వైఎస్ఆర్ కుమార్తె, జగన్ సోదరి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టడానికి సంసిద్దమైన సంగతి తెలిసిందే. ఉన్నట్టుండి షర్మిల ఇలా కొత్త పార్టీ పెట్టడం వెనుక ఏవేవో కారణాలు, రాజకీయ సమీకరణాలు, పెద్ద పార్టీల ప్లానింగ్ ఉన్నాయని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటన్నింటినీ పక్కనపెడితే పార్టీ పెట్టడానికి షర్మిల చెబుతున్న ప్రధాన కారణం రాజన్న రాజ్యం తీసుకురావడం. తెలంగాణలో రాజన్న రాజ్యం లేదని, ఎందుకు ఉండకూడదని, రాజన్న రాజ్యాన్ని తీసుకురావడానికి పార్టీ పెడుతున్నానని అన్నారామె. ఆమె మాటలు విన్న జనం అసలు తెలంగాణలో రాజన్న రాజ్యం అవసరం ఏముంది అనుకుంటున్నారు.
నిజమే.. తెలంగాణలో రాజన్న రాజ్యం ఆవశ్యకత ఏమైనా ఉందా అనేది షర్మిల ఆలోచించుకోవాల్సిన విషయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో ఆంధ్రా పాలకుల పాలనను ఆక్కడి జనం వద్దని అనుకోవడమే. ఇంకెన్నాళ్లు పరాయి ప్రాంతం నుండి వచ్చిన నాయకుల పాలనలో మగ్గిపోతాం, మా ప్రాంతాన్ని మేము పాలించుకోగలం అనే నినాదంతో కేసీఆర్ ఉద్యమం లేవదీశారు. జనం సైతం ఆంధ్రా పాలకులు అన్నీ దోచుకుపోతూ తమను ఒట్టివారిని చేస్తున్నారని ఉద్యమానికి నూటికి నూరు శాతం మద్దతిచ్చారు. ఇప్పటికీ వారు అదే మాటమీదున్నారు. రేపు ఆమె పార్టీని వేలెత్తిచూపాలనుకున్నప్పుడు కేసీఆర్ సైతం ఆంధ్రోళ్లు దోచుకుపోవడానికి మళ్ళీ వచ్చారని, మనల్ని మనం పాలించుకోలేమా, పాలన మనకు చేతకాదనే కదా వీరి ఉద్దేశ్యం అంటారు.
ఈ సంగతులు షర్మిలకు తెలియనివి కావు. మరి తండ్రి వైఎస్ఆర్ ఛరీష్మాను వాడుకుని హడావుడి చేద్దామని అనుకుంటున్నారేమో ఆమె. అందుకే రాజన్న రాజ్యం తీసుకొస్తామనే నినాదంతో పార్టీ పెడుతున్నారు. వాస్తవానికి చూస్తే కాంగ్రెస్ పార్టీయే తెలంగాణలో వైఎస్ఆర్ పేరును వాడుకోవడానికి వెనకడుగు వేసింది. వైఎస్ఆర్ మీద రాయలసీమ నాయకుడనే ముద్ర బలంగా ఉంది. ఇప్పుడు షర్మిల వచ్చి రాజన్న రరాజ్యాన్ని తీసుకొస్తానని అంటే జనం ఒప్పుకుంటారా ఓట్లు వేస్తారా అంటే డౌటే. అసలు ఇప్పుడు తెలంగాణలో రాజన్న రాజ్యం రావాల్సిన అవసరం ఏముంది అనొచ్చు కూడ.