కేసిఆర్ కు స్టూడెంట్ షాక్, రాజ్ భవన్ ముందు ఆత్మహత్యాయత్నం

 

తెలంగాణ సిఎం కేసిఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నవేళ ఊహించిన షాక్ తగిలింది. కేసిఆర్ నిర్ణయాన్ని విద్యార్థులు, నిరుద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారని తేలిపోయింది. నిజాం కాలేజికి చెందిన పూర్వ విద్యార్థి ఈశ్వర్ ఏకంగా రాజ్ భవన్  వద్దకు వచ్చి తనతోపాటు తెచ్చుకున్న కిరోసిన్ ను మీద పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే ఆయనను రాజ్ భవన్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఒంటికి నిప్పు పెట్టుకోకముందే అడ్డుకున్నారు. ఈశ్వర్ ఒంటి మీద నీళ్లు పోశారు.

ఈ సందర్భంగా ఈశ్వర్ తెలంగాణ సిఎం కేసిఆర్ పై తీవ్రమైన విమర్శలు చేశారు. ఎందుకు ముందస్తు ఎన్నికలకు పోతున్నాడని మండిప్డడాడు. కేసిఆర్ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశాడని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఎలాంటి మేలు చేశాడని నిలదీశారు. అసెంబ్లీ రద్దు ఎందుకు చేసిండో చెప్పాలని ప్రశ్నించాడు. అసెంబ్లీ రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగానే తాను రాజ్ భవన్ వద్ద ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించానని చెప్పాడు. కేసిఆర్ ఉద్యమకారులకు ఏం చేసిండో చెప్పాలని ప్రశ్నించాడు. తెలంగాణలో మేము నీకు అధికారం ఇస్తే ఏం చేస్తున్నవు అని నిలదీశారు.

మీడియా ప్రతినిధులు, రాజ్ భవన్ సిబ్బంది ఈశ్వర్ ను కాపాడారు. తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. ఈశ్వర్ నల్లగొండ జిల్లాలోని నార్కట్ పల్లి మండలానికి చెందిన ఓరెండి గ్రామస్థుడు. ప్రగతిభవన్ లో కేబినెట్ భేటీ ప్రారంభమైన సమయంలోనే రాజ్ భవన్ ముందు ఈశ్వర్ ఈ ఘటనకు పాల్పడడం సంచలనం రేపింది. ఈశ్వర్ ఆత్మహత్యాయత్నం చేసిన 20 నిమిషాల వ్యవధిలోనే సిఎం కేసిఆర్ ప్రగతిభవన్ లో కేబినెట్ సమావేశం ముగించుకుని నేరుగా రాజ్ భవన్ కు చేరుకున్నారు. రాజ్ భవన్ లో అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని గవర్నర్ కు అందజేశారు.

ఈశ్వర్ గ్రూప్ వన్ బాధితుడు. గతంలో గ్రూప్ అభ్యర్థులు చేసిన ఆందోళనలో ఈశ్వర్ పాల్గొన్నాడు. ఆ ఆందోళనలో తన తల పగిలిందని కూడా మీడియాకు చెప్పాడు ఈశ్వర్.