లండన్ ను వెనక్కి తోసేసిన హైదరాబాద్ .. ఎందులో అంటే !

హైదరాబాద్ అంటే చరిత్రలకి పుట్టినిల్లు.. అలాంటి హైదరాబాద్ చరిత్రలో మరో అరుదైన ఘనత వచ్చి చేరింది. ప్రపంచంలోనే అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరాల్లో రెండో స్థానంలో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. తొలి స్థానంలో మనదేశానికే చెందిన చెన్నై ఉండటం గమనార్హం. రెండు దక్షిణాది నగరాలకు జాబితాలో చోటు దక్కడం, రెండూ ప్రపంచంలోనే ప్రథమ, ద్వితీయ స్థానాలు దక్కించుకోవడంపై ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేశారు.

యూకేకి చెందిన సర్ఫ్‌షార్క్‌ సంస్థ అంతర్జాతీయంగా 130 నగరాల్లో సర్వే చేసి ఈ వివరాలు వెల్లడించింది. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులకు సమానం అనే నినాదంతో ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం, పోలీసుశాఖ.. సీసీ కెమెరాల ఏర్పాటులో ఈ సరికొత్త మైలురాయి అందుకున్నాయి. నగరంలో ప్రతీ చదరపు కిలోమీటరుకు 480, వెయ్యి మందికి 30 సీసీ కెమెరాలు ఉన్నాయని సర్వే స్పష్టం చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనేది తెలంగాణ పోలీసుశాఖ సంకల్పం. ఇప్పటిదాకా 6.65 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇందులో 2020లోనే 99,095 అమర్చాం. త్వరలోనే లక్ష్యాన్ని చేరుకుంటాం. గతేడాది 4,490 కేసుల్లో నేరస్థుల్ని పట్టుకోవడంలో సీసీ కెమెరాలు కీలకంగా వ్యవహరించాయి అని డీజీపీ డాక్టర్‌ ఎం మహేందర్‌రెడ్డి తెలిపారు. సంఖ్య పరంగా చూస్తే చెన్నై కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ సీసీ కెమెరాలున్నాయి. అయితే చెన్నై విస్తీర్ణం 426 చదరపు కి.మీ. కాగా… హైదరాబాద్‌ది 625 చదరపు కి.మీ. అందువల్లే ప్రతి చదరపు కి.మీ.కి ఉన్న కెమెరాల అంశంలో చెన్నై మొదటి స్థానం ఆక్రమించింది.