ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీకి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. నిర్మల్ పట్టణంలో గుండుగుత్తగా టిఆర్ఎస్ లీడర్లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరేందుకు రెడీ అయ్యారు.
నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పల గణేష్ తో సహా 15 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరనున్నారు. నిర్మల్ టిఆర్ ఎస్ లో గత కొంత కాలం నుంచి అసంతృప్తి రాగం నడుస్తుంది. అయితే దీనిపట్ల అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వీరందరూ పార్టీని వీడాలని భావించినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం నిర్మల్ తాజా మాజీ ఎమ్మెల్యేగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారు. అయితే అల్లోల తీరు నచ్చక గతంలోనే నిర్మల్ లో అసంతృప్తి జ్వాల రగిలింది. అప్పుడు ఏదో సర్ది చెప్పటంతో అంతా సద్దుమణిగింది. మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్నా కూడా నిర్మల్ పట్టణానికి నిధులు విడుదల చేయకపోవడం పై ఆందోళనలు చేశారు. తాజాగా నిర్మల్ సీటు మళ్లీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికే కేటాయించడం పై స్థానిక నేతలు ఆగ్రహంగా ఉన్నారని నేతల ద్వారా తెలుస్తోంది.
ఎమ్మెల్యే అభ్యర్దుల ప్రకటన తర్వాత స్థానిక నేతలు టిఆర్ ఎస్ కీలక నేతలను కలిసి ఇంద్రకరణ్ రెడ్డిని మార్చాలని కోరినట్టు తెలుస్తోంది. అభ్యర్ధి మార్పు కుదరని స్పష్టం చేయడంతోనే నిర్మల్ మున్సిపల్ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారని పలువురు నాయకులు తెలిపారు.
నిర్మల్ మున్సిపాలిటి చైర్మన్ అప్పల గణేష్ తో పాటు మరో 15 మంది కౌన్సిలర్లు టిఆర్ ఎస్ ను వీడి రెండు రోజుల్లో కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ నేతలు నిర్మల్ నేతలతో సమావేశమై చర్చించినట్టు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో పిసిసి చీఫ్ ఉత్తమ్ సమక్షంలో వారంతా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని స్పష్టమైంది.
ఈ లోగా టిఆర్ ఎస్ నేతలు నేతలతో సంప్రదింపులు జరిపి వారి నిర్ణయాన్ని మారుస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేని పక్షంలో గతంలోనే గులాబీ బాస్ కేసీఆర్ అసంతృప్తులకు కఠిన హెచ్చరికలు చేశారు. పార్టీ మారినా ఎటువంటి అభ్యంతరం లేదని ఉన్నవాళ్లే చాలని చెప్పారు. కాబట్టి వారు పార్టీ మారినా వారితో చర్చించే అవకాశాలు ఉండవేమో అనే అనుమానాలను కూడా కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వ్యవహారం వల్లనే నిర్మల్ లో ఈ పరిస్థితి దాపురించిందని స్థానిక నేతలు వాపోతున్నారు.
ఎన్నికల వేళ పార్టీలన్నింటికి షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి. అధికార పార్టీ ప్రతిపక్షాలకు గాళం వేస్తే ప్రతిపక్షాలు అధికార పక్ష నేతలకు గాళమేస్తున్నాయి. కీలక నేతలంతా పార్టీలు మారుతుండటంతో తెలంగాణ రాజకీయాలు రసవత్తరమవుతున్నాయి. నిర్మల్ రాజకీయ రణరంగం తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ అయ్యింది.