తెలంగాణలో నెక్స్ట్ సర్కార్ కాంగ్రెస్ దేనా? వివాదం రేపిన పోలీస్ సంకేతాలు

తెలంగాణలో పోలీసుల మైండ్ సెట్ మారిపోతున్నదా? ఇంతకాలం టిఆర్ఎస్ వైపు మొగ్గుచూపినట్లు కనబడిన పోలీసులు ఇక కాంగ్రెస్ వైపు మల్లుతున్నారా? టిఆర్ఎస్ అధికారంలోకి రాదన్న ఉద్దేశం పోలీసు వర్గాల్లో ఏమైనా ఉందా? లేకుంటే మరేదైనా బలమైన కారణం ఉందా? హైదరాబాద్ ఫ్రెండ్లీ పోలీసులు చేసిన ఒక చర్య వివాదం రేపింది. ఆ వివరాలేంటో చదవండి. 

తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ సేవలో తరించిపోయారు హైదరాబాద్ పోలీసులు. సికింద్రాబాద్ లోని ఎంసిఎ లో ఆల్ ఇండియా క్రిస్టియన్ పెడరేషన్ ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పిసిసి చీఫ్ ఉత్తమ్ ను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. ఈ సమావేశంలో తెలంగాణ లోని వివిధ చర్చీల బిషప్స్, పాస్టర్స్ హాజరయ్యారు.

ఈ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులైన పాస్టర్ గద్దపాటి విజయరాజు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఉత్తమ్ ను గజమాలతో ఘనంగా సత్కరించాలనుకున్నారు. కానీ… ఈ గజమాలను దుకాణం నుంచి సమావేశ మందిరం వరకు ఎలా తీసుకొచ్చారో తెలుసా? స్థానిక పోలీసు వాహనంలో తీసుకొచ్చారు. నిర్వాహకుల సేవలో పోలీసు జీపు తరించింది.

నిర్వాహకుల మీద మరి స్థానిక పోలీసులకు ప్రేమ ఉందా? లేక పై అధికారుల ఆదేశాలేమైనా ఉన్నాయా తెలియదు కానీ పోలీసు వాహనంలో ఉత్తమ్ సత్కారం కోసం గజమాల తీసుకురావడం వివాదాస్పదమైంది. నిజానికి పోలీసులు ప్రజా సేవ చేయాలి. ప్రజలకు కష్టం రాకుండా ఉండేందుకు వారు డ్యూటీ చేస్తారు. కానీ ఈ సభ నిర్వహణలో పాలు పంచుకోవడమేంటి? గజమాల తెచ్చేందుకు పోలీసు జీపులు ఇచ్చుడేంది అన్నది తేలాల్సి ఉంది. ఈ విషయం మీడియాకు పొక్కడంతో సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ కు ఆ గజమాలతో సత్కారం చేయకుండానే సమావేశం ముగించేశారు.

తెలంగాణలో అధికార మార్పిడికి సంకేతమా ?

తెలంగాణలోని టిఆర్ఎస్ సర్కారు తీరు పట్ల ఒక సెక్షన్ పోలీసు ఉన్నతాధికారులు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. పోలీసు ఉన్నతాధికారులే కాదు సివిల్ సర్వెంట్లు అయిన ఐఎఎస్ లు కూడా లోలోన రగిలిపోతున్నారు. దానికి నిదర్శనమే ఇటీవల కాలంలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు బట్టి విక్రమార్కతో ఆ సెక్షన్ ఐఎఎస్ లు, ఐపిఎస్ లు సమావేశమయ్యారు. ఆ వివరాలు బయటకు పొక్కాయి. పెద్ద దుమారం రేగింది.

దళిత, క్రిస్టియన్ ఉన్నతాధికారులకు టిఆర్ఎస్ సర్కారులో ఏమాత్రం గౌరవం దక్కలేదన్న విమర్శలు ఉన్నాయి. అందుకే వారంతా ఆనాడు మల్లు బట్టి విక్రమార్కను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నట్లు వార్తలొచ్చాయి. అంతేకాదు రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్న ఇండికేషన్ కూడా ఆ  అధికారులు ఇచ్చినట్లు సోషల్ మీడియలో చర్చలు జరిగాయి.

ఎప్పుడైనా అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల తర్వాత తిగిరి మళ్లీ అధికారం చేపడుతుందా లేదా అన్నది ముందుగా పోలీసులకే తెలుస్తుంది. వారు ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం సేకరిస్తారు. అయితే పైకి కనబడకపోయినా పోలీసులు అనేవారు ఎన్నికలకు కొంత ముందుగానే ఏ పార్టీ ప్రభుత్వం వస్తుందో పసిగట్టి ఆ పార్టీతో అంటకాగే ప్రయత్నం చేస్తారన్న చర్చ ఉంది.

ఈ పరిస్థితుల్లో మొన్న మల్లు బట్టి విక్రమార్కను రహస్యంగా ఉన్నతాధికారులు కలవడం కానీ, నేడు ఉత్తమ్ గజమాల మోసుకొచ్చేందుకు పోలీసు జీపులు వినియోగించడం కానీ చూస్తుంటే పోలీసు వర్గాల్లో ఏదో తేడా కొడుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే స్థానిక ఒకరిద్దరు పోలీసు అధికారులు క్రిస్టియన్ ఫెడరేషన్ నిర్వాహకుల మెప్పు పొందేందుకు ఇలా చేశారా అన్నది కూడా తేలాల్సి ఉంది. అందులో భాగంగానే పోలీసు జీపు ను గజమాల మోసుకొచ్చేందుకు ఇచ్చారా? లేదంటే పై నుంచి ఆదేశాలేమైనా ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది. 

ఉత్తమ్ సత్కారం కోసం గజమాల తీసుకొచ్చిన జీపు, నిర్వాహకుల వీడియోలు కింద ఉన్నాయి చూడొచ్చు.

 

 

మోదీకి కేసిఆర్ చెంచా : ఉత్తమ్

సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ క్రిస్టియన్లపై వరాల జల్లు కురిపించారు. ఆయన ఏమన్నారంటే… ఈ దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పాలన అవసరం. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పిస్తాం. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో క్రైస్తవులకు ప్రాధాన్యత ఉంటుంది. మోడీ మాదిరిగా కొన్ని మతాలను టార్గెట్ చేయబోము. మోడీ ప్రధాని అయ్యాక క్రైస్తవ సంస్థలకు ఇబ్బంది కలిగింది.

మతాలు, కులాలుగా దేశాన్ని విభజించారు. అన్ని మతాలను గౌరవిస్తుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో కేసీఆర్ ని ఓడించండి. టిఆర్ఎస్ కి ఓటు వేస్తే మోడీకి వేసినట్టే. బీజేపీకి కేసీఆర్ చెంచా. కేసిఆర్ కు మోదీతో రహస్య ఒప్పందం ఉంది. రాత్రి ఢిల్లీకి కేసీఆర్ వెళ్ళింది కూడా అందుకే. మోడీతో రహస్యంగా కేసీఆర్ కలిశారు.  

ఫాస్టర్ లు, పూజరులు, మౌజాం ల పిల్లలకు ఉచిత విద్య కల్పిస్తాం. మత గురువులకు ఇండ్లు ఇస్తాం. అన్ని ప్రార్థన మందిరాలకు ఉచిత విద్యుత్ ఇస్తాం. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే క్రైస్తవ భవనం నిర్మిస్తాం. కేసిఆర్ లాగా మోసం చేయం. జేరుసలం పోవటానికి సబ్సిడీ ఇస్తాం. క్రిస్టియన్ కార్పొరేషన్ కి వంద కోట్లు కేటాయిస్తాం. 

పోలీసు వర్గాల్లో కలవరం

ఉత్తమ్ సన్మానం కోసం గజమాల తెచ్చేందుకు పోలీసు జీపును వినియోగించిన ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. దండ తెచ్చేందుకు పోలీసు జీపు ఎందుకు వినియోగించారన్నదానిపై విచారణ జరిపారు. మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. అయితే జీపులో గజమాల తెచ్చిన సమయంలో డ్రైవర్ తప్ప ఉన్నతాధికారులెవరూ లేరని తెలిసింది. ఈ వివాదం రేగడంతో గజమాలతో ఉత్తమ్ ను సన్మానించకుండా పక్కన పెట్టేశారు నిర్వాహకులు.