తెలంగాణ సీఎంగా ఒక దశాబ్దాని పైగా పాలించి.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఈరోజు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లో జరుగుతున్న విచారణలో 115వ సాక్షిగా హాజరయ్యారు. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని విచారణ కమిషన్ ముందు ఆయన హాజరైన ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
హైదరాబాద్ BRK భవన్‌లో ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన ఈ విచారణ దాదాపు 50 నిమిషాల పాటు సాగింది.
ఈ సందర్భంగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం, ప్రాజెక్ట్ రూపకల్పన, నిర్వహణలో తలెత్తిన అనేక అంశాలపై కమిషన్ ప్రశ్నలు సంధించింది. కేసీఆర్ తన వాదనను సమర్థించుకుంటూ, ప్రాజెక్టును తెలంగాణ గర్వకారణంగా అభివర్ణించారు. రాష్ట్రానికి తాగునీరు, సాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టును ఎలా రూపొందించామన్న దానిపై ఆయన కీలక వివరాలు సమర్పించినట్లు సమాచారం.
తన వాదనను బలపర్చేందుకు కేసీఆర్ కీలక పత్రాలను కమిషన్‌కు అందించినట్టు తెలిసింది. ఈ పత్రాలతో పాటు, గతంలో హాజరైన మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్‌ల సాక్ష్యాలు కలిపి విచారణ కమిషన్ కీలక నిర్ణయాలకు దారి తీసే అవకాశముంది.
కేసీఆర్ ఉదయం ఎర్రవెల్లి ఫాం హౌస్ నుంచి తెలంగాణ భవన్‌కు చేరుకుని అక్కడి నుంచి పార్టీ నాయకులతో కలిసి భారీ ర్యాలీగా BRK భవన్‌కు బయలుదేరారు. ఈ ర్యాలీలో BRS నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ వడ్డీరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్‌లు కూడా ఆయన వెంట ఉన్నారు. BRS పార్టీ ఈ విచారణపై తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ఇది రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సీఎంను లక్ష్యంగా చేసుకుని ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది. విచారణను ముందుగా జూన్ 5న జరపాల్సి ఉన్నప్పటికీ, అదనపు సమయం కోరిన కేసీఆర్ జూన్ 11న హాజరయ్యారు.