అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. గురువారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. బోయింగ్ 787-8 విమానం టేకాఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే అంతస్థు కోల్పోయి నేలకు ఢీకొట్టి మంటలు చెలరేగాయి.
ఈ విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ నేత విజయ్ రూపానీ కూడా ఉన్నట్టు సమాచారం. ప్రమాద సమయంలో విమానం 825 అడుగుల ఎత్తులో ఉన్నదని అధికారులు వెల్లడించారు. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే విమానం కంట్రోల్‌ను కోల్పోయిందని, ఆ తర్వాత నేలపై పడిపోయినట్లు చెబుతున్నారు.
విమానం కూలిన వెంటనే మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఇప్పటి వరకు 100 మందికిపైగా మృతిచెందినట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది.
ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బ్లాక్ బాక్స్‌ను గుర్తించి విచారణకు పంపారు. విమానం టేకాఫ్ సమయంలో ఏవైనా సాంకేతిక లోపాలు తలెత్తాయా? లేక వాతావరణ పరిస్థితుల ప్రభావమా? అనే కోణాల్లో విచారణ సాగుతోంది. ఈ ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారికంగా ప్రకటన చేయనుంది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే బాధితుల కుటుంబ సభ్యులు విమానాశ్రయానికి చేరుకొని కన్నీటి పర్యంతమవుతున్నారు.