తెలంగాణలో ముందస్తు ఎన్నికల సమయంలో ఈ రెండు పేర్ల గురించి వార్త ఏందబ్బా అనుకుంటున్నారా? ఇది ఎన్నికలకు ఏమాత్రం సంబంధం లేని ముచ్చట. ఎలక్షన్ కోడ్ దీనికి వర్తించుదు సుమీ. ఫుల్ డిటైల్స్ చదవండి.
రాజకీయ నాయకుల వ్యవహార శైలినిబట్టి, వారి మీద జనాల్లో ఒక ఇంప్రెషన్ ఏర్పడుతుంది. కొందరు నాయకులు రాజకీయ తెర మీద తీపిగా మాట్లాడుతారు. కానీ వారు తెర వెనుక ఘోరంగా ఉంటారు. తెర వెనుక విషయాలు అప్పుడప్పుడు బయటకొస్తాయి. తెర మీద ముచ్చట్లు నిత్యం చర్చల్లో ఉంటాయి. మరి చంద్రబాబు, జానారెడ్డి గురించి తెలుసుకోవాల్సిందేముందంటే..
చంద్రబాబు నాయుడు ఇప్పటికి 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాల్లో ఆయన కొన్నిసార్లు ఓడిపోయారు. కొన్నిసార్లు గెలిచారు. మంచి పరిపాలన చేస్తాడని పేరు తెచ్చుకున్నారు. నియంత మాదిరి పాలన అని విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే చంద్రబాబు మాత్రం తాను వాడే భాష విషయంలో ఏనాడూ రాజీ పడలేదు. రాజకీయాల్లో ఆయన ఏనాడూ ఎవరినీ హీనమైన భాషలో తిట్టిన దాఖలాలు లేవు. చంద్రబాబు ఎంత సీరియస్ అంశమైనా సరే భాషలో రాజీ పడరు. హుందాతనం కోల్పోలేదు. ప్రత్యర్థిని విమర్శించాల్సి వచ్చినా సరే పరుషమైన భాష వాడలేదు. చంద్రబాబు నోట వచ్చిన పరుషమైన తిట్లు అంటే ‘‘పిచ్చ పిచ్చగా ఉందా?, ఏం తమాషా గా ఉందా? ’’ లాంటివే తప్ప అంతకుమించిన పదాలు దొరకవు.
ఇక తెలంగాణ రాజకీయాల్లో భాషలో హుందాతనం చూపించిన నాయకుల జాబితాలో మాజీ మంత్రి జానారెడ్డి ముందువరుసలో ఉంటారు. మిన్ను విరిగి మీద పడినా సరే జానారెడ్డి మాట తూలరు. ప్రత్యర్థి వికారంగా మాట్లాడినా, బూతులు తిట్టినా సరే జానా భాష మాత్రం హుందాతనం కోల్పోదు. ఇక అసెంబ్లీలో జానారెడ్డి మాట్లాడే సమయంలో అయితే అబద్ధం అనే పదవం పార్లమెంటరీ భాష కాదన్న ఉద్దేశంతో సత్యదూరం అని మాట్లాడే మనిషి జానారెడ్డి. జానారెడ్డి కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. తెలుగు నేల మీద సుదీర్ఘ కాలం కేబినెట్ మంత్రిగా పనిచేసిన వారిలో తొలి వ్యక్తి జానారెడ్డే. రాజకీయ ప్రత్యర్థులు ఎవరైనా సరే జానారెడ్డి భాష మాత్రం ఒకేలా ఉంటుంది.
తెలుగు రాజకీయాల్లో హుందాతనం తో కూడిన భాష మాట్లాడే నాయకులు చాలామందే ఉన్నారు. మహిళా నేతలు సైతం ఉన్నారు. అయితే కొందరు మహిళా నేతలు ప్రత్యర్థులపై పరుషమైన భాష వాడేవారు కూడా ఉన్నారు. భాషలో హుందాతనం చూపించే నాయకురాళ్ల జాబితాలో మాజీ మంత్రులు జె గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డిలు ఉంటారు. వారితోపాటు కేసిఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపి కవిత కూడా వీరి జాబితాలోనే ఉంటారు.
చంద్రబాబు పార్టీ అధినేత కదా? ఆయన పార్టీలో ఉన్న వారంతా అదే భాషలో మాట్లాడతారా? అంటే దానికి సమాధానం నో అనే వస్తుంది. ఎందుకంటే బాబు నాయకత్వంలోని టిడిపిలో పనిచేసే చాలామంది నాయకులు నోటికి పనిచెప్పే వారే ఉన్నారు. చింతమనేని ప్రభాకర్, మంత్రి ేదేవినేని ఉమ లాంటివాళ్లు అప్పుడప్పుడు నోటికి పనిచెప్పిన దాఖలాలు ఉన్నాయి. అయితే టిడిపిలో సీనియర్ నేతలుగా ఉన్న యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, దివంగత నేత ఎర్రంనాయుడు లాంటివాళ్లు చంద్రబాబు బాటలోనే నడుస్తున్నారు ఇప్పటికీ.
ఇక తెలంగాణలో చూస్తే టిడిపిలోనే ట్రైనింగ్ తీసుకున్న రేవంత్ రెడ్డి మాత్రం చంద్రబాబు భాషను వంటబట్టించుకోలేదు. కేసిఆర్ భాష నేర్చుకున్నారు. టిడిపిలో ఉండి టిఆర్ఎస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు, లాంటివాళ్లు అప్పుడో ఇప్పుడో నోరు జారి మాట్లాడినవాళ్లే. మండవ వెంకటేశ్వరావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి లాంటి టిడిపి తెలంగాణ నేతలు సరళమైన భాషలోనే మాట్లాడతారు. టిడిపిలో నుంచి కాంగ్రెస్ లో చేరిన నాగం జనార్దన్ రెడ్డి కూడా నోటికి పని చెప్పిన దాఖలాలున్నాయి.
ఇక తెలంగాణలో మాజీ మంత్రుల స్థాయి ఉన్న డికె అరుణ, పిసిసి ప్రసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ్మ లాంటివాళ్లు కూడా నోరు జారిన సందర్భాలున్నాయి. టిఆర్ఎస్ లో సరళమైన భాషలో మాట్లాడే నేతల జాబితాలో ఎంపి కవిత తర్వాత, ఈటల రాజేందర్ లాంటి ఒకరిద్దరు నేతలే ఉంటారు. పార్టీ అధినేత కేసిఆర్, ఆయన కొడుకు కేటిఆర్, అల్లుడు హరీష్ రావు సహా సింహభాగం నేతలు తమ నోటి బలం (తిట్ల భాష)తో నెట్టుకొస్తున్నవారే.
తెలంగాణలో బిజెపి నేతలు డాక్టర్ లక్ష్మణ్, కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, రాంచందర్ రావు లాంటి వారంతా హుందాగా మాట్లాడతారు. ఆంధ్రా బిజెపి నేతలు కూడా హుందాగానే మాట్లాడతారు.
లెఫ్ట్ పార్టీల విషయానికి వస్తే సిపిఐ చాడా వెంకట్ రెడ్డి హుందాగానే మాట్లాడతారు. సురవరం సుధాకర్ రెడ్డి, బివి రాఘవులు, సీతారం ఏచూరి లాంటి వాళ్లు కూడా భాషలో హుందాతనం చూపిస్తారు.
తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం కూడా హుందాగానే మాట్లాడతారు. ఆయనను ఒక సమయంలో కేసిఆర్ బండబూతులు తిట్టినా సరే… కోదండరాం మాత్రం తాను ఆ భాష మాట్లాడలేనని చెబుతూ హుందాగానే బుదలిచ్చారు.
ఇక సీమాంధ్రలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా నోటికి పనిచెప్పే నాయకుడే. ఆయన తండ్రి వైెఎస్ కూడా నోరు జారిన సందర్భం ఉంది. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మినారాయణ లాంటి నాయకులు సైతం నోటికి పనిచెప్పే వారి జాబితాలోనే ఉన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా నోరు జారే మనిషిగానే ముద్ర పడ్డారు. ఆ మాటకొస్తే పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి కి తిట్ల భాష రాదు. ఆయన ఎక్కడా నోరు జారిన సందర్భాలు లేవు.
వైసిపి నాయకురాలు అతి తక్కువ మంది మాత్రమే భాషలో హుందాతనం చూపుతారు. జగన్ సహా రోజా, అంబటి రాంబాబు లాంటివాళ్లు పరుషమైన భాషలో మాట్లాడతారు. కానీ కొణతాల రామకృష్ణ, బోత్స సత్యనారాయణ లాంటి వాళ్లు నోరు జారిన దాఖలాలు లేవు. ఇక కాంగ్రెస్ నుంచి జనసేన లో చేరిన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా భాషలో హుందాగానే ఉంటారు.
కొస మెరుపు : టిడిపి వ్యవస్థాపకులైన దివంగత ఎన్టీఆర్ నిత్యం నోటికి పనిచెప్పే నాయకుడు. ఆయన నోటి నుంచి కుక్క మూతి పిందెలు.. ఇంకా గొట్టు మాటలే జాలువారేవి. ఆయన నుంచి టిడిపి ని చేతుల్లోకి తీసుకున్న చంద్రబాబు తిట్లు నేర్చుకోలేదు. కానీ టిడిపి నుంచి బయటకొచ్చిన కేసిఆర్ తిట్లు నేర్చుకున్నారు. తిట్ల భాషకు ప్రాంతం, పార్టీ, కులం, బంధుత్వం ఏమీ తేడా లేకుండా ఉన్నది. కొందరు తిట్లతో పైకొస్తే కొందరు హుందాతనంతో మాట్లాడి పైకొచ్చారు.