కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి శుక్రవారం నాడు జరిగిన విలేకరుల సమావేశంలో మరోసారి తనదైన శైలిలో స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ పాలనలో అప్పులు తప్ప అభివృద్ధి లేదని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని కేసీఆర్ గుర్తించాలన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే టీఆర్ఎస్ ఏం చేసేదని జానారెడ్డి ప్రశ్నించారు. రెండేళ్లుగా రాష్ట్రంలో రుణమాఫీ ఊసే లేదని తెలిపారు.రుణమాఫీ లేక రైతులపై మరింత భారం పడుతోందన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందని జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను ఇష్టా వచ్చినట్లు మాట్లాడితే చూస్తు ఊరుకోమని జానారెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికల గురించి మాట్లాడారు. ఎమ్మెల్యే పదవి తన స్థాయికి చిన్నదని, అయినా పోటీ చేస్తానని అన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని తనను అధిష్ఠానం ఆదేశించిందని జానారెడ్డి తెలిపారు. తనకు పదవులపై ఆశలేదని, అధిష్ఠానం ఆదేశాల మేరకు పోటీకి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణలో ఎమ్మెల్యేగా అత్యధికసార్లు గెలిచిన రికార్డు తనదేనన్నారు. మరోసారి గెలిచి నా రికార్డుని నేనే బద్దలుకొడతానన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపైన ప్రజలకు భ్రమలు క్రమంగా తొలగిపోతున్నాయని, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే దానికి నిదర్శనమని చెప్పారు. ప్రజాభిప్రాయం ప్రకారం కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్ర మంత్రి అమిత్షా వెనక్కు తీసుకుంటే మంచిదంటూ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.