తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో దూకుడుగా ఉన్న ఒకే ఒక్క నేత రేవంత్ రెడ్డి. మిగిలిన వారంతా చూద్దాం, చేద్దాం అన్నట్టు ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం పరుగుల మీదున్నారు. ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా తన పోరాటం ఆగదన్నట్టే దూసుకుపోతున్నారు. రెండు రోజుల క్రితం ఆయన తలపెట్టిన పాదయాత్ర సక్సెస్ అయింది. ఇంత చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆయను గుర్తించట్లేదు. ఎంతసేపూ మోకాలడ్డే ప్రయత్నమే తప్ప ఎక్కడా కూడ కలిసి వెళ్దాం, అవకాశమిద్దాం అనే ఆలోచనే లేదు. కానీ రేవంత్ రెడ్డి పొటన్షియాలిటీని భారతీయ జనత పార్టీ గుర్తించింది. హస్తం పార్టీని పక్కకితోసి ప్రధాన ప్రతిపక్షంగా ఎలివేట్ అవుతున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలో ఇన్నాళ్లూ ఎవ్వరినీ పెద్ద సీరియస్ గా తీసుకున్నది లేదు.
అందరికీ ఒకటే వ్యూహం అమలుచేస్తూ వచ్చారు. కానీ రేవంత్ రెడ్డి కాస్త తేడాగా కనిపించారు వాళ్లకి. అందుకే ఆయన మీద గుర్తిపెట్టారు. కాంగ్రెస్ హైకమాండ్ పట్టించుకోవట్లేదు కానీ లేకుంటే రేవంత్ పీసీసీ చీఫ్ అవుతారని, పార్టీ ఆయన చేతుల్లోకి వెళితే తప్పకుండా పుంజుకుంటుందని గ్రహించారు. అందుకే ఇప్పటి నుండే ఆయన్ను నిలువరించే ప్రయత్నం స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన ముఖ్య అనుచరుల మీద కన్నేశారు. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ వారి మొదటి వికెట్. శ్రీశైలంగౌడ్ రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరుడుగా ఉంటూ వస్తున్నారు. పాదయాత్రలో సైతం కీలకంగా వ్యవహరించారు.
సీనియర్లు ఏమనుకున్నా ఆయన రేవంత్ పక్కనే ఉంటూ ప్రతి పనిలోనూ చేదోడు వాదోడుగా ఉండేవారు. అలాంటి వ్యక్తిని పక్కకు తప్పిస్తే పార్టీలో రేవంత్ పేరు మరింత వీక్ అవుతుందని, సీనియర్ల చేతికి గట్టిగా చిక్కిపోతారని పథకం వేసినట్టున్నారు. అనుకున్నదే తడవుగా మంతనాలు స్టార్ట్ చేశారు. మధ్యలో కాంగ్రెస్ నేతలు, రేవంత్ అనుచరులు బుజ్జగింపులు దిగినా శ్రీశైలంగౌడ్ మాత్రం నిర్ణయం మార్చుకోలేదు. ఆదివారం ఉదయమే కాంగ్రెస్ పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి శ్రీశైలం గౌడ్ రాజీనామా చేసి ఆరోజు సాయంత్రమే ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని మరిన్ని ఇబ్బందులకు గురిచేయకమానదు.