(లక్ష్మణ్ విజయ్ కొలనుపాక)
తెలంగాణ ఎన్నికలు తెలుగు దేశం పార్టీకి వరప్రసాదం లాగా చేతికందాయి. పార్టీని బతికించేందుకు, మోదీకి తగిన జవాబు చెప్పేుందుకు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశం లభించింది. దానికితోడు పార్టీ బతుకుతుందో లేదో, భవిష్యత్తేమిటి అనే బెంగతో ఉన్న తెలుగుదేశం అభిమానులకు, కార్యకర్తలకు కొండంత బలం వచ్చింది. తెలంగాణ గడ్డ మీద మళ్లీ చంద్రబాబు తిరుగుతున్నారు. ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. దుమ్ము గొట్టుకు పోతున్న జండాలను దులిపి రోడ్డెక్కుతున్నారు. ఇది, చంద్రబాబు నాయుడిలో తెలంగాణ గురించి పునరాలోచించేందుకు అవకాశమిచ్చింది.
ఈ ఎన్నికల్లో ఓడినా గెలిచినా టిడిపికి లాభమే. ఎందుకంటే, పార్టీపునరుజ్జీవం పొందుతూ ఉంది. తెలంగాణ లో ఉన్న తెలుగుదేశం అభిమానులు చాలా విశిష్టమయిన వ్యక్తులు. చంద్రబాబు నాయుడు అమరావతికి వెళ్లిపోయాక, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓటమి తర్వాత నేతలెవరూ తెలంగాణ వైపు కన్నెత్తి చూడకపోయినా టిటిడిపి కార్యకర్తలు టిఆర్ ఎస్ లోకో , కాంగ్రెస్ లోకో లేదా బిజెపి వైపో పరిగెత్త లేదు.వాళ్లంతా పార్టీ ఇలా అయిపోతున్నదేమిటని దిగులుపడ్డారు తప్ప ఎమ్మెల్యేల లాగా పార్టీ ఫిరాయించలేదు.
ఎందుకంటే, వారు ఐడియాలజికల్ గా వారు తెలుగుదేశానికి వీరాభిమానులు, కెసియార్ కు బద్ధ విరోధులు. తెలంగాణ తెచ్చిన యోధుడని, ఉద్యమకారుడని చెప్పుకుంటూ కెసియార్ గజ్వేల్ నుంచి పోటీ చేసినపుడు చెమటలు పట్టించింది ఈ కార్యకర్తలే. తెలుగుదేశం పార్టీని ద్రోహిగా చిత్రించి తెలంగాణ నుంచి తరిమేస్తామని చెబుతూ కెసియార్ గజ్వేల్ లో ప్రచారం చేసినా తెలుగుదేశం పార్టీకి రెండోస్థానం ఇచ్చారు. కెసియార్ కు ఇచ్చింది కేవలం 19 వేల మెజారిటీ మాత్రమే. నిజానికి ‘ఉద్యమనేత’గా గుర్తింపు ఉంటే అక్కడ ఆయన పోటీ లేకుండా గెలవాలి. తెలుగుదేశం కార్యకర్తలు దానికి ఒడి గట్టలేదు. టిడిపికి ద్వితీయ స్థానం ఇచ్చారు. ఇది టిడిపి అభిమానుల అంకిత భావం. ఇది వెర్రి అభిమానం. చాలా ఆలోచనతో తీసుకున్న నిర్ణయం. ఎవరీ ప్రజలు, ఎవరీ అభిమానులు? తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం అమలుచేస్తున్నదని 1983లోనే గుర్తించి టిడిపికి అంకితమయిన వెనకబడిన వర్గాల ప్రజలు.
ఇపుడు ఎన్నికలు రావడం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రజా కూటమి తరఫున పోటీ చేస్తుండటంతో ఎక్కడ చూసినా వారు ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ ఉత్సాహం ఎన్నికల తర్వాత కూడా కొనసాగేలా చేసేందుకు పార్టీ అధినేత కొత్త వ్యూహం పన్నుతున్నారని విశ్వసనీయ సమాచారం.
ఎన్నికల అనంతరం తెలంగాణ తెలుగుదేశం పార్టీ అలనా పాలనా చూసే బాధ్యతను జూనియర్ ఇవ్వబోతున్నారని తెలిసింది. ఇదీ కొత్త వ్యూహం. నిజానికి ఇది చాలా పాత మాటే, ఎపుడో ఈ టాక్ వచ్చింది. ఆంధ్రలో నారా లోకేశ్ , ఇక్కడ జూనియర్ ఎన్టీయార్ పార్టీలకు నాయకత్వం వహిస్తారని నాలుగేళ్ల కిందటే అన్నారు. ఆ వ్యూహం అమలు కాలేదు. ఇపుడు సమయం ఆసన్నమయిందని అంటున్నారు.
నిజానికి జూనియర్ని కెసియార్ తన వైపు లాక్కోవాలని ప్రయత్నించారు. లాక్కోలేకపోతే,తెలుగుదేశం వైపు వెళ్లకుండా న్యూట్రలైజ్ చేద్దామని చూశారు . అందుకే హరికృష్ణ చనిపోయినపుడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు, ఆపైన సమాధి నిర్మాణం ఇలా ఏవేవో అన్నారు. ఇవన్నీ ‘అన్న’ ఎన్టీయార్ మీద అభిమానంతో చేసినవికాదు, రాజకీయ ఎత్తుగడలే. అయితే, జూనియర్ చాలా విజ్ఞతతో ప్రవర్తించి ఆ వలలో పడలేదు. ఇపుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా చంద్రబాబునాయుడు తెలంగాణలో కూడా టిడిపి పటిష్టపర్చాలని నిర్ణయించారని, దీనికి జూనియర్ యోగ్యడని భావించిస్తున్నట్లు తెలిసింది.
జూనియర్ కు రాజకీయాల్లోకి రావాలని కోరిక ఉన్నట్లు స్పష్టం. అయితే, ఇంకా ఆయన తుదినిర్ణయం తీసుకోలేదు. సోదరి సుహాసిని కూకట్ పల్లిలో పోటీచేయడంతో తాను తప్పని సరిగా ప్రచారం చేయక తప్పడం లేదు. ఇంతకంటే గొప్ప రాజకీయ ప్రవేశం ఏముంటుంది. ఇదే అదనుగా తీసుకుని ఆయన ఫుల్ టైం రాజకీయనాయకుడిగా మార్చాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు టిడిపి వర్గాల్లో టాక్.
చంద్రబాబు, లోకేశ్ లను టిఆర్ ఎస్ విమర్శిస్తూ ఉంది. జూనియర్ నిలబడితే, విమర్శించడం కష్టం. ఆయన హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాడు. క్లీన్ ఇమేజ్ ఉన్నవాడు. జూనియర్ తెలంగాణ టిడిపి నాయకుడిని చేస్తే టిఆర్ ఎస్ నొరు మూయించవచ్చు. జూనియర్ ఎన్టీయార్ జనం మధ్య సాధారణ మనిషిలాగా కనిపిస్తాడు. సినిమా సెట్స్ లో ఉన్నట్లు ఫీలయి డైలాగుల కోసం ఆవేశపడే బాపతు కాదు. జూనియర్ లో ఉన్న మరొక గుణం. నిగ్రహం-విగ్రహం. ఈ విషయంలో ఆయనకు సాటి ఎవరు?
నాయకుడి రాక కోసం ఆరాటంతో ఎదురుచూస్తున్న తెలంగాణ క్యాడర్ లో జూనియర్ రాక వేయి వోల్టుల విద్యు చ్ఛ క్తి నింపుతుంది. ఇక్కడ జూనియర్ లను పార్టీని నడిపేందుకు నియమిస్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీమాంధ్రలో కన్నా తెలంగాణలో టిడిపి బలంగా ఉండింది. అయితే, విభజన పర్యవసానాలవల్ల తెలంగాణ పార్టీ నిర్ల క్ష్యానికి గురయింది. ఇపుడు కెసియార్ ముందస్తు ఎన్నికలు టిడిపికి ఒక వరంలాగా పార్టీ పునరుద్ధరణకు ఉపయోగపడుతున్నాయి.
చంద్రబాబునాయుడు పూర్తి స్థాయిలో తెలంగాణ మీద దృష్టి నిలపగలుగుతున్నారు. 2019 లో ఎన్నికలు జరిగి ఉంటే ఇలా జరిగేది కాదు. ఇలా జరగుతుందని తెలిస్తే, కెసియార్ ముందస్తు ఎన్నికలకు పోయేవాడేకాదు. ఇపుడుకేసియార్ కు ఏమి తోచడం లేదు. ఆయనకు చంద్రబాబు భూతం పట్టుకుంది. తెలంగాణకు అది చేస్తాం, ఇది చేస్తామని చెబితే ప్రజలు వినే స్థితిలో లేరు. అందువల్ల చంద్రబాబు ను బూచిలా చూపించి వోట్లు అడుగుతున్నారు. ఇది కూడా టిడిపి కి హర్షదాయకమే. తెలుగుదేశం ప్రచారం సగం ఆయనే చేస్తున్నారు.
ఈ టెంపో ఇలా కంటిన్యూ కావాలంటే, తెలంగాణకు ఒక నాయకుడు అవసరమని, అది జూనియర్ తప్ప మరొకరు చేయలేని పని అని పార్టీ భావిస్తున్నట్లు తెలంగాణ టిడిపి సీనియర్ నాయకుడొకరు ‘తెలుగురాజ్యం’కు చెప్పారు. ఏమవుతుందో చూడాలి.
(ఇందులో వ్యక్తం చేసిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)