డిసెంబరు 7 కేసిఆర్ కు రివర్స్ సెంటిమెంటేనా ?

తెలుగు రాజకీయ నాయకుల్లో సెంటిమెంట్లు, జాతకాలు, యాగాలు, ముహూర్త బలాలు, జ్యోతిష్యం, సంఖ్యా శాస్త్రం, తిథులు, నక్షత్రాలు, గ్రహాల అనుగ్రహ స్థితి వంటి అంశాలను తూ.చా తప్పకుండా పాటించే నాయకుల్లో గులాబీ బాస్ కేసిఆర్ ముందు వరుసలో ఉంటారు. ఆయన ప్రతి చర్య వీటిలో ఏదో ఒకదాని మీద కచ్చితంగా డిపెండ్ అయి ఉంటుంది. మానవాతీత శక్తులను నమ్మకున్న రాజకీయా నాయకుల లిస్టులోనూ కేసిఆరే అగ్ర భాగాన నిలుస్తారు. 

నిజానికి 2019లో పార్లమెంటులో పాటు అసెంబ్లీకి కూడా సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఎలాంటి సహేతుకమైన కారణం లేకుండానే ఎన్నికలు ముందుకు జరిపారు కేసిఆర్. ఉన్నఫలంగా ఆయన తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్నారు. అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేశారు. ఇది తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపింది. 

అసలు ఏ బలమైన కారణం లేకుండానే కేసిఆర్ ఎందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్లారన్నది ఊహించడం జనాలకు పెద్ద కష్టమేమీ కాదు. రాజ్యాంగబద్ధంగానే ఈ నిర్ణయాన్ని కేసిఆర్ తీసుకున్నారు కాబట్టి ముందస్తుకు ఎక్కడా పెద్దగా ఆటంకాలు కలగలేదు. కోర్టుల్లో అభ్యంతరాలు లేవనెత్తినా నిలబడలేదు. మరి ముందస్తు ఎన్నికలు ఎందుకొచ్చాయంటే కేసిఆర్ చెప్పే సమాధానం మాత్రం గులాబీ శ్రేణులను కూడా సంతోషపరచలేకపోతున్నది.

తెలంగాణలో రాజకీయ అస్థిరత లేదు. ప్రతిపక్షాలు కుట్రలు చేసి సర్కారును కూలదోసే వాతావరణం లేదు. అసలు ప్రతిపక్షాలు ఉంటే కదా అన్న వాతావరణం ఉంది. 63 సీట్లు గెలిచిన కేసిఆర్ తెలంగాణలో ఉన్న అన్ని పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యేలను గుంజుకుని తన పార్టీలో కలుపుకున్నారు. ఒకాయనకు మంత్రి పదవి కూడా కట్టబెట్టారు.

2014 ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు చూస్తే అసెంబ్లీలో సిపిఐ అంతరించింది. వైసిపి అంతరించింది. టిడిపి బక్క చిక్కి ఇద్దరు సభ్యులకు పరిమితమైంది. కాంగ్రెస్ కూడా ప్రధాన ప్రతిపక్షమన్న పేరే కానీ సభ్యులంతా ఆకర్ష్ దెబ్బకు గులాబీ గూట్లో పడ్డారు. బిజెపి, సిపిఎం, ఎంఐఎం తప్ప అన్ని పార్టీలను కేసిఆర్ ఆకర్ష్ పేరుతో టచ్ చేసి ఎమ్మెల్యేలను జేబులో వేసుకున్నారు.  

రాజకీయ అస్థిరత లేకపోయినా అసెంబ్లీ రద్దు ఎందుకు జరిగిందంటే కేసిఆర్ చెప్పే మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ‘‘ప్రతిపక్షాలు అస్తమానం విమర్శలు చేస్తున్నాయి.. కారు కూతలు కూస్తున్నాయి. నాకు కోపమొచ్చి రారి ఎన్నికలకు పోదామన్నా.. వాళ్లు మేం రెడీ మేం రెడీ అన్నారు. చలో అసెంబ్లీ రద్దు చేసి పారేశిన. ఇప్పుడు బీరాలు పలికన ప్రతిపక్ష నేతలు గోడలు గోకుతున్నారు’’ అని కేసిఆర్ బహిరంగ సభల్లో చెబుతున్నమాటలు.

కానీ జనాలకు చెబుతున్నదాంట్లో నిజమెంత? లోలోన అసలు కథేంటి? అన్నది కొంతమందికి మాత్రమే తెలిసిన రహస్యం. అదేమంటే కేసిఆర్ కు ఉన్న అపారమైన సెంటిమెంట్స్ లోకి తొంగి చూస్తే తప్ప ఈ విషయం అర్థం కాదు. సంఖ్యా శాస్త్రం ప్రకారం కేసిఆర్ లక్కీ నెంబరు 6. తన రాజకీయ జీవితంలో కేసిఆర్ ప్రతి అడుగు కూడా 6 తోనే ముడిపడి ఉన్నది. ఒకటి అరా తప్ప అన్ని విషయాల్లోనూ కేసిఆర్ 6ను ఫాలో అవుతారు. దాంతోపాటు జాతకాలు, ముహూర్త బలాలు, నక్షత్ర బలాలు, గ్రహాల స్థితిగతులను కూడా.

అయితే ఈలెక్కన డిసెంబరు 6వ తేదీన ఎన్నికలు వచ్చి ఉంటే బాగుండేదేమో. కానీ డిసెంబరు 6 బ్లాక్ డే ఉండింది. అంతేకాదు డిసెంబరు 7వ తేదీన అమావాస్య ఉన్నది. ఈ రెండు పరిణామాలు కేసిఆర్ కు మింగుడు పడని అంశాలుగా కనబడుతున్నాయి. కేసిఆర్ జాతకాలు, నమ్మకాలతో ఎన్నికల సంఘానికి పని లేదు కదా? అందుకే వారు కామన్ గా డిసెంబరు 7వ తేదీన వేరే రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా సింగిల్ సెషన్ లో ఎన్నికలు ముగిస్తామని ప్రకటించింది.

మరి ఈ నిర్ణయం మీద గులాబీ బాస్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. డిసెంబరు 6వ తేదీన మధ్యాహ్నం 11గంటల 59 నిమిషాలకు అమావాస్య జొరబడి డిసెంబరు 7వ తేదీన మధ్యాహ్నం 12.16 గంటలకు వెళ్లిపోతున్నది. సరిగ్గా డిసెంబరు 7వ తేదీన ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవుతుందంటే.. అమావాస్య వేళ ప్రారంభం అవుతున్నట్లు లెక్క. మరి దీన్ని గులాబీ పార్టీ ఏరకంగా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి.

అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా పండితులు వెల్లడిస్తున్నారు. కేసిఆర్ పేరు బలం బాగుంటే అమావాస్య అయినా సరే విజయం సాధించి తీరతారు అని కూడా అంటున్నారు. సాధారణంగా అమావాస్య తెలుగు ప్రజలకు కీడు దినంగానే చెబుతుంటారు. మరి దీన్ని ఏ రకంగా టిఆర్ఎస్ చూస్తుందన్నది తేలాలంటే వేచి చూడాల్సి ఉంది.  ఇటు లక్కీ నెంబరు రాలే.. అటు అమావాస్య పూట ఎన్నికలు జరగడం కొత్త చర్చకు దారి తీస్తున్నది.

అంతేకాకుండా కొంగర కలాన్ సభకు సరిగ్గా 24 గంటల ముందే సభా ప్రాంగణంలో వచ్చిన ఈదురు గాలులు, వర్షానికి ఆకాశమంత పెద్దగా వేసిన కేసిఆర్ కటౌట్ కుప్పకూలిపోయింది. దాన్ని కూడా చెడు సంకేతంగానే రాజకీయ వర్గాల్లో ఒక టాక్ అయితే ఉంది. దానికి ఇప్పుడు ఎన్నికల తేదీ వచ్చి చేరింది. ఏమైతుందో మరి.

యాదృచ్ఛికమో.. సాదారణంగా జరిగిందో కానీ తెలంగాణ అసెంబ్లీ రద్దు అయిన తేదీ సెప్టెంబరు ఆరు. ఈ తేదీకి ముహూర్త బలం ఉందని కేసిఆర్ అన్ని కోణాల్లో చర్చించి పండితుల సలహాలు, సూచనలు తీసుకుని అసెంబ్లీ రద్దు చేసుకున్నారు. సరిగ్గా నెల రోజులకు కేంద్ర ఎన్నికల కమిషన్ అక్టోబరు 6వ తేదీన షెడ్యూల్ వెల్లడించింది. అక్టోబరు 6 అనేది కేసిఆర్ కు కలిసొచ్చే లక్కీ నెంబరే కావొచ్చు. కానీ డిసెంబరు 7 విషయంలో మాత్రం ఉత్కంఠ నెలకొంది.

 

నోట్ : అసలు కేసిఆర్ జాతక చక్రం ఎలా ఉంది? కేసిఆర్ పేరు బలం ఎలా ఉంది. డిసెంబరు 7 కేసిఆర్ కు మేలా, కీడా అనే అంశాలను రెండో ఎపిసోడ్ లో మీకు అందజేస్తాము. అమావాస్య, ఏడో తేది ని పండితులు ఎలా విశ్లేషిస్తున్నారు?  వివరాల కోసం మరికొద్ది క్షణాలు ఎదురుచూస్తూ ఉండండి…

(తెలుగురాజ్యం.కామ్ టీమ్)