాజకీయ భవితవ్యం మైదలైంది తెలుగుదేశం పార్టీతోనే. జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు కావడం, అప్పట్లో హరికృష్ణ మద్దతు కూడ ఉండటంతో నాని తెలుగుదేశంలోకో ఈజీగానే ప్రవేశించారు. ఇక ఎలాగూ కమ్మవర్గమే కాబట్టి గుడివాడ జనం నానికి జైకొట్టారు.
2004, 2009 లో టీడీపీ తరపున గుడివాడ నుండి పోటీ చేసిన నాని రెండుసార్లు గెలిచారు. కానీ 2014 ఎన్నికలకు ముందు పార్టీలో నందమూరి కుటుంబానికి విలువ లేకుండా పోయిందని, దానికి కారణం చంద్రబాబు రాజకీయమేనని అంటూ టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లారు. వైఎస్ జగన్ సైతం నానికి మంచి విలువే ఇచ్చారు. 2014, 2019లో వైసీపీ తరపున పోటీ చేసిన నాని రెండుసార్లు గెలిచారు. ఈ దఫాలో మంత్రిని చేశారు జగన్. అప్పటి నుండి రోజురోజుకూ నాని మాటల దాడి పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. తాను చేయిచ్చి పైకితీసుకొచ్చిన వ్యక్తి ఇప్పుడు తన మీదే తిరగడబడటం చంద్రబాబుకు తీవ్ర అసహనాన్ని తెప్పిస్తోంది. అలాగని తానే కలుగజేసుకుని మాట్లాడితే నాని స్థాయిని ఇంక పెంచినట్టే. అందుకే బాబుగారు ప్రత్యామ్నాయ వ్యూహాన్ని రెడీ చేసుకుంటున్నారు.
ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నానిని ఓడించి తీరాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. అయితే గుడివాడ కంచుకోటలో నాని ఢీకొట్టడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అవతల బలమైన క్యాండిడేట్ ఉండాలి. ప్రస్తుతానికి గుడివాడలో చెడుగుడు ఆడుకునే టీడీపీ నేతలు ఎవ్వరూ లేరు. రావి వెంకటేశ్వరరావు, దేవినేని కుటుంబం కూడ చేతులెత్తేసింది. అందుకే ఏకంగా నందమూరి రక్తాన్ని బరిలోకి దింపాలని చూస్తున్నారట. నాని మీద పోటీగా నందమూరి వార్సుల్లో ఒకరైన కళ్యాణ్ రామ్ ను పోటీకి దింపవచ్చనే మాటకు వినబడుతున్నాయి. ఎన్టీఆర్ మనవడిగా, హరికృష్ణ కుమారుడిగా కళ్యాణ్ రామ్ ను జనం ఆదరించే అవకాశం ఉంది.
అదీ కాకుండా ఎన్టీఆర్ గుడివాడ నుండే వచ్చారు. అలాంటి గుడివాడలో ఎన్టీఆర్ మనవడు నిలబడితే జనం గెలిపించకుండా ఉంటారా అనేది బాబుగారి ధీమా అంటున్నారు. అయితే అన్న కళ్యాణ్ రామ్ అంటే జూనియర్ ఎన్టీఆర్ కు ఎనలేని ప్రేమ. కీలకమైన సమయాల్లో వెన్నంటే ఉంటారు. ఒకవేళ రేపు ఎన్నికల్లో కళ్యాణ్ రామ్ పోటీలోకి దిగితే ఆయనకు మద్దతుగా ఎన్టీఆర్ వచ్చి గుడివాడలో ప్రచారం చేస్తారా, తన మిత్రుడు కొడాలి నానికి షాకిస్తాడా అనేదే అందరినీ తొలిచివేస్తున్న ప్రశ్న. ఎన్టీఆట్ వచ్చినా రాకపోయినా బాలకృష్ణ మాత్రం అన్న కొడుకు కోసం గుడివాడలో ప్రచారం చేయడం ఖాయం. ఒకవేళ చంద్రబాబు పాచికలన్నీ పారి కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, బాలకృష్ణ రంగంలోకి దిగితే గుడివాడలో కొడాలి వెర్సెస్ నందమూరి ఫైట్ మహా రసవత్తరంగా ఉంటుంది.