తెలంగాణ : నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో ఖాళీ అయిన సీటుని గెలిచేందుకు విపక్షాలు ఇప్పటి నుంచే వ్యూహాలు మొదలుపెట్టాయి. ఇక్కడి నుంచి గతంలో రెండుసార్లు గెలిచిన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరతారని వార్తలు వచ్చాయి. ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి బీజేపీలో చేరి నాగార్జునసాగర్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. దీనిపై ఆయన కుమారుడు స్పందించినప్పటికీ.. తాను బీజేపీలో చేరబోనని మాత్రం చెప్పలేదు. ఇక రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశాల్లో పాల్గొన్న జానారెడ్డి.. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని చెప్పడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
రెండేళ్ల పదవీకాలం మాత్రమే ఉండే ఈ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయడం వల్ల ప్రయోజనం ఉండదని.. ఈ ఎన్నికల్లో తన కుమారుడు పోటీ చేస్తాడని ఆయన తెలిపారు. అంతేకాదు తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదని అన్నారు. అయితే తన కుమారుడు కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తారని మాత్రం జానారెడ్డి చెప్పకపోవడం కొత్త చర్చకు తెరలేపింది. అయితే ఇది జానారెడ్డి వ్యూహంలో భాగమే అనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. తాను ఇప్పుడు బీజేపీలో చేరడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని భావిస్తున్న జానారెడ్డి.. అక్కడ తనకంటే జూనియర్ల కింద తాను పనిచేయడం కాదనే భావనలో ఉండొచ్చనే టాక్ ఉంది.
అదే సమయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో తన కుమారుడు బీజేపీలో చేరితే నాగార్జునసాగర్ నుంచి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన భావించవచ్చనే చర్చ జరుగుతోంది. కుమారుడు వేరే పార్టీలోకి వెళితే.. జానారెడ్డి అడ్డుకునే అవకాశం కూడా లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. తన కుమారుడు బీజేపీ తరపున నాగార్జునసాగర్ బరిలో నిలబడితే… అక్కడ పోటీ చేయబోయే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకోసం జానారెడ్డి పూర్తిస్థాయిలో పని చేసే అవకాశం కూడా ఉండకపోవచ్చనే వాదన ఉంది.
తాను కాంగ్రెస్, తన కుమారుడు బీజేపీలో ఉండటం వల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయని… అలా ఉండటం వల్ల భవిష్యత్తులో రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా వ్యవహరించవచ్చని జానారెడ్డి అనుకుని ఉండొచ్చనే వార్తలు కూడా మొదలయ్యాయి. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారనున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నిక విషయంలో జానారెడ్డి ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది.