ప్రగతి సభలో చంద్రబాబును టార్గెట్ చేస్తూ కేసిఆర్ స్పీచ్ షురూ

ప్రగతి నివేదన సభలో టిడిపి అధినేత చంద్రబాబుపై విమర్శలు చేస్తూ సిఎం కేసిఆర్ తన ప్రసంగాన్ని షురూ చేశారు. సమావేశంలో కేసిఆర్ స్పీచ్ ఆరంభం కాగానే 2000 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి (చంద్రబాబు పేరు తీసుకోకుండానే) విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పారు. ఆ విద్యుత్ ఛార్జీలు తెలంగాణ ప్రజలు మోయలేరని తాను లేఖ రాశానని అన్నారు. ఆనాటి ప్రభుత్వానికి అధికార మదంతో కండ్లు మూసుకుపోయాయని అన్నారు. పెంచిన కరెంటు ఛార్జీలు తెలంగాణ ప్రజల పాలిట ఉరితాడు వంటివి అని, తాను ఛార్జీల పెంపును వాపస్ తీసుకోవాలని లేఖ రాసినట్లు చెప్పారు. ఆ లేఖతోనే తెలంగాణ ఉద్యమం ఆరంభమైందన్నారు.

సమైక్య రాష్ట్రంలో మా కష్టాలు తీరవని మా రాష్ట్రం కోసం ఉద్యమాన్ని ప్రారంభిస్తానని అప్పుడే ప్రకటించానని అన్నారు. ఆనాడు ఎక్కువ మాట్లాడితే కేసులు పెడతాం. లాఠీఛార్జీలు చేస్తాం. కాల్చి పారేస్తాం అన్న అహంకారంతో ఆనాటి పాలకులు (చంద్రబాబును ఉద్దేశించి) ఉన్నారని వివరించారు. ఆనాడు ఎన్డీఎ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న పాలకులు అహంకారంతో కండ్లు మూసుకుపోయి వ్యవహరించారని మండిపడ్డారు. అహంకారంతో కండ్లు మూసుకుపోయిన ప్రభుత్వం ఆనాడు ఉన్నందున నా మాటలు ఖాతరు చేయలేదన్నారు.

కారు చీకటిలో రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని మొదలు పెట్టానని చెప్పారు. పిరికెడు మందితో ఉద్యమం మొదలు పెట్టినా తర్వాత వందలు, వేలు, లక్షల మంది ఉద్యమంలో మమేకమయ్యారని అన్నారు. ధర్మం, న్యాయంతో ఉండి విజయం సాధించామన్నారు. తెలంగాణ సాధించే వరకు మడమ తిప్పను అని ఆనాడే చెప్పానని, ఒకవేళ తెలంగాణ సాధించకపోతే రాళ్లతో కొట్టి చంపండి అని తాను మాట ఇచ్చానని గుర్తు చేశారు.