ఒకటి కాదు, రెండు కాదు.. ఐదూ కాదు, పదీ కాదు.. ఏకంగా 32 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ తెలంగాణ నుంచి పోటీ చేస్తుందంటూ, జనసేన పార్టీకి చెందిన తెలంగాణ విభాగం ఓ ప్రకటన విడుదల చేసేసింది.
ఇంతకీ, జనసేన పార్టీకి ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు వున్నారా.? అభ్యర్థులదేముంది.? పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఎవరో ఒకర్ని ముందుకు తీసుకొచ్చి, నామినేషన్ వేయించెయ్యొచ్చు. గతంలోనూ తెలంగాణలో జనసేన పోటీ చేసింది, కానీ ఎక్కడా గెలవలేకపోయింది. అయితే, అది గతం.
ఇప్పుడు ఈక్వేషన్ మారింది. తెలంగాణలో 32 నియోజకవర్గాల సంఖ్యని జనసేన ప్రకటించడం వెనుక పెద్ద కథే వుంది. ఈసారి టీడీపీతో కలిసి జనసేన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుంది. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని జనసేనాని నమ్ముతున్నారు.
ఏమో, గుర్రం ఎగరావచ్చు.. అన్న చందాన, తెలంగాణ రాష్ట్ర సమితి గనుక, జనసేనకు స్నేహ హస్తం అందిస్తే.. ఈక్వేషన్ వేరేగా వుంటుంది. అప్పుడైతే ఓ మూడు నాలుగు సీట్లలో జనసేన పోటీ చేసినా, ఖచ్చితంగా సానుకూల ఫలితాలుంటాయ్.
పొత్తుల వ్యవహారాల్ని బట్టి, పోటీ చేసే సీట్ల సంఖ్యలో మార్పు వుంటుందని తెలంగాణ జనసేన ప్రకటించడం ఈ మొత్తం వ్యవహారంలో అతి పెద్ద కామెడీ.! జనసేన – బీజేపీ పొత్తు వుంది. టీడీపీ – జనసేన పొత్తు కుదిరింది. అలాంటప్పుడు, ఆ రెండు పార్టీలతో సంబంధం లేకుండా, పోటీ చేయనున్న నియోజకవర్గాల సంఖ్యని జనసేన ప్రకటించేయడమేంటో.!
తెలంగాణలోనే 32 చోట్ల పోటీ చేస్తున్నారు గనుక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా 75 సీట్లను జనసేన, టీడీపీ నుంచి డిమాండ్ చేయొచ్చన్నమాట.