కరీంనగర్ టిఆర్ఎస్ నేత తుల ఉమ దారేది ?

టిఆర్ఎస్ పార్టీలో యూటి బ్యాచ్ జాబితాలో ఉన్న మహిళా నేత తుల ఉమ. ఆమె ప్రస్తుతం కరీంనగర్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు. టిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఆమె పార్టీలో పనిచేస్తూ వచ్చారు. అయితే ఆమె తనకు 2014లోనే టికెట్ వస్తుందని ఆశించారు. కానీ కేసిఆర్ ఇవ్వలేదు. కానీ తర్వాత జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా అవకాశం కల్పించారు. జెడ్పీ ఛైర్ పర్సన్ పేరుకే తప్ప ఆమెకు ఆమేరకు గౌరవం దక్కలేదని ఆమె అనుచరులు చెబుతున్నమాట. కరీంనగర్ లోని వేములవాడ, కోరుట్ల దొరలు ఆమెకు పార్టీలో పొగ పెడుతున్నట్లు ఆరోపణలున్నాయి. మరి తాజా ఎన్నికల నేపథ్యంలో తుల ఉమ దారేది ? చదవండి ఫుల్ స్టోరీ.

తుల ఉమ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆశతో ఉన్నారు. ఆమె నిత్యం ప్రజల్లో ఉన్నారు కాబట్టి పోటీ చేయాల్సిందే అని ఆమెపై కార్యకర్తలు తీవ్రమైన వత్తిడి తీసుకువస్తున్నారు. ఒక దశలో ఆమె కూడా వేములవాడలో పోటీ చేయాలని భావించారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ కేసిఆర్ నో చెప్పేశారు. ఆమె వేములవాడలో పోటీ చేయాల్సిందే అని ఆమె వర్గం కార్యకర్తలు మీటింగ్స్ పెట్టి జిల్లాలో హల్ చల్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమెకు టిఆర్ఎస్ లో పోటీ చేసే చాన్స్ దక్కలేదు. 

వేములవాడ సీటును తుల ఉమ ఆశించినా కేసిఆర్ తాజా మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ రావు కే మళ్లీ అవకాశం కల్పించారు. అయితే చెన్నమనేని రమేష్ రావు వెలమ సామాజికవర్గానికి చెందిన నేత. ఆయన చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. ఆయన పౌరసత్వం మీదనే పెద్ద వివాదం నెలకొన్నది. ఆయన జర్మన్ దేశస్తుడు అని చెబుతారు. ఇక్కడ దొంగతనంగా పౌరసత్వం తీసుకున్నాడని అప్పట్లో బిజెపిలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిన ఆది శ్రీనివాస్ పట్టు వదలని విక్రమార్కుడి వలే పోరాడారు. ఇంకా కోర్టుల్లో పోరాడుతూనే ఉన్నాడు.  ఒక దశలో చెన్నమనేని రమేష్ రావు చిక్కుల్లో పడ్డారు. కానీ తర్వాత కోర్టులో రిలీప్ దొరికింది.  అంతలోనే అసెంబ్లీ రద్దు కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

వేములవాడ ఎమ్మెల్యే వేధింపులు

వేములవాడలో తుల ఉమ పోటీ చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఆమెను చెన్నమనేని రమేష్ రావు టార్గెట్ చేశారు. ఆమెను అడుగడుగునా అవమానాలపాలు చేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి. జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా ఆమెను పిలవకుండానే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలున్నాయి. అంతేకాదు మరీ దారుణమైన విషయమేమంటే మంత్రి పేరు, ఎమ్మెల్యే పేరు, సర్పంచ్ పేరు, వార్డు మెంబర్ పేరు వేసి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా ఉన్న ఆమె పేరు వేయకుండానే శిలాఫలకాలు నాటించారు చెన్నమనేని. ఈ విషయం అప్పట్లోనే తీవ్ర దుమారం రేపింది. తుల ఉమకు టిఆర్ఎస్ లో పొగ పెడుతున్నారని ప్రచారం సాగింది.

అంతేకాకుండా తుల ఉమ తన ఊరు వేములవాడ నియోజకవర్గానికి వస్తుంది. కతలాపూర్ మండలంలోని ఒక గ్రామం తుల ఉమది. ఆ కతలాపూర్ గ్రామం ఇటు వేములవాడ, అటు కోరుట్ల నియోజకవర్గాల మధ్య బార్డర్ లో ఉంటుంది. దీంతో ఆమె కోరుట్లలో పోటీ చేయవచ్చన్న ప్రచారం కూడా అప్పట్లో సాగింది. దీంతో కోరుట్లలో ఉన్న వెలమ సామాజిక వర్గానికి చెందిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కూడా ఆమెను టార్గెట్ చేశారు. ఆమె పేరు లేకుండానే శిలాఫలకాలు రాయించారన్న విమర్శలున్నాయి.

కొన్ని సందర్భాల్లో తుల ఉమ వేములవాడ నియోజకవర్గంలో పర్యటనకు పోతే పోలీసులు కూడా సహకరించేవారు కాదని చెబుతారు. జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా ఉన్న ఆమెకు ఎస్కార్ట్ గా కూడా పోలీసు వాహనాలు రాకుండా స్థానిక ఎమ్మెల్యే అడ్డుకునేవాడని ఉమ వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే ఆదేశించడంతో పోలీసులు ఎస్కార్ట్ డ్యూటీకి రాకుండా మొరాయించిన సందర్భాలున్నాయి. ‘‘మావోయిస్టు బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఉమక్క హంగులు ఆర్భాటాలకు దూరం కాబట్టి ఎస్కార్ట్ వాహనాలు రాకపోయినా తన పర్యటన తాను చేసి వెళ్లిపోయిేవారు’’ అని తుల ఉమ అనుచరుడు జంగిటి వెంకన్న ‘తెలుగురాజ్యం’కు చెప్పారు.  ఫ్యూడల్ రాజ్యం అంటే ఏందో కరీంనగర్ లో దొరలు రుచి చూపిస్తున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

 

ఇక కోరుట్ల నియోజవకర్గం టిఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కూడా తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్నారు. జనాలు ఫోన్ చేస్తే వారిని చెడామడా తిట్టినట్లు అప్పట్లో ఆయన తిట్ల తాలూకు ఆడియో టేపులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. అయితే ఒక దశలో చెన్నమనేని రమేష్ రావుతోపాటు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ను కూడా కేసిఆర్ మారుస్తారని ప్రచారం సాగింది. కానీ సిట్టింగ్ లకు ప్రాధాన్యత కింద వారిద్దరినీ కేసిఆర్ కొనసాగించారు. 

తుల ఉమ పార్టీ మారుతారా ?

కొంగర కలాన్ సభ తర్వాత అసెంబ్లీ రద్దు, ఆ తర్వాత సిట్టింగ్ లు అందరికీ సీట్లు ఇచ్చేశాక తుల ఉమ పార్టీ మారుతారని ప్రచారం మొదలైంది. అది ఇంకా సద్దుమణగలేదు. ఆమె మాత్రం తాను టిఆర్ఎస్ లోనే కొనసాగుతానని ప్రకటిస్తున్నారు. కానీ కేడర్ మాత్రం ఆమెపై తీవ్రమైన వత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో తుల ఉమ ముందున్న దారులు ఇవే.

1 ఆమె సీటు రాలేదు కాబట్టి పాత విషయాలన్నీ మరచిపోయి టిఆర్ఎస్ లోనే కొనసాగడం.

2 టిఆర్ఎస్ లో అవమానాలను భరించలేని కారణంగా పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరడం

3 కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే బలమైన అభ్యర్థులు ఉన్నారు కాబట్టి వేములవాడ సీటు రాదన్న ఉద్దేశం ఉంటే బిజెపిలోకి వెళ్లడం

4 మావోయిస్టు బ్యాక్ గ్రౌండ్ ఉన్న తుల ఉమ బిజెపిలోకి వెళ్లడానికి సుముఖంగా లేకపోతే టిఆర్ఎస్ రెబెల్ గా బరిలో ఉండడం. 

ఈ నాలుగు మార్గాల్లో తుల ఉమ ఏ దారి వెతుక్కుంటారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. 

 

తుల ఉమకు వేములవాడ టికెట్ ఇవ్వాలంటూ భారీగా టిఆర్ఎస్ కార్యకర్తల సభ జరిగింది. ఆ సభ వీడియో కింద ఉంది చూడండి.